ETV Bharat / sports

Cristiano Ronaldo: మరోసారి జెర్సీ పట్టుకున్న రొనాల్డో..కారణమేంటంటే..!

author img

By

Published : Dec 31, 2022, 1:16 PM IST

మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌తో బంధాన్ని తెంచుకున్న ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో.. తన కెరీర్‌లోనే అత్యంత విలువైన ఒప్పందాన్ని చేసుకున్నాడు. రూ.4400కోట్లకు సౌదీ అరేబియా క్లబ్‌తో జట్టు కట్టాడు.

Cristiano Ronaldo new team
Cristiano Ronaldo

Cristiano Ronaldo : ఫుట్‌బాల్‌ దిగ్గజం, పోర్చుగల్ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోను అదృష్టం గట్టిగా వరించింది. ఇటీవల మాంచెస్టర్‌ యునైటెడ్ క్లబ్‌తో బంధాన్ని తెంచుకున్న అతడు.. ఇప్పుడు మరో క్లబ్‌తో జట్టు కట్టాడు. సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్‌క్లబ్‌.. రొనాల్డోతో ఏకంగా ఏడాదికి 200 మిలియన్‌ యూరోలతో ఒప్పందం కుదుర్చుకుంది. రొనాల్డో తమ జెర్సీని పట్టుకున్న ఫొటోలను అల్‌ నజర్‌ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ అతడికి స్వాగతం పలికింది.

"సరికొత్త చరిత్ర. ఈ డీల్‌తో మా క్లబ్‌ అద్భుత విజయాలను సాధించేలా ప్రేరణ పొందడమే గాక.. మా దేశం, మా భవిష్యత్తు తరాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు స్ఫూర్తినిస్తుంది" అని అల్‌ నజర్‌ రాసుకొచ్చింది. జెర్సీపై రొనాల్డో (కు ఇష్టమైన నంబరు 7 అని ఉంది. సౌదీ క్లబ్‌తో 2025 జూన్‌ వరకు రొనాల్డో ఒప్పందం చేసుకున్నాడు. కెరీర్‌ చివరి దశలో ఉన్న 37 ఏళ్ల రొనాల్డో.. ఈ ఒప్పందంతో భారీ మొత్తమే జీతంగా పొందనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌తో సౌదీ క్లబ్‌.. ఈ సాకర్‌ దిగ్గజానికి ఏడాదికి 200 మిలియన్‌ యూరోలు.. అంటే మొత్తంగా 500 మిలియన్‌ యూరోలను (భారత కరెన్సీలో దాదాపు రూ.4400కోట్లకు పైమాటే) చెల్లించనుందట.

దీంతో ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యధిక ధర కలిగిన ఆటగాడిగా రొనాల్డో సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు. ఈ డీల్‌పై రొనాల్డో ప్రకటన విడుదల చేశాడు. "మరో దేశంలో కొత్త ఫుట్‌బాల్‌ లీగ్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇప్పటికే అనేక లీగ్‌లు, టోర్నీలను గెలిచాను. ఆసియా ఆటగాళ్లతోనూ నా అనుభవాన్ని పంచుకునేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా" అని తెలిపాడు.

ఇటీవల మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌తో రొనాల్డో డీల్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఫిఫా ప్రపంచకప్‌ 2022 ప్రారంభానికి రెండు రోజుల ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. ఓ టాక్‌ షోలో రొనాల్డో.. మాంచెస్టర్‌ క్లబ్‌ యాజమాన్యం, మేనేజర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేసినట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. పోర్చుగల్‌ సీనియర్‌ జాతీయ జట్టుకు 2003లో ఎంపికైన రొనాల్డో అదే ఏడాది క్లబ్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. దాదాపు నాలుగేళ్లపాటు మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌కు ఆడాడు. ఆ తర్వాత రియల్‌ మాడ్రిడ్‌, జువెంటస్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.

14 ఏళ్ల తర్వాత 2021లో తిరిగి మాంచెస్టర్‌ క్లబ్‌కు వచ్చినప్పటికీ.. ఏడాదికే ఆ బంధం తెగిపోయింది. కాగా.. ప్రపంచకప్‌ గెలవాలన్న రొనాల్డో కల ఈసారి కూడా నెరవేరలేదు. ఇటీవల జరిగిన ఫిఫా మెగా టోర్నీలో పోర్చుగల్ జట్టు.. క్వార్టర్స్‌లో మొరాకో చేతిలో ఓడిపోయింది. ఆ సమయంలో రొనాల్డో కన్నీళ్లతో మైదానాన్ని వీడటం ఫుట్‌బాల్‌ అభిమానులను కలిచివేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.