ETV Bharat / sitara

Good Luck Sakhi Movie review: 'సఖి'ని అదృష్టం వరించిందా?

author img

By

Published : Jan 28, 2022, 3:51 PM IST

Good Luck Sakhi Review: ఎప్పటినుంచో వాయిదా పడుతూ పడుతూ వచ్చిన 'గుడ్ ​లక్ సఖి'.. ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. శుక్రవారం రిలీజైంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

Good luck sakhi review
గుడ్​లక్ సఖి రివ్యూ

చిత్రం: గుడ్ లక్ సఖి

నటీనటులు: కీర్తి సురేష్, జగపతిబాబు, ఆది పినిశెట్టి, రాహుల్ రామకృష్ణ, రఘుబాబు తదితరులు

రచన-దర్శకత్వం: నగేశ్ కుకునూరి

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

నిర్మాతలు: సుధీర్ చంద్ర, శ్రావ్యవర్మ

విడుదల తేది: 2022 జనవరి 28

మహానటితో జాతీయ ఉత్తమనటి అనిపించుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మరో చిత్రం 'గుడ్ లక్ సఖి'. హైదరాబాద్ బ్లూస్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నగేశ్ కుకునూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వీరిద్దరి కలయికలో విడుదలైన ఈ చిత్రం... ప్రేక్షకులతో గుడ్ అనిపించుకుందో లేదో ఈటీవీ భారత్ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

Good luck sakhi review
గుడ్​లక్ సఖి మూవీలో కీర్తి సురేశ్

ఇదీ సఖీ కథ:

దంతులూరు అనే పల్లెటూరిలో గిరిజన కుటుంబంలో పుట్టిన అమ్మాయి సఖి పారికర్ (కీర్తి సురేష్). పసుపు దంచే పనులు చేసుకుంటూ స్నేహితులతో గడిపేస్తూ హాయిగా జీవిస్తుంటుంది. అయితే సఖి పెళ్లి పీటలదాక రాకుండానే ఆగిపోతుండటం వల్ల ఊరంతా తనను బ్యాడ్ లక్ సఖి అంటుంటారు. అప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు గోళి రాజు (ఆది పిన్నిశెట్టి) నాటకం వేయడానికి ఊళ్లోకి వస్తాడు. గోళి రాజు కనిపించడం వల్ల చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఆనందంతో ఇరువురు ఉప్పొంగిపోతుంటారు. అదే సమయంలో కల్నల్(జగపతిబాబు) తన సొంత గ్రామమైన దంతులూరిలోనే యువతకు రైఫిల్ షూటింగ్ లో ట్రైనింగ్ ఇచ్చి ఛాంపియన్స్​ను తయారు చేయాలనుకుంటాడు. చిన్నప్పుడు గోళీలాటలో గురిచూసి కొట్టడంలో దిట్టైన సఖిని గోళిరాజు కల్నల్ దగ్గరకు తీసుకొస్తాడు. సఖితోపాటు అదే ఊరిలో ఉన్న సూరి(రాహుల్ రామకృష్ణ) కూడా రైఫిల్ షూటింగ్ లో సఖితో పోటీపడతాడు. సఖిలోని ప్రతిభను గమనించిన కల్నల్ రైఫిల్ షూటింగ్​లో శిక్షణ ఇచ్చి జిల్లా స్థాయిలో పోటీలకు తీసుకెళ్తాడు. ఆ పోటీల్లో సఖి రాణిస్తుంది. రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధమవుతున్న తరుణంలో సఖి కల్నల్​తో చనువుగా ఉండటం చూసి గోళిరాజు అపార్థం చేసుకుంటాడు. సఖి కూడా కల్నల్​ను ప్రేమిస్తున్నానని చెబుతుంది. అది ప్రేమ కాదు... గౌరవం అని కల్నల్ సఖితో వాదిస్తాడు. ఇప్పటి వరకు అదృష్టంతో కాదు నీపై నమ్మకంతో గెలిచావని చెబుతాడు. రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో దిగిన సఖి.. ఎలా గెలిచింది? సఖిని ఇష్టపడిన గోళిరాజు పరిస్థితి ఏమైందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Good luck sakhi review
గుడ్​లక్ సఖి మూవీ రివ్యూ

ఎలా ఉందంటే?

మహానటి తర్వాత కీర్తి సురేష్ మహిళా ప్రాధాన్యతగా ఏ కథ ఎంచుకున్నా.... ఎన్ని సినిమాలు చేసినా మహానటితో పోల్చకతప్పదు. అలాంటి చిత్రం కీర్తి కెరీర్​లో మరోటి రాదనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే గుడ్ లక్ సఖి చూసిన తర్వాత... కీర్తి నటనను, తన ప్రతిభను దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారనిపిస్తుంది. తనకు నచ్చిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ వాటికి నూరు శాతం న్యాయం చేసేందుకు పడుతున్న కష్టం.... గుడ్ లక్ సఖిలో బూడిదలో పోసిన పన్నేరే అయ్యింది. గిరిజన కుటుంబంలో జన్మించిన పల్లెటూరి అమ్మాయి... రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో ఎలా విజయం సాధించిందనే కథాంశాన్ని దర్శకుడు నగేష్ కుకునూరి ఈ చిత్రంలో చెప్పాలనుకున్నాడు. ఒక స్పోర్ట్స్ డ్రామాగా కథను తయారు చేసుకున్నాడు. కానీ కథనాన్ని, అందులోని పాత్రలు తీర్చిదిద్దడంలో తడపడ్డాడు. ప్రథమార్థం కీర్తి షూటర్​గా శిక్షణ పొందడం, గోళి రాజు, కల్నల్ పాత్రల చుట్టూనే సరిపోయింది. ద్వితీయార్థంలో కీర్తి పాత్రను మలిచిన తీరు అసంతృప్తిని కలిగిస్తుంది. తనపై బ్యాడ్ లక్ సఖి అన్న ముద్రను చెరిపేసుకోడానికి కీర్తి తపన పడుతున్నట్లుగా ఎక్కడా కనిపించదు. కేవలం కల్నల్ పాత్ర తన లక్ష్యం కోసం తపిస్తున్నట్లుగానే ఉంటుంది. అయితే కల్నల్ లక్ష్యం కూడా సరిగా కుదరలేదు. కీర్తి-జగపతిబాబు కలయికను ఇదివరకే మిస్ ఇండియా చిత్రంలో చూశారు. మరోసారి సఖిలోనూ వీరిద్దరి కలయిక పేలవంగానే సాగింది. సినిమాలో వినోదానికి పెద్దగా అవకాశం ఇవ్వలేదు.

Good luck sakhi review
'గుడ్​లక్ సఖి' సినిమాలో కీర్తి సురేశ్-ఆది పినిశెట్టి

ఎవరెలా చేశారంటే:

టైటిల్ కు తగినట్టుగానే ఈ సినిమా మొత్తాన్ని భుజానికెత్తుకొని కథ, కథనాలను నడిపించిన నటి... కీర్తి సురేష్. మహానటి చూసిన తర్వాత అభిమానులు కీర్తి సురేష్ నటనపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గకుండా కీర్తి బాగా నటించింది. సఖి పాత్రలో గిరిజన అమ్మాయిగా లీనమైపోయింది. రైఫిల్ షూటర్​గా శిక్షణ పొందే తీరు, నడవడిక అంతా బాగుంది. ఇక ఈ చిత్రంలో కల్నల్ పాత్రలో నటించిన జగపతిబాబు నటన గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇది వరకే లక్ష్య చిత్రంలో కోచ్ పాత్రలో కనిపించిన జగపతిబాబు... ఇక్కడ కూడా అదే పాత్రలో కనిపించారు. గోళి రాజు పాత్రలో నటించిన ఆది పిన్నిశెట్టి రంగస్థల కళాకారుడిగా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. సూరి పాత్రలో రాహుల్ రామకృష్ణ నటన సినిమాకు కొంత ఊరటనిచ్చింది. కథానాయికను వేధిస్తూ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించిన రాహుల్ రామకృష్ణ... ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సంగీత పరంగా దేవీశ్రీప్రసాద్ అందించిన బాణీలు, నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపించాయి. దర్శకుడు నగేశ్ కుకునూరు మార్క్ స్పష్టంగా కనిపించింది. నగేశ్ మాటలు అక్కడక్కడ పేలాయి. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపించాయి. అయితే సాంకేతికంగా డబ్బింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండేది.

బలం:

+కీర్తి సురేష్

+పాటలు

బలహీనత:

-కథ

- సాగదీసే సన్నివేశాలు

చివరగా: గుడ్ లక్ కష్టమే సఖి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: అతడితో జర్నీ చాలా బ్యూటిఫుల్: కీర్తి సురేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.