కోల్‌కతా నైట్‌రైడర్స్.. 2012, 2014 సీజన్లలో విజేతగా నిలిచి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత అంచనాల్ని అందుకోవడంలో విఫలమవుతూ వచ్చింది. గతేడాది దినేశ్ కార్తీక్ సారథ్యంలో బరిలో దిగిన ఈ టీమ్ ఐదో స్థానంతో సరిపెట్టుకుని ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కానీ ఈసారి వేలంలో ప్యాట్ కమిన్స్‌ను రికార్డు ధరకు కొనుగోలు చేసిన ఈ జట్టు అతడిపై భారీ ఆశలు పెట్టుకుంది. మరి ఈసారి లీగ్‌లో కేకేఆర్ ఎంతవరకు సఫలమవుతుంది? జట్టులో కీలక ఆటగాళ్లు ఎవరు? జట్టు బలాలు, బలహీనతలు ఏంటనే విషయాలు తెలుసుకుందాం.
బలాలు
టీ20ల్లో ఇద్దరు బలమైన ఆల్‌రౌండర్లు
సునీల్ నరేన్, ఆండ్రూ రసెల్.. వీరిద్దరూ ఐపీఎల్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరి వల్ల జట్టులో సమతుల్యం ఏర్పడి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బలంగా మారుతుంది. తాజాగా జరిగిన కరీబియన్ లీగ్‌లోనూ సత్తాచాటాడు నరేన్. రసెల్ గత సీజన్లో జట్టుకు కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఒక ఓవర్‌తోనే మ్యాచ్ గమనాన్నే మార్చే సామర్థ్యం ఇతడి సొంతం. వీరి తర్వాత ఉన్న మరో ఆల్‌రౌండర్ ఆప్షన్ క్రిస్ గ్రీన్. సీపీఎల్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌కు కెప్టెన్‌గా ఉన్న గ్రీన్ టీ0ల్లో నాణ్యమైన ఆటగాడని చెప్పుకోవచ్చు. ఈసారి వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ప్యాట్ కమిన్స్ రూపంలో మరో ఆల్‌రౌండర్ జట్టుకు దొరికాడు. భారత యువ ఆటగాడు కమలేశ్ నాగర్కోటి కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు.
అత్యుత్తమ విదేశీ ఆటగాళ్లు
ప్యాట్ కమిన్స్, ఆండ్రూ రసెల్, సునీల్ నరేన్, క్రిస్ గ్రీన్, ఇయాన్ మోర్గాన్, టామ్ బాంటన్, లూకీ ఫెర్గుసన్ వంటి బలమైన విదేశీ ఆటగాళ్లు కేకేఆర్ సొంతం. హార్రీ గున్రే సర్జరీ కారణంగా లీగ్‌కు దూరమవగా ఇతడి స్థానంలో తీసుకున్న అలీ ఖాన్ కూడా మంచి పేసర్. ఇతడు యూఎస్ఏ ఆటగాడు. దీంతో ఈ లీగ్‌లో ఆడబోతున్న మొట్టమొదటి యూఎస్ఏ క్రికెట్రగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఖాన్. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రింబాగో నైట్‌రైడర్స్‌కు ప్రాతనిధ్యం వహించిన ఇతడు చక్కటి ప్రదర్శన చేశాడు.
బలహీనతలు
పసలేని భారతీయ బ్యాటింగ్ లైనప్
జట్టులో నాణ్యమైన విదేశీ ఆటగాళ్లు కనిపిస్తున్నా భారతీయ బ్యాటింగ్ లైనప్ మాత్రం కాస్త బలహీనంగా ఉంది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫినిషర్ పాత్ర పోషిస్తున్నా.. ఇతడి తర్వాత శుభ్‌మన్ గిల్, నితీశ్ రానా మాత్రమే చెప్పుకోదగ్గ ఆటగాళ్లుగా కనిపిస్తున్నారు. క్రిస్ లిన్, రాబిన్ ఉతప్పను వదులుకున్న ఫ్రాంచైజీ ఇపుడు గిల్, రానాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. రింకూ సింగ్, సిద్దేశ్ లాడ్, రాహుల్ త్రిపాఠి, నిఖిల్ నాయక్ రూపంలో ఆప్షన్స్ కనిపిస్తున్నా వీరికి ఐపీఎల్ అనుభవం తక్కువే.
పేలవమైన స్పిన్ విభాగం
గత సీజన్లో సునీల్ నరేన్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్ రూపంలో మంచి స్పిన్నర్లు ఉన్నా.. ఈసారి చావ్లాను వదులుకుంది. ఇతడి స్థానంలో తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకున్నా.. ఇతడు లీగ్‌లో ఇప్పటివరకు మూడు ఓవర్లు మాత్రమే వేశాడు. క్రిస్ గ్రీన్ రూపంలో మరో స్పిన్నర్ ఉన్నా.. ఇతడికి తుది జట్టులో చోటు కష్టమే. ఎం. సిద్దార్థ్ కూడా స్పిన్ విభాగంలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. స్పిన్ విభాగంలో అనుభవజ్ఞుడిగా కనిపిస్తున్న కుల్దీప్ యాదవ్ గత సీజన్లో 9 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు మాత్రమే సాధించాడు. యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించడం కేకేఆర్‌కు పెద్ద దెబ్బ.
అవకాశాలు
నిరూపించుకునేందుకు సిద్ధమైన యువ ఆటగాళ్లు
దినేశ్ కార్తీక్ సారథ్యంలోని కేకేఆర్ యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తోంది. నితీశ్ రానా, శుభ్‌మన్ గిల్ ఇందుకు ఉదాహరణ. వీరు మంచి ప్రదర్శన కనబరుస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నారు. శివం మావి, కమలేశ్ నాగర్కోటి బౌలింగ్ విభాగంలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ రూపంలో మరో యువ బౌలర్ ఉన్నా.. ఇతడు ఎక్కువగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. వీరితో పాటు రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సిద్దేశ్ లాడ్ ఈ సీజన్లో తామేంటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు.
దినేశ్ కార్తీక్ అనుభవం
గౌతమ్ గంభీర్ సారథ్యంలో కేకేఆర్ విజయవంతమైన జట్టుగా కొనసాగింది. ఆ తర్వాత జట్టు పగ్గాలు చేపట్టిన కార్తీక్ జట్టును మరింత లోతుగా అధ్యయనం చేసి యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టాల్సి ఉంది. అలాగే టీమ్ఇండియా మాజీ సారథి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడం, రిషబ్ పంత్ వరుసగా విఫలమవుతున్న కారణంగా కీపర్ స్థానానికి కార్తీక్ మంచి అవకాశమని సెలక్టర్లు భావించేలా చేయాలి. వచ్చే రెండేళ్లలో రెండు ప్రపంచకప్‌లు ఉన్న కారణంగా కార్తీక్‌కు ఈ సీజన్ ఎంతో కీలకం.
ప్రమాదాలు
రసెల్, నరేన్లపై ఎక్కువగా ఆధారపడటం
గత సీజన్లో రసెల్, నరేన్లపై ఎక్కువగా ఆధారపడింది కేకేఆర్. వారు అనుకున్న మేర రాణించి జట్టును కాపాడినా.. ఇదంత గొప్ప విషయం కాదు. ఎందుకంటే ఎప్పుడూ వీరిద్దరిపై ఆధారరపడం కూడా మంచిది కాదు. జట్టును గెలిపించడానికి ప్రతి ఆటగాడు ముందుకు రావాలి.
నిరూపించుకోవాల్సిన రిజర్వ్ ఆటగాళ్లు
కేకేఆర్‌కు రిజర్వ్ బెంచ్ అంత బలంగా కనిపించడం లేదు. బ్యాటింగ్ విభాగంలో నిఖిల్ నాయక్, సిద్దేశ్ లాడ్, రింకూ సింగ్‌లకు అంతగా అవకాశాలు రావడం లేదు. సందీప్ వారియర్, ఎం.సిద్దార్థ్‌లు ఇప్పటివరకు వారేంటో నిరూపించుకోలేకపోయారు. యూఏఈలోని పరిస్థితులు, సుదీర్ఘంగా టోర్నీ జరగబోతుండటం వల్ల రిజర్వ్ ఆటాగళ్లను యాజమాన్యం సానబెట్టాల్సిన అవసరం ఉంది.
తుదిమెరుపు
దినేశ్ కార్తీక్‌కు ఈ టోర్నీ ఎంతో కీలకం. అతడు సెలక్టర్ల దృష్టిలో పడాలన్నా, టీమ్ఇండియా ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాలన్న అతడి సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిందే. అలాగే జట్టును ముందుండి నడిపించాల్సిందే. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అనుభవం జట్టుకు మరింత బలం. అలాగే ప్యాట్ కమిన్స్, రసెల్, నరేన్ రూపంలో స్టార్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. వీరందరితో కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఎలాంటి ఫలితాలు రాబడతాడో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.