ETV Bharat / sitara

'దిగువ మధ్య తరగతి జీవితం గడపాలనుకున్నా'

author img

By

Published : Apr 5, 2021, 7:32 AM IST

పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'వకీల్​సాబ్'. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఆడపడుచుల గౌరవం కాపాడటంలో తాము ఉడతా భక్తిగా చేసిన సినిమా ఇదని తెలిపారు.

Vakeelsaab pre release event
వకీల్​సాబ్ ప్రీరిలీజ్

పవన్​ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'వకీల్‌సాబ్‌'. శ్రీరామ్‌ వేణు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. బోనీ కపూర్‌ సమర్పిస్తున్నారు. ఈ నెల 9న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ వేదికపై సామాజిక సేవలో కొనసాగుతున్న పలువురు మహిళల్ని సత్కరించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు.

"మూడేళ్లు సినిమా చేయలేదనే భావన నాకెప్పుడూ కలగలేదు. సినిమా పరిశ్రమకొచ్చి 24 ఏళ్లయిందన్న విషయం కూడా నాకు గుర్తు లేదు. అద్భుతమైన విజయాలు సాధించిన నిర్మాత దిల్‌ రాజుతో సినిమా చేయడం, శ్రీరామ్‌ వేణులాంటి ఒక మంచి దర్శకుడి దగ్గర నటించడం అదృష్టంగా భావిస్తున్నా. నేను నటుడే అవ్వాలనుకోలేదు. ఎవ్వరూ గుర్తించకుండా దిగువ మధ్య తరగతి జీవితం గడపాలనుకున్నా. అది తప్ప అన్నీ తీరాయి. 'వకీల్‌సాబ్‌' అంటే నాకు తెలిసిన మొదటి వకీల్‌.. నాని పాల్కీవాలా. ఎమర్జెన్సీ సమయంలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుంటే బలంగా వాదించిన వ్యక్తి. గుంటూరు జిల్లాకి చెందిన భువనగిరి చంద్రశేఖర్‌, బాలగోపాల్‌ ..ఇలా మానవ హక్కుల కోసం పోరాడే న్యాయవాదులంటే అపారమైన గౌరవం నాకు. ఆడపడుచుల గౌరవం కాపాడటంలో మేము ఉడుతాభక్తిగా చేసిన సినిమా 'వకీల్‌సాబ్‌".

pawan Kalyan
పవన్ కల్యాణ్

"నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయిన ముగ్గురు అమ్మాయిల కథ ఇది. వాళ్లని ఆదుకునే న్యాయవాది పాత్ర చేసినందుకు అదృష్టంగా భావిస్తున్నా. ఆ ముగ్గురు పాత్రల్లో నివేదా, అంజలి, అనన్య చాలా బాగా నటించారు. ప్రతివాదుల న్యాయవాదిగా ప్రకాష్‌రాజ్‌ నటించడం సినిమాకి వన్నెతెచ్చింది. తమన్‌, వినోద్‌, రాజీవన్‌ మేమంతా కష్టపడి పనిచేశాం. అభిమానులు లేకపోతే పవన్‌కల్యాణ్‌ లేడు. చాలామంది నాకు పొగరు అనుకుంటారు. నా ప్రపంచంలో నేను బతుకుతుంటా. అది చూసిన మిగతావాళ్లకి పొగరు అనిపించొచ్చు. ఈ సినిమా అందరికీ ఆనందం పంచాలని, బాధ్యత తెలియజేయాలని కోరుకుంటున్నా."

"పేకాట క్లబ్బులు నడిపేవాళ్లు ఎమ్మెల్యేలు కావొచ్చు. పైరవీలు చేసేవాళ్లు రాజకీయాల్లో ఉండొచ్చు. నేను సినిమాలు చేస్తూ రాజకీయం చేయకూడదా? అవినీతి చేయకుండా ఉండటం కోసమే నేను సినిమాలు చేస్తాను. నేను సినిమా చేస్తే వెయ్యి మంది బతుకుతారు. సినిమా అనేది డబ్బు సంపాదించడం కోసమే కాదు, పది మంది ఉపాధికి కూడా. అందరి ఆనందంతోపాటు నాకు డబ్బు వస్తే సంతోషం. ఆ డబ్బుని సమాజం కోసమే వినియోగిస్తా. భగవంతుడు అవకాశం ఇచ్చినంతవరకు ప్రజలకి సేవ చేస్తా. అందులో భాగంగా సినిమాలు కుదిరితే కచ్చితంగా చేస్తా. సినిమాల నుంచి పారిపోయే వ్యక్తిని కాదు" అన్నారు పవన్‌కల్యాణ్‌.

pawan Kalyan
పవన్ కల్యాణ్

దిల్‌రాజు మాట్లాడుతూ "తొలిసారి పంపిణీదారుడిగా పవన్‌కల్యాణ్‌ని చూశా. 'తొలిప్రేమ' వంద రోజుల తర్వాత ఎప్పుడైనా నిర్మాత అయితే పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేయాలనుకున్నా. 22 యేళ్ల కల ఇలా నెరవేరింది" అన్నారు.

శ్రీరామ్‌ వేణు మాట్లాడుతూ "ఈ సినిమా సమష్టి కృషి. తమన్‌, వినోద్‌, రామజోగయ్యశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ ఇలా మంచి బృందం కలిసి పనిచేసింది. అంజలి, నివేదా థామస్‌, అనన్య, ప్రకాష్‌రాజ్‌, శ్రుతిహాసన్‌ ఇతర నటీనటులంతా చాలా బాగా పనిచేశారు. దిల్‌రాజు, త్రివిక్రమ్‌ వల్ల నాకు ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. మనందరి జీవితంలో స్త్రీల విలువని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం" అన్నారు.

ఈ కార్యక్రమంలో డీఐజీ సుమతి, అంజలి, అనన్య, హరీష్‌శంకర్‌.ఎస్‌, తమన్‌, బండ్ల గణేష్‌, సురేందర్‌రెడ్డి, రామ్‌ తాళ్లూరి, పద్మావతి, రుచిత, క్రిష్‌, ఎ.ఎం.రత్నం, సాగర్‌ చంద్ర, సూర్యదేవర నాగవంశీ, యలమంచిలి రవిశంకర్‌, మీర్‌, హర్షిత్‌ తదితరులు పాల్గొన్నారు.

pawan Kalyan
పవన్ కల్యాణ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.