ఐపీఎల్‌లో పాల్గొనేందుకు అబుదాబి వెళ్లిన ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మరో వారం రోజులు క్వారెంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. అక్కడ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో ఆ రెండు జట్ల పరిస్థితి మరోలా ఉంది. ఈ క్రమంలోనే పలువురు కోల్‌కతా క్రికెటర్లు గురువారం పలు వీడియోల్లో మాట్లాడారు. వాటిని ఆ జట్టు ట్విట్టర్లో పంచుకుంది. ఈ సందర్భంగా ఇండియా-ఏ క్రికెటర్ కమలేశ్ నాగర్‌కోటి మాట్లాడాడు. 2018లోనే ఆ జట్టుకు ఎంపికైనా కమలేశ్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఈసారి ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.
"ఈసారి ఐపీఎల్‌లో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే దీని కోసం రెండేళ్ల నుంచి నిరీక్షిస్తున్నా. చివరికి ఇప్పుడా అవకాశం వచ్చింది. కాబట్టి నేనెంతో ఆనందంగా ఉన్నా. గాయాల కారణంగా ఇంతకుముందు సీజన్లలో ఆడలేకపోయా. తర్వాత ముంబయిలో ఎంతో కష్టపడి సాధన చేశా. మానసికంగా ఎలా సన్నద్ధమవ్వాలనే విషయాలపై అవసరమైనప్పుడల్లా మా సహాయక సిబ్బందిని సంప్రదించా. అలాగే ఏడాది కాలంగా ఆటకు దూరమయ్యా. ఆ సమయంలో కుటుంబంతో కలిసి సరదాగా ఉండే అవకాశం దొరికింది. అలాగే ఇంతకుముందు పుస్తకాలు చదివే అలవాటు లేకుండేది. ఇప్పుడు అది కూడా ప్రారంభించా. ఇంట్లోనే శారీరక వ్యాయామాలు కూడా సాధన చేశా. ఇప్పుడు కోల్‌కతాను బౌలింగ్ చేసే అవకాశం వస్తే తప్పకుండా మంచి ప్రదర్శన చేస్తా. కేకేఆర్ తరఫున ఆడటం కోసం ఆసక్తిగా ఉన్నా."
-కమలేశ్ నాగర్‌కోటి, కేకేఆర్ ఆటగాడు
కరోనా కారణంగా ఐపీఎల్ 13వ సీజన్ ఆరు నెలలు వాయిదా పడింది. ఈ లీగ్ కోసం అటు అభిమానులు, ఇటు క్రికెటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈమెగా ఈవెంట్ ప్రారంభమవుతుందా అని వేచి చూస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే అందర్నీ ఆకట్టుకునేలా నిర్వహించాలని బీసీసీఐతో పాటు, యూఏఈ క్రికెట్ బోర్డు కూడా తీవ్రంగా కష్టపడుతోంది. ఈ క్రమంలోనే అన్ని ఫ్రాంఛైజీలు ఇప్పటికే దుబాయ్, అబుదాబికి చేరుకున్నాయి.