2022 సంవత్సరం క్రికెట్లో టీమ్ఇండియాకు అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. జట్టులో ఎన్నో అనూహ్యమైన సంఘటనలు జరిగాయి. వ్యక్తిగతంగా సూర్య కుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్లకు చాలా అనుకూలించింది. కానీ జట్టుగా టీమ్ఇండియాకు ఆ ఏడాది తీవ్ర నిరాశ మిగిల్చింది. బుమ్రా, జడేజా లాంటి స్టార్ ప్లేయర్లను గాయాలు వేటాడాయి. టీమ్ఇండియాను ఓటములు వెంటాడాయి. టీ20 ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలో కూడా జట్టు పేలవ ప్రదర్శన చేసి ఓటమి మూటగట్టుకుంది. జట్టు ఈ పరిస్థితికి దిగజారడానికి ఓ రకంగా బీసీసీఐ యాజమాన్యానిదే బాధ్యత. ఎందుకంటే.. ప్లేయర్లు గాయాలు పాలు కాకుండా చూసుకోవడంలో విఫలమయ్యారు బోర్డు పెద్దలు. దీంతో సమర్థవంతమైన జట్టు కూర్పులో కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి.
గాయాల సమస్యలు ఎదురవుతాయని ముందుగానే గ్రహించిన విరాట్ కోహ్లీ.. 2019లో తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అలాగే బీసీసీఐకి కూడా కొన్ని సూచనలు చేశాడు. వన్డే ప్రపంచకప్ ఆడే ఆటగాళ్లు.. ముఖ్యంగా పేస్ బౌలర్లు ఐపీఎల్‌లో గాయాలపాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీసీసీఐని కోరాడు. వాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్ చేసే అంశంపై ఫోకస్ పెట్టాలని సూచించాడు. కానీ, అప్పుడు గంగూలీ సారథ్యంలో నడిచిన బీసీసీఐ వీటిని పెద్దగా పట్టించుకోలేదు. వేలంలో రూ.కోట్లు పెట్టి దక్కించుకున్న ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వమని ఫ్రాంచైజీలను ఎలా అడుగుతారని.. కోహ్లీపై బీసీసీఐ అసహనం వ్యక్తం చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. కోహ్లీ ఊహించినదే నిజమైంది. జడ్డూ, బుమ్రా గాయాల కారణంగా.. టీమ్‌కు ఎనలేని నష్టం జరిగింది. ఈ మధ్య కాలంలో జట్టు సైతం పరిస్థితి దిగజారింది. వర్క్‌లోడ్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
దీంతో కోహ్లీ చెప్పిన సూచనల విలువ బీసీసీఐకి తెలిసొచ్చింది. అనంతరం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. కోహ్లీ చెప్పిన అవే సూచనలను ఇప్పుడు అమలు చేస్తోంది. వరల్డ్ కప్ ఆడే ప్లేయర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వీవీఎస్ లక్ష్మణ్ సారథ్యంలోని జాతీయ క్రికెట్ అకాడమీని ఆదేశించినట్లు సమాచారం. అదే విధంగా వాళ్లను మానిటర్ చేసి.. వర్క్‌లోడ్ ఎక్కువ కాకుండా చూడాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఐపీఎల్ ఫ్రాంచైజీలతో కూడా చర్చించాలని సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 20 మంది ఆటగాళ్లను జాగ్రత్తగా గమనించాలని తెలిపినట్లు సమాచారం. అదేసమయంలో యోయో టెస్టులను సైతం బీసీసీఐ తప్పనిసరి చేసింది. పరిమిత ఓవర్లకు ఇద్దరు సారథులు ఉండకూడదని చెప్పి కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించిన బీసీసీఐ.. ఇప్పుడు రూటు మార్చింది. టీ20ల సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగించింది.
ఫైర్ అవుతున్న కోహ్లీ ఫ్యాన్స్..
అప్పుడు కోహ్లీతో బీసీసీఐ వ్యవహరించిన తీరును ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 'అప్పుడు కోహ్లీ చెప్పినప్పుడు బీసీసీఐ పట్టించుకోలేదు. ఇప్పుడు అదే ఫాలో అవుతుంది. కోహ్లీ అందరికంటే ముందున్నాడు' అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరో యూజర్ ' కోహ్లీ ఈరోజు ఆలోచిస్తే.. అదే విషయాన్ని బీసీసీఐ రేపు ఆలోచిస్తుంది' అని కామెంట్ చేశాడు. టీమ్‌కు ఫిట్నెస్ ప్రమాణాలు ఉండాలని కోహ్లీ తరచూ చెప్పేవాడని గుర్తు చేస్తున్నారు. బీసీసీఐ ఇప్పుడు యోయో టెస్టులు తప్పనిసరి చేసి.. అతడి ఆలోచననే మళ్లీ అమలు చేస్తోందని నెటిజన్లు అంటున్నారు. అయితే, ఇవేవో అప్పుడే పాటించి ఉంటే టీమ్ఇండియా.. ప్రపంచ టోర్నీల్లో మెరుగ్గా రాణించేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.