ETV Bharat / sports

IPL 2022: ఐపీఎల్​ బయోబబుల్​ కొత్త నిబంధనలు ఇవే!

author img

By

Published : Mar 16, 2022, 10:55 PM IST

IPL 2022 Bio Bubble Rules: ఈ నెల 26న ఐపీఎల్ 15వ సీజన్​​ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కఠినమైన బయోబబుల్​ నిబంధనలను ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు కుటుంబసభ్యులకు కూడా నిబంధనలు అమలులో ఉంటాయని బోర్డు పేర్కొంది. వాటిని ఉల్లంఘిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది.

ipl 2022
ipl bio bubble rules

IPL 2022 Bio Bubble Rules: మరో పదిరోజుల్లో ఐపీఎల్​ 15వ సీజన్​ ప్రారంభం కానుంది. అందుకోసం బీసీసీఐ కఠినమైన బయోబబుల్​ నిబంధనలను సిద్ధం చేసింది. కోవిడ్​ విజృంభణతో గతేడాది అనుభవాల దృష్ట్యా ఈ సారి నిబంధనలను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. వాటిని ఉల్లంఘిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది.

మొదటిసారి ఏడు రోజులు క్వారంటైన్​​..

ఏ ఆటగాడైనా తొలిసారి బుడగ దాటితే తప్పనిసరిగా ఏడు రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. రెండోసారి ఉల్లంఘనకు పాల్పడితే ఒక మ్యాచ్​ నిషేధం, మూడోసారి బుడగ దాటితే ఏకంగా లీగ్​ నుంచి తొలగిస్తామని గట్టిగా హెచ్చరించింది. అలాంటి పరిస్థితి ఎదురైతే ప్రత్యమ్నాయ ఆటగాడిని సైతం అనుమతించమని పేర్కొంది.

ఫ్రాంచైజీలకూ..

ఏ జట్టు ఆటగాడైనా తొలిసారి బుడగ దాటితే సదరు ఫ్రాంచైజీకి రూ.కోటి జరిమానా విధిస్తామని బీసీసీఐ తెలిపింది. రెండో సారి ఇదే జరిగితే ఒక పాయింట్ కోత, మూడో సారికైతే రెండు పాయింట్ల కోత ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.

కుటుంబాలకు కూడా..

బయోబబుల్‌ నిబంధనలు.. ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల వరకే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఉంటాయని బీసీసీఐ తెలిపింది. కుటుంబసభ్యులు మొదటిసారి ఉ‍ల్లంఘనకు పాల్పడితే ఏడు రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్​లో(ఉల్లంఘించిన వారికి సంబంధించిన ఆటగాడు కూడా ఏడు రోజుల క్వారంటైన్‌లో గడపాలి) ఉండాలి. రెండో సారి ఉల్లంఘిస్తే బుడగ నుంచి తొలగిస్తామని బీసీసీఐ వివరించింది.

కరోనా టెస్టుకు నిరాకరిస్తే..

కోవిడ్ టెస్ట్‌కు నిరాకరించే వ్యక్తులకు తొలిసారి మందలింపు ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది. ఇక రెండో సారి కూడా నిరాకరిస్తే రూ.75వేల జరిమానాతో పాటు స్టేడియంలోకి అనుమతించబోమని పేర్కొంది.

ఇదీ చదవండి: డ్రాగా ముగిసిన ఆసీస్​-పాక్​ రెండో టెస్టు.. ఆజామ్​ కొత్త రికార్డు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.