ETV Bharat / sports

India vs NZ 2nd Test: సిరీస్​పై కన్నేసిన ఇరుజట్లు.. భారత్​కు అదే సమస్య!

author img

By

Published : Dec 3, 2021, 6:41 AM IST

India vs NZ 2nd Test 2021: టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకోవాలనుకుంటున్న టీమ్‌ఇండియా శుక్రవారం ఆరంభమయ్యే నిర్ణయాత్మక రెండో టెస్టులో న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. మ్యాచ్‌ గమనంలో వాతావరణం కీలక పాత్ర పోషించే అవకాశముంది. వర్షం కారణంగా రెండు జట్లు కూడా సరిగా ప్రాక్టీస్‌ చేయలేకపోయాయి. కివీస్ పోరాటంతో మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. కివీస్‌ ఇప్పటివరకు భారత్‌లో టెస్టు సిరీస్‌ నెగ్గలేదు.

IND vs NZ test live updates, IND vs NZ Test preview, భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టు ప్రివ్యూ, భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టు లైవ్ స్కోర్
IND vs NZ

India vs NZ 2nd Test 2021: కాన్పూర్‌లో మెరుగైన ప్రదర్శన చేసినా ఊరించి దూరమైన విజయాన్ని ఈసారైనా దక్కించుకోవాలనే కసితో ఓ జట్టు.. అద్భుత పోరాటంతో చేసుకున్న డ్రా ఇచ్చిన విశ్వాసంతో మరో జట్టు. ప్రపంచ నంబర్‌-2 భారత్‌, నంబర్‌-1 న్యూజిలాండ్‌ మధ్య ఆసక్తికర సమరానికి వేళైంది. వర్షంతో తడిసి ముద్దయిన ముంబయిలో నేటి నుంచే చివరిదైన రెండో టెస్టు. విరామం తర్వాత బరిలోకి దిగుతోన్న భారత కెప్టెన్‌ కోహ్లీకి జట్టు కూర్పు పెద్ద సవాలే. పేలవ ఫామ్‌లో ఉన్న రహానేకు మరో అవకాశం దక్కుతుందా లేదా అన్నది చూడాలి.

సెలక్షన్‌ సంకటం

విశ్రాంతితో తాజాగా ఉన్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి జట్టులోకి రావడం భారత్‌కు సానుకూలాంశమే. కానీ తుది జట్టు ఎంపిక అతడికి పెద్ద సవాలుగా నిలుస్తోంది. సాధారణంగా భారత జట్టులో మార్పులు అంత తేలిగ్గా జరగవు. కానీ కాన్పూర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ అరంగేట్రంలోనే అదరగొట్టడం వల్ల కూర్పు సంక్లిష్టంగా మారింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో 105, 65తో ఆకట్టుకుని 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు అందుకున్న శ్రేయస్‌ను పక్కన పెట్టడం చాలా కష్టమైన పనే. పేలవ ఫామ్‌లో ఉన్న సీనియర్‌ బ్యాటర్ అజింక్యా రహానే మెడపై కత్తి వేలాడుతుందన్నది నిజం. 2021లో ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లోనూ అతడు విఫలమయ్యాడు. రహానేకు మరో అవకాశమిస్తే టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు తీవ్రమవుతాయనడంలో సందేహం లేదు. కానీ అంతకుముందు మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఉన్న ఆటగాణ్ని తర్వాతి మ్యాచ్‌కే జట్టులో నుంచి తప్పిస్తారా అన్నది కూడా ప్రశ్నే! కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి.. శ్రేయస్‌ను పక్కన పెడతారా? రహానేను తప్పిస్తారా? లేదా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (పుజారా లేదా వికెట్‌కీపర్‌తో ఓపెనింగ్‌)ను తప్పిస్తారా అన్నది ఊహించడం కష్టం. ప్రస్తుతానికి సురక్షితం కావొచ్చు కానీ.. పుజారా పరిస్థితి రహానే కంటే చాలా మెరుగ్గా ఏమీలేదు. పేలవ ఫామ్‌ నేపథ్యంలో జట్టులో అతడి స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముంబయిలో పరుగుల బాట పట్టకపోతే కెరీర్‌ ప్రమాదంలో పడ్డట్లే. శుభ్‌మన్‌ గిల్‌ ఫామ్‌ జట్టుకు సానుకూలాంశం. ఇక బౌలింగ్‌ విభాగంలో ఓ మార్పు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి టెస్టులో తేలిపోయిన ఇషాంత్‌ శర్మ స్థానంలో సిరాజ్‌ జట్టులోకి రావొచ్చు. ఉమేశ్‌ యాదవ్‌తో కలిసి అతడు పేస్‌ బాధ్యతలు పంచుకుంటాడు. అశ్విన్‌, అక్షర్‌, జడేజాలతో కూడిన స్పిన్‌ త్రయం కివీస్‌ బ్యాటర్లను పరీక్షించడానికి సిద్ధంగా ఉంది.

కివీస్‌ జట్టులో వాగ్నర్‌!

భారత స్పిన్‌ పరీక్షకు ఎదురొడ్డుతూ తొలి టెస్టును చిరస్మరణీయ రీతిలో డ్రాగా ముగించిన న్యూజిలాండ్‌ చాలా ఉత్సాహంగా మ్యాచ్‌కు సిద్ధమైంది. బౌన్స్‌కు సహకరించే పిచ్‌పై ఆ జట్టు ముగ్గురు ఫాస్ట్‌బౌలర్లతో ఆడే అవకాశముంది. ఆఫ్‌స్పిన్నర్‌ సోమర్‌విల్లే స్థానంలో పేసర్‌ నీల్‌ వాగ్నర్‌ జట్టులోకి రావొచ్చు. ఓపెనర్‌ లాథమ్‌, యంగ్‌ల ఫామ్‌లో కివీస్‌కు సానుకూలాంశమే. కెప్టెన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌ కూడా భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని ఆ జట్టు కోరుకుంటోంది.

India vs NZ 2nd Test Squads

భారత్‌: శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పుజారా, కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సాహా, రవీంద్ర జడేజా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌

న్యూజిలాండ్‌: విల్‌ యంగ్‌, లాథమ్‌, విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌, నికోల్స్‌, బ్లండెల్‌, రచిన్‌ రవీంద్ర, జేమీసన్‌, సౌథీ, వాగ్నర్‌, అజాజ్‌ పటేల్‌

2016 తర్వాత..

  • ఎన్నో ముఖ్యమైన మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన వాంఖడే స్టేడియంలో 2016 తర్వాత టెస్టు మ్యాచ్‌ జరగడం ఇదే తొలిసారి. చివరిసారి ఇక్కడ జరిగిన మ్యాచ్‌ (2016 డిసెంబరు 8-12)లో ఇంగ్లాండ్‌తో భారత్‌ తలపడింది. భారత్‌ 36 పరుగుల తేడాతో గెలిచింది. ఈ వేదిక మొత్తం 25 టెస్టులకు ఆతిథ్యమివ్వగా.. అందులో భారత్‌ 11 గెలిచింది. ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మిగతావి డ్రాగా ముగిశాయి. ఇక్కడ కివీస్‌ చివరిసారి 1988 నవంబరులో టెస్టు మ్యాచ్‌ ఆడింది. అందులో 136 పరుగుల తేడాతో గెలిచింది. భారత్‌లో న్యూజిలాండ్‌ చివరిసారిగా నెగ్గిన టెస్టు అదే.
  • 2020 ఆరంభం నుంచి రహానే సాధించిన అర్ధశతకాలు. మూడూ టెస్టు సిరీస్‌ (ఎంసీజీ 2020, చెన్నై 2021, లార్డ్స్‌ 2021) రెండో మ్యాచ్‌లో వచ్చినవే.
  • 2003లో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా చివరిసారి ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లూ డ్రా అయ్యాయి.

India vs NZ 2nd test pitch report: వర్షం వల్ల తొలి ఆటకు అంతరాయం కలిగే అవకాశముంది. స్లో బౌలర్లకు సహకరించడం కోసం వాంఖడే స్టేడియంలో పిచ్‌పై గడ్డినంతా తొలగించారు. కానీ పిచ్‌ స్పిన్నర్లతో పాటు పేసర్లకూ అనుకూలిస్తుందని భావిస్తున్నారు. వర్షాల వల్ల పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. దీని వల్ల ఏర్పడే అదనపు తేమ సీమర్లకు ఉపయోగపడుతుంది. శుక్రవారం వర్షం లేకపోయినా.. ఔట్‌ఫీల్డ్‌ పచ్చిగా ఉండడం వల్ల మ్యాచ్‌ ఆలస్యంగా ఆరంభమయ్యే అవకాశముంది. వాంఖడే మైదాన సిబ్బందికి పని చాలానే ఉంటుంది.

ఇవీ చూడండి: హార్దిక్ భావోద్వేగం.. ముంబయి ఇండియన్స్​ను మరవలేనంటూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.