కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు మరోసారి ఆసరాగా నిలిచేందుకు ముందుకొచ్చాడు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. ప్రస్తుతం 'ఖత్రోన్ కే ఖిలాడి: మేడ్ ఇన్ ఇండియా' అనే అడ్వెంచర్ రియాల్టీ టీవీ షోతో ఒప్పందం చేసుకున్న ఈ దర్శకుడు.. దాని నుంచి వచ్చే రెమ్యూనరేషన్లో కొంతభాగాన్ని సినీకార్మికుల కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నాడు.
బ్యాంకు ఖాతాలకు నగదు
బాలీవుడ్‌లోని జానియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు, స్టంట్‌మెన్, లైట్‌మెన్, ఇతర కార్మికుల బ్యాంకు ఖాతాలకు నగదును నేరుగా జమ చేయనున్నట్లు దర్శకుడు రోహిత్ శెట్టి తెలిపాడు. 'ఖత్రోన్ కే ఖిలాడి: మేడ్ ఇన్ ఇండియా' స్పెషల్ సీజన్ షూటింగ్ ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ సీజన్ పూర్తి చిత్రీకరణ ముంబయిలోనే జరుగుతుంది. గత సీజన్లలో కొన్ని ఎపిసోడ్లు విదేశాల్లో చిత్రీకరించారు.
దేశంలో కరోనా ఆంక్షలు మొదలైన నేపథ్యంలో స్వదేశాలకు వెళ్లడానికి కొంతమంది ఫొటోగ్రాఫర్లకు సహకరించాడు రోహిత్‌శెట్టి. లాక్డౌన్ సమయంలో అన్నార్తులకు ఆహారాన్ని అందించడం సహా సినీకార్మికుల సంక్షేమానికి విరాళాన్ని ప్రకటించాడు.
దీపావళికి 'సూర్యవంశీ'!
రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సూర్యవంశీ'.. మార్చి నెలాఖరున విడుదల కావాల్సింది. కానీ, దేశంలో కరోనా ఆంక్షల కారణంగా ఆ సినిమా వాయిదా పడింది. ఈ చిత్రంలోని ప్రధానపాత్రల్లో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ నటిస్తుండగా.. అజయ్ దేవగణ్, రణ్వీర్ కపూర్లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఒకవేళ ఆగస్టు తర్వాత సినిమాహాళ్లు తెరవడానికి కేంద్రం అనుమతిస్తే దీపావళి కానుకగా 'సూర్యవంశీ', '83' చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాణసంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి.