భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి సత్తా చాటాడు. 'నార్వే చెస్ ఓపెన్ గ్రూప్ ఏ' విభాగంలో విజేతగా నిలిచాడు. భారత్‌కే చెందిన ప్రత్యర్థి వీ ప్రణీత్‌పై గెలుపొంది టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ 16 ఏళ్ల గ్రాండ్ మాస్టర్.. వరుసగా తొమ్మిది రౌండ్లలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మొత్తం తొమ్మిది రౌండ్లలో 7.5 పాయింట్లు సాధించాడు. ప్రజ్ఞానంద తర్వాత స్థానంలో స్వీడెన్కు చెందిన జంగ్మిన్ సియో, ఇజ్రాయెల్‌కు చెందిన మర్సెల్ ఎఫ్రోయిమ్స్కీలు నిలిచారు. మరోవైపు నార్వే చెస్ 2022 ఛాంపియన్‌గా ఆ దేశానికి చెందిన మాగ్నస్ క్లార్‌సన్ నిలిచాడు.
భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఈ టోర్నీలో మూడో స్థానంలో నిలిచాడు. తొమ్మిదో రౌండ్లో నార్వేకు చెందిన ఆర్యన్ టారీపై విజయం సాధించాడు. ఈ టోర్నీలో 16.5 పాయింట్లతో క్లార్‌సన్ అగ్రస్థానంలో నిలవగా, అజర్‌బైజాన్‌కు చెందిన షక్రియార్ మామెద్యారోవ్ 15.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఆనంద్. 14.5 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇదీ చూడండి : మ్యాచ్ మధ్యలో అలా కెమెరాలకు చిక్కిన యువతి.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ