కొద్ది రోజులుగా సరైన ప్రదర్శన చేయలేక ఇబ్బందులు పడుతున్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి మరొకరికి ఇచ్చే అవకాశం ఉందన్నాడు. దాని ద్వారా తనపై ఉన్న కెప్టెన్సీ పని భారం తగ్గి మెరుగైన ప్రదర్శన చేసేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నాడు సెహ్వాగ్. ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించాడు.
"టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా మరొకరి పేరు ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ ఆలోచనల్లో ఉంటే.. రోహిత్ శర్మకు ఉపశమనం లభించినట్లే. అందుకు కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. అందులో ఒకటి పని భారం, వయసు వల్ల వచ్చే మానసిక ఒత్తిడిని రోహిత్ శర్మ అధిగమించవచ్చు. రెండోది.. టీ20 కెప్టెన్‌గా మరొకరు నియమితులైతే.. రోహిత్ శర్మకు తగినంత విశ్రాంతి లభించి.. టెస్టులు, వన్డేల్లో సమర్థమైన కెప్టెన్‌గా రాణించే వీలుంటుంది."
- వీరేంద్ర సెహ్వాగ్, మాజీ క్రికెటర్
ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాలనే విధానానికే మేనేజ్మెంట్ కట్టుబడి ఉంటే.. రోహిత్ శర్మ ఒక్కడే దానికి సరైన వ్యక్తిగా కనిపిస్తున్నట్లు చెప్పాడు సెహ్వాగ్.
మరోవైపు.. ఈ ఏడాదిలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా తరఫున ఆడాల్సిన ముగ్గురు అత్యుత్తమ బ్యాటర్లను ఎంపిక చేశారు. అందులో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ఉన్నారు. రైట్ హ్యాండ్, లెఫ్ట్‌హ్యాండ్ కాంబినేషన్ విషయానికి వస్తే.. రోహిత్-ఇషాన్, కేఎల్ రాహుల్-ఇషాన్‌లు మంచి ప్రదర్శన చేస్తారని చెప్పాడు సెహ్వాగ్. మరోవైపు.. యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై ప్రశంసలు కురిపించాడు. ప్రపంచకప్‌లో బుమ్రా, షమీతో కలసి ఉమ్రాన్ తప్పకుండా ఉండాలన్నాడు. మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు ఉమ్రాన్ దీర్ఘకాలం సేవలందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి: ఆ ఘనత సాధించిన భారత ఏకైక కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య