ETV Bharat / sports

ఈ ఐపీఎల్​లోనైనా పాత విరాట్​ను చూస్తామా..?

author img

By

Published : Mar 21, 2022, 6:54 PM IST

IPL 2022 Virat Kohli: బ్యాటింగ్‌ అంటే చాలు… విరాట్‌ కోహ్లీకి పూనకం వచ్చేస్తుంటుంది. వందల కొద్దీ పరుగులు అలవోకగా చేసేస్తూ ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు.. ఐపీఎల్‌లోనూ రికార్డులే. అయితే ఇటీవల విరాట్‌ బ్యాటింగ్‌లో మునుపటి దూకుడు లేదు. కెప్టెన్సీ వదులుకున్నాక ఆనాటి కోహ్లీని చూపిస్తా అని కూడా అన్నాడు. మరి ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో మనకు పాత కోహ్లీ కనిపిస్తాడా? పరుగుల వరద పారిస్తాడా!

ipl 2022
virat kohli

IPL 2022 Virat Kohli: క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ లీగ్​లో విధ్వంసకర ఇన్నింగ్స్​లు ఆడేందుకు ఆత్రుతగా ఉన్నారు బ్యాటర్లు. అయితే ఐపీఎల్​లో అత్యధిక పరుగులు చేసిన రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మాజీ సారథి విరాట్​ కోహ్లీ బ్యాటింగ్​లో మునపటి దూకుడులేదు, పరుగులూ లేవు. బెంగళూరు జట్టు కెప్టెన్సీ వదులుకున్నాక మళ్లీ ఆనాటి కోహ్లీని చూపిస్తా అని అన్నాడు. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్​లో అలనాటి కోహ్లీని మళ్లీ చూడగలమా అనే ప్రశ్న అభిమానుల్లో నెలకొంది.

IPL Virat Records: ఐపీఎల్‌లో కోహ్లీ ఏం ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోలేదు. 2008లోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. తొలి సీజన్లలో పెద్దగా రాణించింది లేదు. తొలి సీజన్‌ (2008)లో 12 ఇన్నింగ్స్‌లు ఆడి 165 పరుగులే చేశాడు. ఆ తర్వాత ఏడాదిలో 246 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక 2010లో 307 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 2011లో అయితే 557 పరుగులతో రెండో స్థానానికి ఎగబాకేశాడు. 2012కి వచ్చేసరికి కోహ్లీ కాస్త నెమ్మదించాడు. 364 పరుగులతో 16వ స్థానానికి పడిపోయాడు.

virat kohli
విరాట్‌ కోహ్లీ

కింద పడితే అంతే వేగంగా పైకి లేచే గుణం ఉన్న కోహ్లీ.. 2013 టోర్నీలో అదరగొట్టాడు. దానికి తోడు కెప్టెన్‌గా ఆ ఏడాదే బెంగళూరు పగ్గాలు అందుకున్నాడు. దీంతో 634 పరుగులతో టోర్నీలో మూడో టాప్‌ స్కోరర్‌ అయ్యాడు. ఆ తర్వాతి ఏడాది (2014) అంతగా కలసి రాలేదు. 2015లో మరోసారి బ్యాట్‌ ఝళిపించాడు. 505 పరుగులతో అదరగొట్టాడు. అసలు సిసలు బ్యాటింగ్‌ సత్తా చూపించిన ఏడాది అంటే 2016. ఏకంగా 16 మ్యాచుల్లో 973 పరుగులు చేసి రికార్డు సాధించాడు. ఆరెంజ్‌ క్యాప్‌ కూడా సంపాదించాడు.

ఇక 2017లో కోహ్లీ సిరీస్‌ మధ్యలో గాయం కారణంగా వైదొలిగాడు. అయినా 10 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేశాడు. ఇక 2018లో బెంగళూరు.. ఈ పరుగుల యంత్రాన్ని రూ. 17 కోట్ల భారీ ధరకు రిటైన్‌ చేసుకుంది. ఆ ఏడాది 530 పరుగులు చేశాడు. 2019లో కోహ్లీ బ్యాటు నుంచి మంచి పరుగులే వచ్చాయి. 14 మ్యాచ్‌ల్లో 464 పరుగులు చేశాడు. కానీ ఏడుగురు బ్యాటర్లు అతడిని దాటి వెళ్లిపోయారు. దీంతో కింగ్‌ కోహ్లీ వెనుకబడ్డాడు. 2020లోనూ ఇదే పరిస్థితి. 466 పరుగులతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇక 2021లో అయితే కోహ్లీ నెం 12. 405 పరుగులు చేసినా సరిపోలేదు.

virat kohli
విరాట్‌ కోహ్లీ

పై లెక్కలన్నింటినీ క్రోడీకరించి చెప్పాలంటే 2019 నుంచి ఐపీఎల్‌లో విరాట్‌ బ్యాటింగ్‌ ప్రదర్శన తగ్గుతూ వస్తోంది. 400 పరుగుల మార్కు దాటుతున్నా… ఇప్పటి వేగానికి సరిపోవడం లేదు. కొత్త కుర్రాళ్లు అర్ధ సెంచరీలు, సెంచరీలు అంటూ దూసుకుపోతున్నారు. కోహ్లీ ఆ స్థాయిలో పరుగులు చేయలేకపోతున్నాడు. ఈ లెక్కలు చూసుకున్నాడో, లేక ఎంత ఆడినా కప్‌ రావడం లేదు అనుకున్నాడో ఏమో.. కెప్టెన్సీ వదిలేశాడు. కేవలం బ్యాటర్‌గా 2022 ఐపీఎల్‌లో బరిలోకి దిగుతున్నాడు. దీంతో 2016 నాటి కోహ్లీ కావాలి అని ఫ్యాన్స్‌ కోరుతున్నారు.

virat kohli
విరాట్‌ కోహ్లీ

వందల పరుగులు సునాయాసంగా చేసి ఇప్పటికీ కింగే అని అనిపించుకోవాలని ఆశిస్తున్నాడు. నిజానికి ఇదేమంత సులభమైన విషయం కాదు. 2016 అంటే ఆరేళ్ల క్రితం. అప్పటికి విరాట్‌ వయసు 27 మాత్రమే. అప్పుడు బ్యాటింగ్‌లో ఉన్న దూకుడు ఇప్పుడు చూపించాలి. ఫిట్‌నెస్‌ విషయంలో ఇప్పటికీ వేలెత్తి చూపే ప్రశక్తే లేదు. కానీ ఫామ్‌ కూడా చాలా అవసరం. రీసెంట్‌గా కోహ్లీ ఫామ్‌ ఏమంత బాగో లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా కెప్టెన్సీ వదిలేశాడు. అక్కడ కూడా బ్యాటింగ్‌ ప్రదర్శనే కారణం అని చెప్పాడు. కానీ బ్యాటింగ్‌లో పెద్దగా మార్పేమీ రాలేదు.

virat kohli
విరాట్‌ కోహ్లీ

రీసెంట్‌ ఫామ్‌ చూస్తే వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో చేసిన 52 పరుగులే అత్యధికం. ఇక విండీస్‌తో జరిగిన రీసెంట్‌ రెండో టెస్టులో 23, 13 పరుగులే చేశాడు. తొలి టెస్టు 45 పరుగులు చేయడం కాస్త ఉపశమనం. అయితే ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లో కొనసాగిస్తే 2016 నాటి కోహ్లీని మనం చూడలేం. గత ఫామ్‌ను మరచి, కొత్తగా తనను తాను మార్చుకుంటే విరాట్‌ విశ్వరూపం చూడొచ్చు. ఈ నెల 27న పంజాబ్‌తో జరగబోయే తొలి మ్యాచ్‌లోనే కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌ అని ఫ్యాన్స్‌ అనుకోవాలంటే… బ్యాటు ఝుళిపించాల్సిందే.

ఇదీ చదవండి: ఐపీఎల్​లో 'సూ..పర్​' మచ్చి.. మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్​లివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.