ETV Bharat / sports

ఇంగ్లాండ్​పై బ్యాట్​ ఝుళిపించిన భారత బ్యాట్స్​మెన్ వీళ్లే

author img

By

Published : Aug 22, 2021, 1:22 PM IST

జెంటిల్మన్​ గేమ్​లో భారత్​, ఇంగ్లాండ్​ రెండు పోటాపోటీ జట్లే. రెండు టీమ్​ల్లో నాణ్యమైన ఆటగాళ్లున్నారు. బరిలోకి దిగితే పరుగుల వరదతో పాటు వికెట్ల వేట కొనసాగిస్తాయి. గతంలో ఆ టీమ్​పై మన క్రికెటర్లకు మంచి రికార్డే ఉంది. ప్రస్తుతం టెస్టు సిరీస్​ జరుగుతున్న నేపథ్యంలో ఇంగ్లిష్​ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లెవరో తెలుసుకుందామా.

India vs England
ఇంగ్లాండ్ vs ఇండియా

క్రికెట్​లో భారత్, ఇంగ్లాండ్ రెండూ మేటి జట్లే. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా ఏ విభాగంలో చూసినా పటిష్ఠంగా ఉంటాయి. ఈ ఇరు జట్లు తలపడితే అభిమానులకు పండగే. అదీ సుదీర్ఘ ఫార్మాట్ అయితే ఆ మజా మరింత పెరుగుతుంది. ప్రస్తుతం టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ఆ జట్టుపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లెవరో తెలుసుకుందాం..

'మాస్టర్‌' మామూలుగా ఆడలేదు..

5 indian batsmen with most runs against england in tests
సచిన్ తెందుల్కర్

'గాడ్‌ ఆఫ్ క్రికెట్‌'గా పేరొందిన సచిన్‌ తెందూల్కర్‌.. క్రీజులో ఉన్నాడంటే ఎంత దిగ్గజ బౌలర్‌ అయినా భయపడతాడు. ఎందుకంటే మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బంతులను బౌండరీలకు పంపడం సచిన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇక, ఇంగ్లాండ్‌పై మాస్టర్‌ బ్లాస్టర్‌ టెస్టుల్లో పరుగుల వరద పారించాడు. ఈ జట్టుపై 53 ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్.. 51.73 సగటుతో 2535 పరుగులు సాధించాడు. ఇంగ్లిష్​ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. మొత్తం మ్మీద ఇంగ్లాండ్‌పై ఏడు శతకాలు, 13 అర్ధశతకాలు చేశాడు. 2002 సంవత్సరం లీడ్స్‌లో జరిగిన టెస్టులో ఆతిథ్య జట్టుపై అత్యధికంగా 193 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సన్నీ.. దంచేశాడు

5 indian batsmen with most runs against england in tests
సునీల్ గావస్కర్

సునీల్ గావస్కర్‌.. క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. సన్నీ క్రీజులో ఉంటే పరుగులకు ఢోకా ఉండదని అప్పట్లో భావించేవారు. నిలకడైన ఆటతీరుతో టీమ్‌ఇండియాకు ఎన్నో విజయాలనందించాడు. టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై 67 ఇన్నింగ్స్‌లు ఆడిన గావస్కర్‌.. 38.20 సగటుతో 2483 పరుగులు సాధించాడు. దీంతో సచిన్ తర్వాత ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సన్నీ ఇంగ్లాండ్‌పై నాలుగు శతకాలు, 16 అర్ధశతకాలు చేశాడు. మరో విశేషమేమిటంటే టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న మొదటి క్రికెటర్‌ సునీల్‌ గావస్కరే.

ఇదీ చదవండి: ఉన్ముక్త్​.. రెండేళ్ల నుంచి ఒక్క మ్యాచ్​ కూడా ఆడలేదట!

ది వాల్‌.. వండర్స్‌

5 indian batsmen with most runs against england in tests
రాహుల్ ద్రవిడ్

'డిఫెన్స్‌ కింగ్' రాహుల్‌ ద్రవిడ్ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్యాటింగ్​కు దిగాడంటే క్రీజులో పాతుకుపోయి వికెట్ల ముందు గోడల నిలబడే రాహుల్‌.. ఓపిగ్గా బంతులు ఎదుర్కొంటూ పరుగులు రాబట్టేవాడు. ఇక, ద్రవిడ్‌కు ఇంగ్లాండ్‌పై మంచి రికార్డే ఉంది. ఈ జట్టుపై 37 ఇన్నింగ్స్‌లు ఆడిన 'ది వాల్‌'.. 60.93 సగటుతో 1950 పరుగులు సాధించాడు. ఇందులో 7 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్‌పై 217 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును చేశాడు. తన కెరీర్‌లో 164 టెస్టులు ఆడిన ద్రవిడ్.. 52.31 సగటుతో 13,288 పరుగులు సాధించాడు.

గుండప్ప.. అదరగొట్టాడు

5 indian batsmen with most runs against england in tests
గుండప్ప విశ్వనాథన్

1970ల్లో గుండప్ప విశ్వనాథన్‌ భారత టెస్టు క్రికెట్‌లో మంచి బ్యాట్స్‌మన్. విశ్వనాథన్‌కు టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై మెరుగైన రికార్డు ఉంది. ఈ జట్టుపై 54 ఇన్నింగ్స్‌లు ఆడిన గుండప్ప.. 37.60 సగటుతో 1880 పరుగులు సాధించాడు. ఇదే జట్టుపై 222 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించాడు. అంతేకాదు అరంగేట్ర టెస్టులోనే (ఆస్ట్రేలియాపై) శతకం(137) బాది రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లాండ్‌పై నాలుగు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం మ్మీద భారత్ తరఫున 91 మ్యాచ్‌లు ఆడిన గుండప్ప.. 41.93 సగటుతో 6080 పరుగులు చేశాడు. ఇందులో 14 శతకాలు, 35 అర్ధశతకాలున్నాయి.

రఫ్పాడిస్తున్న.. రన్‌ మెషీన్

5 indian batsmen with most runs against england in tests
విరాట్ కోహ్లీ

నేటి తరం మేటి ఆటగాడు, టీమ్‌ఇండియా 'రన్‌ మెషీన్‌', ప్రస్తుత భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇంగ్లాండ్‌పై పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో విరాట్‌ బ్యాట్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ రాకపోయినా.. గతంలో జరిగిన సిరీస్‌ల్లో ఇంగ్లాండ్‌ బౌలర్లను విరాట్ ఉతికారేశాడు. 2016లో ముంబయి వేదికగా జరిగిన టెస్టులో 235 పరుగుల భారీ స్కోరు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌ 36 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్‌పై 44 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 44.00 సగటుతో 1804 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలున్నాయి.

ఇదీ చదవండి: ఇంగ్లాండ్‌ కవ్వింపులు- విజయాలతో భారత్ బదులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.