వచ్చే ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ ఆడతాడా? లేదా? అని రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (అక్టోబర్ 7) పంజాబ్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌కు ముందు మాట్లాడాడు ధోనీ.
"వచ్చే ఏడాది నన్ను పసుగు రంగు జెర్సీలోనే చూస్తారు. కానీ నేను చెన్నై తరఫున ఆడతానా? లేదా? అన్న విషయంపై పూర్తి స్పష్టత లేదు. వచ్చే ఏడాది రెండు కొత్త జట్లు లీగ్‌లో అరంగేట్రం చేయబోతున్నాయి. వేలానికి ముందు ఏ జట్టు ఎంతమంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటుందో తెలియదు. అందులో ఎంతమంది స్వదేశీయులు, విదేశీయులు ఉంటారో తెలియదు. అందువల్ల అప్పటివరకు ఎదురుచూడటం మంచిది. అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం."
-ధోనీ, సీఎస్కే కెప్టెన్
ఇదిలా ఉండగా.. మంగళవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో అభిమానులతో మాట్లాడుతూ ధోనీ ఈ విధంగా స్పందించాడు.
"వీడ్కోలు మాటకు వచ్చేసరికి అది చెన్నైలోనే ఉంటుంది. ఘనంగా నన్ను సాగనంపేందుకు మీకు ఓ అవకాశం లభిస్తుంది. వచ్చే సీజన్లో చెన్నై వచ్చి నా చివరి మ్యాచ్‌లో అభిమానులను కలుసుకుంటానని ఆశిస్తున్నా" అని ధోనీ చెప్పాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడానికి 'ఆగస్టు 15'ను మించిన రోజు మరొకటి తనకు కనిపించలేదని.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మహీ సమాధానంగా చెప్పాడు.