వాతావరణ పరిస్థితుల వల్ల బౌలర్ల ప్రణాళికలపై ప్రభావం పడుతుందని ముంబయి ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంటున్నాడు. యూఏఈలో వేడి కారణంగా చెమటతో యార్కర్లు వేయడం చాలా కష్టమైన పని తెలిపాడు. ఒకపక్క చెమట, మరోవైపు మంచు కురిసే సందర్భంగా వికెట్ పడగొట్టమంటే పిల్లి, ఎలుక ఆటను పోలి ఉంటుందని అన్నాడు.
"వాతావరణం మారుతోంది. యూఏఈలో వేడిమి ఎక్కువ కావడం వల్ల విపరీతమైన చెమట పోస్తుంది. తద్వారా బౌలింగ్ వేయడం చాలా కష్టమవుతుంది. మంచు వల్ల బంతి జారడం కూడా జరుగుతుంది. ఇది చాలా కష్టం. దీని కోసం చాలా ప్రాక్టీసు అవసరం. బౌలింగ్ వేసేప్పుడు ప్రతికూలతలకు మార్గం వెతకాలి. తడి బంతికి మరింతగా సాధన చేయోచ్చు. ఇది కొంచెం కష్టంగా అనిపించినా.. జట్టు కోసం ఉత్తమంగా ఆడాలని ఏ బౌలర్ అయినా అనుకుంటాడు".
- జస్ప్రీత్ బుమ్రా, ముంబయి ఇండియన్స్ బౌలర్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో బంతి మెరుపు కోసం లాలాజలాన్ని వాడడంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిషేధం విధించింది. అయితే ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఈ నిషేధం వల్ల బౌలర్ల అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ, పరిమిత ఓవర్లలో లాలాజల నిషేధమనేది పెద్ద సమస్య కాదని బుమ్రా అభిప్రాయపడుతున్నాడు. కానీ, రెడ్-బాల్ వంటి సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం మెరుపుకోసం లాలాజలం అవసరమని అంటున్నాడు.
తడబడినా.. నిలబడ్డాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్లో ముంబయి ఇండియన్స్ టేబుల్ టాపర్‌గా గ్రూప్ దశను ముగించింది. ఈ టోర్నీలో ముంబయి ఇండియన్స్ విజయానికి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుత సీజన్లో 13 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన బుమ్రా 23 వికెట్లు పడగొట్టాడు.
టోర్నీ ప్రారంభంలోని ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థికి ఎక్కువ పరుగులు సమర్పించినా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 2/18తో జస్ప్రీత్ బుమ్రా రాణించాడు. అక్కడి నుంచి బౌలింగ్‌లో తిరిగి పుంజుకుని.. టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో రెండో స్థానంలో బుమ్రా ఉన్నాడు.
క్వాలిఫైయర్‌లో అడుగు..
షార్జా వేదికగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న బుమ్రా.. దుబాయ్ వేదికగా గురువారం జరగనున్న క్వాలిఫైయర్-1లో ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఆడనున్నాడు.