ఈశ్వర్ కుంచెతో సినీ పోస్టర్‌కు కొత్త అందం
ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్(Eswar Publicity Designer) మంగళవారం కన్నుమూశారు. పబ్లిసిటీ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. 50ఏళ్ల సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వేలాది చిత్రాలకు పోస్టర్లు తయారు చేసి.. అందరి మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జీవితవిశేషాలపై ప్రత్యేక స్టోరీ..
"నడిరోడ్డు మీద జనవాహనాలని హఠాత్తుగా నిలబెట్టి.. తలెత్తించి పోస్టర్లకేసి చూసేలా చేసిన కళా మాంత్రికుడాయన. ఆ జనవాహినిని సినిమాహాలు క్యూలో నిలబడేలా చేసి, వందలాది సినిమాలను శత దినోత్సవాల దాకా నడిపించిన కళాకారుడాయన. కళని పోస్టర్ పోట్రయిట్ స్థాయికి పెంచి చూపిన సినీ 'రవి వర్మ' ఆయన. 'ప్రకటన చిత్ర కళలో గురుస్థానాధిష్టుడు'అని బాపు, రమణల ప్రశంసలు అందుకున్న ఆ అపర రాజా రవివర్మే.. ఈశ్వర్.
తన కుంచెతో సినిమా పోస్టర్‌కు కొత్త వన్నెలద్ది.. పబ్లిసిటీ ప్రక్రియలో తన కళా విశ్వరూపాన్ని చూపించారు. 50ఏళ్ల సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వేలాది చిత్రాలకు పోస్టర్లు తయారు చేసి.. అందరి మన్ననలు అందుకున్నారు. సినిమా పోస్టర్ ఈశ్వర్‌గా చిత్ర సీమపై చెరగని ముద్ర వేసిన ఆయన కళాభిమానుల్ని విషాదంలో నెట్టేసి వెళ్లిపోయారు.
2600పైగా చిత్రాలకు..
ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్(84)(Eswar Publicity Designer) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వం వహించిన 'సాక్షి' చిత్రంతో పబ్లిసిటీ డిజైనర్‌గా(Eswar Publicity Designer) ప్రయాణం మొదలుపెట్టారు. తొలిసారి సొంతంగా కలర్ పోస్టర్లు, లోగో రూపొందించి మంచి గుర్తింపును సాధించారు. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీతో పాటు పలు భాషా చిత్రాలకు పబ్లిసిటీ పనులు నిర్వర్తించారు. దాదాపు 2600పైగా చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా వ్యవహరించారు.

పబ్లిసిటీ ఆర్టిస్టుగా..
ఏవీఎం, విజయా, జెమినీ, అన్నపూర్ణ, సురేష్‌ప్రొడక్షన్స్, వైజయంతి లాంటి అగ్ర నిర్మాణ సంస్థలకు పబ్లిసిటీ డిజైనర్‌గా(Eswar Publicity Designer) సేవలందించారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. ఆయన పూర్వీకులు ఉత్సవ విగ్రహాలు తయారు చేసేవారు. అలా బొమ్మలు గీయడం ఆయనకు వంశపారపర్యంగా వచ్చింది. కాకినాడలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతుండగా ఆర్థికపరమైన ఇబ్బందులతో చదువు కొనసాగించలేకపోయారు. దీంతో సినిమా పబ్లిసిటీ ఆర్టిస్టుగా(Publicity Designer Eswar) గుర్తింపు తెచ్చుకోవాలని భావించి చెన్నై చేరుకున్నారు. అనంతరం ఆర్టిస్టు కేతా వద్ద శిష్యరికం చేసి పోస్టర్ డిజైనింగ్‌లో మెళకువలు నేర్చుకున్నారు.
ఆఫ్‌సెట్ ముద్రణలేని ఆ కాలంలో లైన్‌డ్రాయింగ్ పద్ధతితో పోస్టర్లకు సరికొత్త సోయగాన్ని తీసుకొచ్చారు. కొంతకాలం తర్వాత 'ఈశ్వర్' పేరుతో పబ్లిసిటీ డిజైనింగ్ సంస్థను ప్రారంభించారు.
పోస్టర్ డిజైనింగ్‌లో ప్రయోగాలు
'పాపకోసం' చిత్రం కోసం బ్రష్ వాడకుండా నైఫ్ వర్క్‌తో వాల్‌పోస్టర్లను రూపొందించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. పోస్టర్ల డిజైనింగ్‌లో ఎప్పటికప్పుడు ప్రయోగాలను చేసి కొత్తదనాన్ని తీసుకొచ్చిన ఘనత ఈశ్వర్‌ది. అన్నాదురై చిత్రపటాన్ని రూపొందించాలని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి స్వయాన ఈశ్వర్‌ను కోరడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, ఎంజీఆర్, శివాజీ గణేషన్, జెమినీ గణేశన్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల చిత్రాలకు పబ్లిసిటీ డిజైన్లు రూపొందించారు. ఆయన చివరిగా పనిచేసిన చిత్రం 'దేవుళ్లు'. ఈశ్వర్ రాసిన 'సినిమా పోస్టర్' పుస్తకానికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో 2011లో నంది పురస్కారం లభించింది.

ఆ పురస్కారంతో..
చిత్రసీమకు ఆయన చేసిన సేవలకుగానూ 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఈశ్వర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బుధవారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈశ్వర్‌కు భార్య వరలక్ష్మి, కుమారులు విజయ్‌కుమార్, శశికుమార్, కుమార్తెలు వనజ, రేఖలు ఉన్నారు.
ఈశ్వర్ అంటేనే పోస్టర్..
"సినిమాకు పోస్టర్ ఎంత అవసరం ఉందో.. దాని రూపకల్పన చేయడానికి ఈశ్వర్ అవసరమూ అంతే ఉంది"అనేవారు నిర్మాత డి.రామానాయుడు. దానికి 'పాప కోసం'సినిమా పోస్టర్ మంచి ఉదాహరణగా చెప్పేవారు. అలాగే ప్రేమ్‌నగర్ పోస్టర్ల విషయంలోనూ ఆయన ప్రతిభకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. అందుకే
"ప్రేమ్‌నగర్ నా సంస్థను హిమాలయం మీద నిలబెడితే.. దాని పోస్టర్ ఈశ్వర్ తలపై కిరీటాన్ని పెట్టింది" అనేవారు నిర్మాత రామానాయుడు. పబ్లిసిటీలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేయడానికి ఎప్పుడూ ఉత్సాహం చూపించే ఈశ్వర్... 'అల్లూరి సీతారామరాజు' చిత్రం కోసం 12 షీట్ పోస్టర్ డిజైన్ చేసి మెప్పించారు. అప్పట్లో 'సింహాసనం' కోసం 24షీట్ పోస్టర్ డిజైన్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ చిత్రం తర్వాతే 24 షీట్ పోస్టర్ వేయటం చిత్ర సీమలో ఓ ఆనవాయితీగా మారిందంటారు కృష్ణ.
కుంచెతో ప్రాణ ప్రతిష్ఠ చేశారు..
ఈశ్వర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. "పలు చిత్రాలకు తన డిజైన్స్ ద్వారా ప్రచారం కల్పించిన ఈశ్వర్ తిరిగిరాని లోకాలకు వెళ్లడం బాధాకరమని" ఆవేదన వ్యక్తం చేశారు కథానాయకుడు బాలకృష్ణ. ఆయనతో తనకి మంచి అనుబంధం ఉందని, తాను హీరోగా పని చేసిన కొన్ని సినిమాలకు ఈశ్వర్ పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. "ఈశ్వర్‌తో మా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు విడదీయలేని బంధం ఉందన్నారు నిర్మాతసురేష్‌బాబు.
"ఎన్టీఆర్, ఏయన్నార్, యస్వీఆర్, సావిత్రి లాంటి మహానటులకు, వారి పాత్రలకు తన కుంచెతో ప్రాణప్రతిష్ఠ చేసిన ఈశ్వర్ మన మధ్య లేకపోవడం బాధాకరమ"న్నారు మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా.
ఇదీ చదవండి: Love Story Movie: 'ఆయన స్వేచ్ఛ వల్లే ఇది సాధ్యమైంది'

