బండి వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్‌ఎస్‌.. విచారణకు సిద్ధమన్న సంజయ్

author img

By

Published : Mar 11, 2023, 7:48 PM IST

బండి వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్‌ఎస్‌.. విచారణకు సిద్ధమన్న సంజయ్

ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. సంజయ్‌ దిష్టిబొమ్మలను దహనం చేసి.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు నోటీసులు వస్తే తప్పకుండా మహిళా కమిషన్‌ ముందు హాజరవుతానని సంజయ్‌ తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. సంజయ్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. బండికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంజయ్‌ వెంటనే కవితకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బండి సంజయ్ వ్యాఖ్యలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఖండించారు. సంజయ్ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్‌, నన్నపనేని నరేందర్‌లతో కలిసి హనుమకొండలో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీకి మహిళలంటే గౌరవం లేదని.. ఆ పార్టీ నాయకులూ అదే రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితను అవమానపరిచేలా మాట్లాడిన సంజయ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చే బీజేపీకి అధ్యక్షుడినని పదే పదే చెప్పుకునే బండి సంజయ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని దుయ్యబట్టారు.

కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సంజయ్‌ను గాడిదపై కూర్చోబెట్టినట్లుగా ఉన్న ఫ్లెక్సీలను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళా లోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. బండి సంజయ్, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేయర్ నీతూ కిరణ్, మాజీ మేయర్ సుజాత, నుడా ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, నగర నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నోటీసులొస్తే కమిషన్‌ ముందు హాజరవుతా..: మరోవైపు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులపై బండి సంజయ్‌ స్పందించారు. తనకింకా నోటీసులు అందలేదన్న ఆయన.. నోటీసులు వస్తే తప్పకుండా మహిళా కమిషన్ ముందు హాజరవుతానని స్పష్టం చేశారు. బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్ కేసులు పెట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్‌ను డైవర్ట్‌ చేయడం కోసమే సంజయ్‌పై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడికి పోయిందని చింతల నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్‌లు తెలంగాణ తలదించుకునేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి..

కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు.. విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్

భట్టి విక్రమార్క పాదయాత్ర.. 91 రోజులకు షెడ్యూల్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.