Assistance to flood victims: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉగ్రరూపం దాల్చి ప్రవహించిన గోదావరి వరదకు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. బూర్గంపాడు మండలంలో అనేక ఇల్లు వరద ముంపునకు గురయ్యాయి సుమారు పదివేల మంది నిరాశ్రయులుగా మారారు. గోదావరి వరద ముంపు వల్ల ఇబ్బందులు పడుతున్న వరద బాధితులకు ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యలు చేపట్టాయి.
బూర్గంపాడు మండలం జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత వరద ఉధృతి పెరిగిన నాటి నుంచి వరద బాధితులతో కలిసి సహాయ చర్యలు చేపట్టారు. ప్రతిరోజు సుమారు నాలుగువేల మందికి భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. భద్రాచలంలోని ఐటీసీ సంస్థ కూడా తమవంతు సాయంగా భోజన సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మరోవైపు చిన జీయర్ ట్రస్ట్, వికాస తరంగణి ఆధ్వర్యంలో బూర్గంపాడు మండలంలోను సారపాక సుందరయ్య నగర్ కాలనీలో సుమారు 2000 మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు.