ETV Bharat / state

రాములోరి తలంబ్రాలు హోమ్‌ డెలివరీ.. కావాలనుకుంటే పోస్టాఫీస్‌కు వెళ్లండి..

author img

By

Published : Mar 21, 2023, 5:27 PM IST

Bhadradri Ramayya talambralu home delivery: ఈ నెల 30న జరగనున్న భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవ తలంబ్రాలు భక్తులకు హోమ్ డెలివరీ చేయాలని తపాలా శాఖ నిర్ణయించింది. రాములోరి తలంబ్రాలు కావాలనుకున్న వారు ఈ నెల 28 వరకు బుక్‌ చేసుకునే వీలు కల్పించినట్లు తెలిపింది. తలంబ్రాలతో పాటు రెండు రకాల ప్రసాదాలనూ అందజేయనున్నట్లు స్పష్టం చేసింది.

Bhadradri Ramayya talambralu home delivery
Bhadradri Ramayya talambralu home delivery

Bhadradri Ramayya talambralu home delivery: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తపాలా శాఖ నిర్ణయించింది. తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములవారి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేర వేసేందుకు సన్నద్ధమవుతోంది. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్‌ఆర్టీసీ హోమ్‌ డెలివరీ చేస్తుందని తపాలా శాఖ పేర్కొంది. ఈ నెల 28 వరకు భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకునేందుకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించినట్లు తపాలా శాఖ అధికారులు స్పష్టం చేశారు. రెండు రకాల ప్రసాదాలనూ అందజేయనున్నట్లు వెల్లడించారు.

భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలు, అంతరాలయ అర్చనను తపాలా శాఖ అధికారులు భక్తులకు అందజేయనున్నారు. ఇందులో 10 గ్రాముల తలంబ్రాలు, 2 ముత్యాలు, పసుపు, కుంకుమ, మిస్రీ, కాజు అన్నీ కలిపి 80 గ్రాముల వరకు ఉంటాయి. వీటి ధర రూ.450లు ఉంటుంది. రెండవది శ్రీ సీతారామ కల్యాణ తలంబ్రాలు. ఇందులో రాములోరి కల్యాణ తలంబ్రాలు 20 గ్రాములు, 2 ముత్యాలు ఉంటాయి. వీటి ధర రూ.150లు ఉంటుంది.

మరింత సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ నంబర్..: భక్తులు పోస్టాఫీసు యాప్‌లో కానీ.. పోస్టుమెన్ ద్వారా కానీ.. స్థానిక తపాలా కార్యాలయంలో సంప్రదించి కానీ ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని పోస్టల్ అధికారులు తెలియజేశారు. ఇతర సమాచారం కోసం 1800-266-6868 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్‌ చేసి సంప్రదించవచ్చని సూచించారు. ప్రసాద వివరాలను భక్తుల చరవాణికి ఎస్.ఎం.ఎస్ రూపంలో తెలియజేస్తామని స్పష్టం చేశారు.

కానుకగా తలంబ్రాల ప్యాకింగ్ మిషన్‌..: ఇదిలా ఉండగా.. ఏపీలోని తిరుపతికి చెందిన సేవా కుటుంబం మహిళలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి రామయ్య సన్నిధికి రూ.1 లక్ష 70 వేల విలువ గల తలంబ్రాల ప్యాకింగ్ మిషన్‌ను కానుకగా అందించారు. గత కొన్నేళ్లుగా తాము భద్రాద్రి రామయ్యకు తలంబ్రాలు సమర్పిస్తున్నట్లు ఆ మహిళలు తెలిపారు. ఈ ఏడాది 2 క్వింటాళ్ల వడ్లను 5 రాష్ట్రాలలోని 4 వేల మంది ఆర్య వైశ్య మహిళలతో ఒలిపించి.. సోమవారం భద్రాద్రి రామయ్య సన్నిధికి అందించినట్లు వివరించారు. ఈ నెల 30న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఈ తలంబ్రాలను వాడనున్నారు.

ఇవీ చూడండి..

భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవానికి తేదీ ఖరారు.. ఎప్పుడంటే..?

శ్రీరామ పుష్కర పట్టాభిషేకానికి నదీ జలాల సేకరణ పూర్తి.. భద్రాద్రిలో ఘనంగా శోభాయాత్ర

300 మంది భక్తులు 300 కి.మీ... రథాన్ని నడుపుకుంటూ రామయ్య చెంతకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.