బ్యాటింగ్‌లో వీరే కీలకం.. టీమ్‌ఇండియాకు బలం బ్యాటింగ్. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి రావడం శుభసూచికం. వీరిద్దరూ గత టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై పేలవ ప్రదర్శన మరిచేలా సూపర్ ఇన్నింగ్స్ ఆడాలి. ఓపెనర్లు మంచి శుభారంభం ఇస్తే ఎలానూ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెడీగా ఉంటాడు. టీ20 ప్రపంచకప్ పోటీల్లో అత్యంత నిలకడైన ఆటతీరును ప్రదర్శించిన చరిత్ర విరాట్ సొంతం. మిడిలార్డర్‌లో నయా మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ కాచుకొని ఉన్నాడు. తనదైన రోజున ఎలాంటి బౌలింగ్‌నైనా తుత్తునీయలు చేయగలడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. ఫినిషర్ దినేశ్ కార్తిక్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలరు.
పాకిస్థాన్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లను త్వరగా కట్టడి చేస్తే చాలు దాయాది దేశం పనైపోతుందని ఇప్పటికే పలువురు మాజీలు చెప్పారు. ఆ ఇద్దరు టీ20ల్లో టాప్ ర్యాంకర్లు. ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ అజామ్. వీరిద్దరిని వీలైనంత తొందరగా పెవిలియన్‌కు చేరేస్తే పాక్ పని ముప్పావు వంతు ముగిసినట్లే. ఆ తర్వాత ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ కీలకం. మిడిల్ ఓవర్లలో పాక్ స్కోరు బోర్డు నడిపిస్తారు. అయితే వీరిలో నిలకడలేనితనం భారత్‌కు కలిసొస్తుంది. అయినా అలసత్వం ప్రదర్శించకూడదు. ఆసియా కప్ సూపర్ -4 స్టేజ్‌లో ఓపెనర్లను భారత బౌలర్లు త్వరగా ఔట్ చేసినప్పటికీ షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ తమ జట్టును విజయతీరాలకు చేర్చిన సంగతిని మరువకూడదు.
పేస్ బౌలింగ్‌లో వీరు.. భారత్‌కు కీలక పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టం. కానీ అటువంటి ఆందోళనమీ అవసరం లేదంటారు మాజీలు. ఎందుకంటే జట్టులో సీనియర్ ఆటగాడు మహమ్మద్ షమీ ఉండటం కలిసొచ్చే అంశం. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆసీస్‌పై కేవలం ఒక్క ఓవర్ వేసినప్పటికీ మంచి లయతో బౌలింగ్ చేశాడు. ఆఖర్లో మూడు వికెట్లను పడగొట్టిన సంగతి తెలిసిందే. ఒత్తిడిలో చక్కగా బౌలింగ్ చేయగల సామర్థ్యం షమీ సొంతమని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఓ సందర్భంలో పేర్కొన్నాడు. అలాగే యువ బౌలర్ అర్ష్‌దీప్ ప్రదర్శనను మనం ఇప్పటికే ఆసియా కప్ సహా ద్వైపాక్షిక సిరీసుల్లో చూశాం. మరో సీనియర్ బౌలర్, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ ఎలాగూ ఉండనే ఉన్నాడు. ఆపద్బాంధవుడు పాత్రను పోషించేందుకు టాప్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బంతితోనూ మెరుపులు మెరిపించగలడు. స్పిన్నర్లకు కొదవలేని జట్టు టీమ్‌ఇండియా. చాహల్, అశ్విన్, అక్షర్ పటేల్‌తో పటిష్టంగా ఉంది.
ప్రపంచంలోనే అత్యంత బలమైన పేస్ దళం ఉన్న జట్టు పాకిస్థాన్. షహీన్ అఫ్రిది, హారిస్ రవుఫ్, నసీమ్ షా, మహమ్మద్ హుస్నైన్ పాక్ సొంతం. గాయం నుంచి కోలుకొని వచ్చిన షహీన్ ప్రాక్టీస్ మ్యాచుల్లో తన పేస్‌తో ప్రత్యర్థులను వణికించాడు. అలాగే షహీన్ లేని లోటును ఆసియా కప్‌లో పూరించిన పేసర్ హారిస్ రవుఫ్.. నిలకడగా 150 కి.మీ వేగంతో బంతులను సంధించగల సమర్థుడు ఈ పేసర్. భారత్-పాక్ మ్యాచ్ జరిగే మెల్‌బోర్న్ తనకు రెండో హోం గ్రౌండ్ అని ఇటీవల చెప్పిన రవుఫ్.. అక్కడ బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ వేదికగా చాలా మ్యాచ్‌లు ఆడాడు. ఇక టీమ్‌ఇండియా స్పిన్ దళంతో పోలిస్తే పాక్ బౌలింగ్ వీక్ అని చెప్పొచ్చు. అందులో షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు పెద్ద సమస్యేమీ కాదు.
మెల్‌బోర్న్ పిచ్.. ఆసీస్ పిచ్‌లు అంటేనే పేస్ బౌలింగ్‌కు స్వర్గధామం. అలానే బ్యాటింగ్‌కూ అనుకూలంగా ఉంటాయి. అయితే మెల్‌బోర్న్‌లో వర్షం కారణంగా.. పిచ్ బౌలింగ్‌కు మరింత అనుకూలంగా మారే అవకాశాలు లేకపోలేదు. ఒక వేళ టాస్ నెగ్గిన జట్టు కచ్చితంగా తొలుత బౌలింగ్‌నే ఎంచుకోవడం ఖాయం. పిచ్ మీద తడిని అడ్వాంటేజ్ తీసుకొనేందుకు బౌలర్లు ఆసక్తి చూపుతారు. భారత బౌలర్లలో షమీ, అర్ష్‌దీప్‌తోపాటు హార్దిక్ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాక్ పేసర్లు ఎలాగూ తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతారు. వర్షం ఆగి పూర్తిస్థాయిలో మ్యాచ్ జరిగితే మాత్రం తొలుత బౌలింగ్ చేసే జట్టుకు ఉపయోగం. వర్షం కారణంగా మ్యాచ్‌ను కుదిస్తే మాత్రం మరింత ఉత్కంఠగా ఉండటం ఖాయమని విశ్లేషకులు అంచనా వేశారు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్, చాహల్, భువనేశ్వర్ కుమార్, షమీ, అర్ష్‌దీప్ సింగ్
పాకిస్థాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఖుద్దిల్ షా, ఇఫ్తికార్ అహ్మద్, అసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, నసీమ్ షా, హారిస్ రవుఫ్, షహీన్ షా అఫ్రిది
ఇదీ చూడండి: T20 worldcup: రోహిత్‌పై కోహ్లీ కామెంట్స్.. ఆ విషయంలో ఇద్దరు ఒకటేనంటూ..