ETV Bharat / sports

'అమ్మాయిలు అందరిలో స్ఫూర్తి నింపిన పతకమిది'

author img

By

Published : Jul 25, 2021, 7:12 AM IST

మీరాబాయి చాను.. ఇప్పుడు ఈ పేరు ఓ సంచలనం. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకం నిరీక్షణకు తెరదించిన మీరాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మాయిలు వెయిట్​ లిఫ్టింగ్​ను కెరీర్​గా ఎంచుకునేందుకు అవకాశాలు పెరుగుతాయంటున్నారు కరణం మల్లీశ్వరి. 2000 సంవత్సరంలోనే తాను ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉన్నానని తెలిపారు. ఇప్పుడు పరిస్థితులు మరింత మెరుగుపడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు 'ఈనాడు' ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

కరణం మల్లీశ్వరి
karanam malliswari

సరిగ్గా 21 ఏళ్ల క్రితం సిడ్నీలో కాంస్యం నెగ్గి.. భారత ఒలింపిక్స్‌ చరిత్రలో పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది మన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి.ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను రజత పతకంతో సత్తాచాటింది. ఆమె పతకంతో దేశంలో క్రీడా సంస్కృతి పెరగడం ఖాయమంటోంది మల్లీశ్వరి.

ప్రతిభకు కొదవలేదు

21 ఏళ్ల తర్వాత వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌ కరవు తీరింది. వెయిట్‌ లిఫ్టింగ్‌ కుటుంబమంతటికీ ఇదో పండుగ. జూనియర్‌ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినింపిన పతకం ఇది. ఈ పతకం దేశానికి అవసరం కూడా. బాలబాలికలు వెయిట్‌ లిఫ్టింగ్‌ పట్ల ఆకర్షితులవడానికి ఈ పతకం ఎంతగానో దోహదం చేస్తుంది. దేశంలో వెయిట్‌ లిఫ్టింగ్‌లో ప్రతిభకు కొదవలేదు. సరైన వసతులు, శిక్షణ, అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. అందుకు మీరాబాయి చాను అతిపెద్ద ఉదాహరణ. ఈ జోరులో దేశంలో వెయిట్‌ లిఫ్టింగ్‌ సంస్కృతి మొదలవడం ఖాయం. ముఖ్యంగా అమ్మాయిల్లో. 2000లో నేను పతకం గెలిచాక చాలామంది అమ్మాయిల్లో ధైర్యం వచ్చింది. క్రీడల్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చని.. ఒలింపిక్స్‌లో పతకం సాధించొచ్చన్న ఆశలు చిగురించాయి. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది. నా రికార్డును చాను మరింత మెరుగు పరిచడం ద్వారా అమ్మాయిల్లో నూతనోత్తేజం రావడం ఖాయం. ప్రభుత్వం వెయిట్‌ లిఫ్టింగ్‌పై మరింతగా దృష్టిసారిస్తే అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు. వచ్చే ఒలింపిక్స్‌లో వెయిట్‌ లిఫ్టింగ్‌లోనే 2, 3 పతకాలు కచ్చితంగా వస్తాయి.

శుభ సూచకం..

ఒలింపిక్స్‌ ఆరంభంలో పతకాలు త్రుటిలో చేజారితే క్రీడాకారుల్లో నైరాశ్యం నెలకొంటుంది. మొదట్లోనే పతకం వస్తే ఆ జోష్‌ వేరేలా ఉంటుంది. ఇప్పుడు చాను పతకంతో భారత బృందంలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. గాయం నుంచి కోలుకుని ఒలింపిక్స్‌ పతకం గెలవడం మామూలు విషయం కాదు. అందరిలోనూ చాను ప్రేరణ నింపింది. ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి ఆడతారు. నా అంచనా ప్రకారం ఈసారి 12 పతకాలు రావొచ్చు. చాను అందించిన జోష్‌తో భారత క్రీడాకారులు సత్తాచాటడం ఖాయం.

అద్భుతమైన ఫలితాలు

చాను పతకం దేశంలోని క్రీడారంగాన్ని మలుపు తిప్పుతుందనడంలో నాకెలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వెయిట్‌ లిఫ్టింగ్‌కు ఆదరణ పెరగడం ఖాయం. సిడ్నీలో పతకం సాధించిన సమయం ఈస్థాయిలో సమాచార విప్లవం లేదు. చాను పతకం గెలిచిన రెండు నిమిషాల్లోనే ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల మంత్రి అభినందించారు. యావత్‌ దేశం సంబరాలు చేసుకుంటుంది. నేను ఒలింపిక్స్‌కు వెళ్లినప్పుడు భారత్‌లో క్రీడా సంస్కృతి లేదు. భారత జట్టులో ఎవరెవరు ఒలింపిక్స్‌కు వెళ్తున్నారో కూడా చాలామందికి తెలిసేదే కాదు. పతకం సంగతి సరేసరి. 1995లో ప్రపంచ ఛాంపియన్‌ అయినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. పత్రికల్లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ పేజీలో చిన్న పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో వేసి వార్త రాశారు. ఇప్పుడు మీడియా ప్రభావం పెరిగింది. పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది. క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుంది. ప్రైవేటు స్పాన్సర్లు కూడా ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు వెన్నుదన్నుగా క్రీడాకారులు పూర్తిగా ఆటపైనే దృష్టిసారిస్తారు. అప్పుడే అద్భుతమైన ఫలితాలు సాధ్యమవుతాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.