తల్లి మరణవార్త వినగానే కుమారుడు చలించిపోయాడు. ఆఖరి చూపు చూసేందుకు ఖమ్మం నుంచి ఆదిలాబాద్ బయల్దేరాడు. అంతలోనే వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై ఆ కుమారుడు అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదం వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేట సమీపంలో జరిగింది.
ఆదిలాబాద్ జిల్లా టీచర్స్ కాలనీలో తల్లి శవం ఉండగానే.. సోదరుడు, అతని భార్య మరణించిన వార్త.. ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చిందని సుదర్శన్ వాపోయారు. తల్లితో పాటే విజయ్‌కుమార్ దంపతుల అంత్యక్రియలు తానే నిర్వహించనున్నట్లు సుదర్శన్ తెలిపారు.
పెంచికల్‌పేట సమీపంలో కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టగా.. చాట్ల విజయ్‌కుమార్- సునీత దంపతులు అక్కడికక్కడే మరణించారు. అదే కారులో ప్రయాణిస్తున్న వారి కుమార్తె మౌనిక, కారు డ్రైవర్ వర్ధన్రెడ్డిలు తీవ్రంగా గాయపడగా.. చికిత్స నిమిత్తం వారిని హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విజయ్‌కుమార్ విశ్రాంత సీఐగా గుర్తించారు. మృతదేహాలను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా