ప్రపంచస్థాయి మ్యాచ్ విన్నర్లతో బ్యాటింగ్ చేయడమంటే కష్టమైన పని అని ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. టీ20 లీగ్‌లో ప్రస్తుతం కోల్‌కతా తరఫున ఆడుతున్న మోర్గాన్.. కోల్‌కతా జట్టులో తన అనుభవాలను పంచుకున్నాడు.
"కోల్‌కతా బ్యాటింగ్ లైనప్‌లో చాలా మంది మ్యాచ్ విన్నర్లున్నారు. వాళ్లతో కలిసి బ్యాటింగ్ చేయడమంటే చాలా ఒత్తిడితో కూడుకున్న పని. ముఖ్యంగా ఆల్‌రౌండర్ రసెల్ గురించి చెప్పాలి. అతను ఒక అద్భుత బ్యాట్స్‌మన్. సునీల్ నరైన్ కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడగలడు. అతనెప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటాడు. ఒక ఆటగాడికి ఉండాల్సింది కూడా అదే."
- ఇయాన్ మోర్గాన్, కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్
దిల్లీతో మ్యాచ్ ఓటమిపై స్పందిస్తూ.. 'ఆ మ్యాచ్‌లో దిల్లీ బాగా ఆడింది. వాళ్ల బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు' అని ఇంగ్లాండ్ కెప్టెన్ పేర్కొన్నాడు.
కోల్‌కతా తరఫున ఆడుతున్న మోర్గాన్ గత మూడు మ్యాచుల్లో 42*(29), 34*(23), 44(18) మెరుపులు మెరిపించాడు. తాజాగా కోల్‌కతా కెప్టెన్సీ బాధ్యతలు మోర్గాన్‌కు అప్పగించాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తన కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌కు తొలిసారిగా ప్రపంచకప్ తెచ్చిపెట్టిన రికార్డూ మోర్గాన్‌కు ఉంది. ఆ అనుభవం కోల్‌కతా జట్టుకు ఉపయోగపడుతుందని అభిమానులు భావిస్తున్నారు.