Ind vs Sl: భారత క్రికెట్ జట్టు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకతో శనివారం పింక్ బాల్ టెస్టు ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడనేది అభిమానుల్లో ఆసక్తిగా రేపుతోంది. ఇప్పటివరకు భారత్ ఆడిన మూడు పింక్‌బాల్ టెస్టుల్లో కోహ్లీ టీమ్‌ఇండియా తరఫున శతకం సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.
పింక్‌బాల్ టెస్టుల్లో అతడు 2019లో కోల్‌కతా వేదికగా నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులోనే శతకం సాధించాడు. తర్వాత ఒక్కసారి కూడా మూడంకెల స్కోర్ చేయకపోవడం గమనార్హం. దీంతో మాజీ సారథికి పింక్ బాల్‌తో అదే చివరి శతకంగా మారింది. ఇక అప్పటి నుంచి ఎంత బాగా ఆడినా విరాట్ మరో సెంచరీ చేయలేకపోయాడు. ఇక ఇటీవల మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో 45 పరుగులు చేసి.. చివరికి అర్ధశతకం ముందు ఔటయ్యాడు. దీంతో వందో టెస్టులోనైనా శతకం సాధిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే విరాట్‌కు అచ్చొచ్చిన చినస్వామి స్టేడియంలో రెండో టెస్టు జరుగుతోంది కాబట్టి ఈ సారైనా సెంచరీ చేస్తాడేమోనని అభిమానులు వేచి చూస్తున్నారు. మరి కోహ్లీ ఏం చేస్తాడో చూడాలి..
2022లో సొంతగడ్డపై భారత్‌కు ఇదే చివరి టెస్ట్..
2022లో టీమ్ఇండియాకు సొంతగడ్డపై ఇదే చివరి టెస్టు మ్యాచ్. లంక సిరీస్ తర్వాత ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మరో ఏడు టెస్టులు ఆడాల్సి ఉంది. రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌కు, ఆపై 2023లో నాలుగు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు భారత్ జట్టు వెళుతుంది. గతేడాది ఇంగ్లండ్ టూర్‌లో మిగిలిన ఒక టెస్టు కూడా ఇంకా ఆడాల్సి ఉంది. WTC ఫైనల్‌కు టీమ్‌ఇండియా అర్హత సాధించాలంటే ఈ టెస్టు మ్యాచ్‌లన్నింటినీ గెలవాలి.
ఇదీ చదవండి: టెస్టుల్లోనూ వీర బాదుడు.. అత్యధిక సిక్సర్ల వీరులు వీళ్లే..