ETV Bharat / state

అక్కడ ఆ ఊర్లో ఉన్నవారికి మాత్రమే కామదహన ప్రసాదం.!

author img

By

Published : Mar 28, 2021, 4:30 PM IST

ఊరొదిలి వలసపోయేవారికి కామదహనం ప్రసాదం పంచడం నిషిద్ధం. ఇల్లరికం వెళ్లేవారు హోలీ వేడుకల తీపిపదార్ధాలు ముట్టుకోవద్దు. ఆదివాసీలు నిర్వహించే హోలీ పండుగలో అంతర్లీనమైన నియమమిది. ఆధునికులకు కొంత కొత్తగా అనిపించవచ్చు... కానీ అందులో అనుబంధాల బాంధవ్యం ఇమిడి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే కామదహనం, హోలీ పండగపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

adivasi holi tradition
ఆదివాసీల హోలీ సంప్రదాయం

ఆదివాసీల జీవ విధానంలో ఉన్న ఊరంటే ప్రాణప్రదమైన అక్షయపాత్ర లాంటిది. గ్రామస్థులందరినీ ఏకతాటిపై నడిపించే వేదికలాంటిది. దీనికి హోలీపండగ పేరిట నిర్వహించే కామదహనం ఏడాదంతా కాలసూచికగా నిలుస్తోంది. ఊళ్లో ఉంటారా..? వలసవెళ్తారా...? పెళ్లిచేసుకొని ఇంటికే కోడలిని తెస్తారా... లేక ఇల్లరికం చేసుకొని మరో ఊరికి వెళ్తారా..? అనేది తేలిపోతుంది. దీనికి అనుగుణంగానే కామదహన ప్రక్రియ జరుగుతుంది. ఊరొదిలి వలసలు పోయే వారికైనా, ఇల్లరికం పేరిట మరో ఊరికి వెళ్లిపోయేవారికి కామదహనం ప్రసాదాన్ని పంచిపెట్టడం నిషిద్ధం. అలాంటి ఆలోచన ఉన్న కుటుంబీకులు సైతం స్వచ్ఛందంగానే ఆ ప్రసాదాన్ని ముట్టుకోరు. ఆటపాటలతో పాటు... నియమనిష్టలకు లోబడి ఆదివాసీల హోలీ వేడుక సాగుతుంది.

అక్కడ ఆ ఊర్లో ఉన్నవారికి మాత్రమే కామదహన ప్రసాదం

ఊర్లో ఉంటేనే..

హోలీ రోజు పేద, ధనిక తేడా లేకుండా పటేల్‌ ఇంటి ముందు గూడెంవాసులంతా కలుసుకుంటారు. ప్రతి ఇంటి నుంచి సేకరించిన కొబ్బరి కుడుకలతో గారెలు, అప్పడాలు తయారు చేసి వాటిని మోదుగుపూలతో కలిపి వెదురుబొంగులకు కడతారు. అంతా కలిసి వాటిని ఊరి చివరన కామదహనం చేసి అక్కడే ఆడిపాడతారు. కాలుతున్న వెదురుబొంగుల చివరన ఉన్న కుడుకలు, పిండిపదార్థాలను పోటీపడి చేజిక్కించుకుని మరుసటి రోజు గూడెంలోని ఇంటింటికీ పంచిపెడతారు. ఊరి వదిలి వెళ్లేవారికి మాత్రం ప్రసాదం పంచి ఇవ్వరు. ఉద్యోగ, ఉపాధి రీత్యా ఏరోజుకారోజు బయటకు వెళ్లి తిరిగిరావచ్చు కానీ ఏడాదంతా ఊరొదిలి వెళ్తానంటే తమ ఆచారం అంగీకరించదంటారు ఆదివాసీ పెద్దలు.

ఆదివాసీల విశ్వాసం..

పండుగ రోజున మీరు, మేమూ అనే తేడాలేకుండా చిన్నపిల్లలకు చక్కెర పేర్లను బహుకరించడం, అంతా కలిసి కష్టసుఖాలను నెమరువేసుకుంటారు. ఏడాదిపాటు ఊరిబాగోగులను చర్చించుకోవడంలో రంగుల పండుగ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. హోలీ రోజు ఉన్న సంబరం ప్రతిరోజు ఉంటేనే ఊరు సుభిక్షంగా ఉంటుందనేది ఆదివాసీల విశ్వాసం. ఊరితో పాటు ప్రకృతిని కాపాడుకుంటేనే కలిసి జీవించవచ్చవనే భావన ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. కల్మషం లేని ఆ ఆచారమే నేటితరం ఆదివాసీ పిల్లలను సైతం ముందుకు నడిపిస్తోంది.

నియమాలను పాటిస్తూ..

ఉన్న ఊరిని వదలొద్దు.. జన్మభూమిని మరవద్దు అనే నియమంతో సాగే హోలీ వేడుక ఏడాదిపాటు ఆదివాసీల కాలసూచికగా నిలుస్తోంది. ప్రకృతిని విస్మరించకూడదనే ధర్మాన్ని ప్రబోధిస్తోంది.

ఇదీ చదవండి: మరో రెండురోజుల్లో ఎగువ మానేరుకు కాళేశ్వరం జలాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.