తెలుగులో చాలా మంది కథానాయకులు ఒకట్రెండేళ్లుగా ఒకే సినిమా చేస్తూ గడుపుతున్నారు. వాళ్లంతా చివరి దశలో ఉన్న ఆ సినిమాల్ని పూర్తి చేసి, త్వరలోనే కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగనున్నారు. ఇప్పుడు ఆ సినిమాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందాల ఎంపికే ఊపందుకుంది.
కరోనా వల్ల ఒకరినొకరు కలిసే పరిస్థితులు లేకపోయినా.. ఏయే కథానాయికలు అందుబాటులో ఉన్నారు? ఎవరెన్ని రోజులు కాల్షీట్లు కేటాయించగలరో ఆరాలు తీస్తున్నారు దర్శకనిర్మాతలు. ఆ లెక్కలతోపాటు పారితోషికాలు, ఇతరత్రా వ్యవహారాలన్నీ కొలిక్కి వచ్చాక ఎంపికపై ఓ స్పష్టత వస్తుంది. ఏ సినిమాకు ఎవరు ఖరారవుతారో తెలియదు కానీ.. కత్రినాకైఫ్ మొదలుకొని కియారా వరకు పలువురు బాలీవుడ్ భామల పేర్లు టాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి.
జాన్వీ కపూర్ అడుగుపెట్టేనా?
తెలుగులో క్రేజీ కాంబినేషన్‌లో ఏ సినిమా మొదలవుతున్నా సరే.. శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ పేరు వినిపించాల్సిందే. కానీ ఇప్పటిదాకా జాన్వీ తెలుగులో కనిపించిందే లేదు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లైగర్'లో ఆమే నటించాల్సింది కానీ.. కాల్షీట్లు సర్దుబాటు కాకపోవడం వల్ల అందులో అనన్య పాండే ఎంపికైంది. ఇప్పుడు మళ్లీ జాన్వీ పేరు తెలుగులో వినిపించడం మొదలైంది. ఈసారి మహేశ్‌కు జోడీగా అంటూ ఫిల్మ్‌నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
మళ్లీ వచ్చేనా?
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా విషయంలో దిశా పటానీ పేరూ గట్టిగానే వినిపిస్తోంది. త్వరలోనే సల్మాన్‌ఖాన్‌తో కలిసి 'రాధే'తో సందడి చేయనున్న దిశా తెలుగు తెరకు కొత్తేమీ కాదు. 'లోఫర్'తో తెలుగులో ఇదివరకే సందడి చేసింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన పలు సినిమాల విషయంలోనూ ఆమె పేరు ప్రస్తావన కొచ్చింది కానీ కుదర్లేదు. ఇప్పుడు మహేశ్‌కు జోడీగా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది టాలీవుడ్ వర్గాల మాట.
బాలీవుడ్‌కే పరిమితమా!
కియారా అడ్వాణీ ఇప్పటికే రెండు తెలుగు సినిమాలు చేసింది. అయినా సరే.. ఆమె కేరాఫ్ ముంబయినే. కియారాకు తరచూ తెలుగు నుంచి అవకాశాలు అందుతుంటాయి. కియారా పేరు ఎన్టీఆర్, రామ్‌చరణ్ సినిమాల విషయంలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. అందులో హీరోయిన్గా కియారానే ఎంపిక చేసుకొనే ప్రయత్నాల్లో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. అలాగే రామ్‌చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించనున్న సినిమాలోనూ కియారానే జోడీగా నటిస్తుందని ప్రచారం సాగింది. ఇప్పుడు రష్మిక పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. మరి అవకాశం ఎవరికి దక్కుతుందనేది చూడాలి.
అగ్రహీరోల నడుమ..
చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కనున్న 'లూసిఫర్' సినిమా రీమేక్ విషయంలోనూ సోనాక్షి సిన్హా పేరు వినిపించింది. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రమది. ప్రభాస్ కథానాయకుడిగా ఓ బాలీవుడ్ దర్శకుడు సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారని, అందులో బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ఎంపిక ఖరారైందని హిందీ సినీ వర్గాలు చెబుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలోనూ దీపికా పదుకొణె ఖరారైంది. 'ఆర్‌ఆర్‌ఆర్'లో అలియాభట్ నటిస్తోంది.
మరోవైపు 'హరిహర వీరమల్లు'లో జాక్వెలైన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. అనన్య పాండే పేరు కూడా మహేశ్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా విషయంలో వినిపించింది. తెలుగులో పాన్ ఇండియా సినిమాల జోరు కొనసాగుతోంది. అగ్ర కథానాయకుల చిత్రాలు ఎక్కువగా పలు భాషల్ని లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్నాయి. అందుకే ఎక్కువ భాషల్లో గుర్తింపున్న తారల్ని తమ సినిమాల కోసం ఎంపిక చేసుకుంటున్నారు. బాలీవుడ్ తారలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుంది కాబట్టి వాళ్లను ఎంపిక చేయడంపైనే మొగ్గు చూపుతున్నారు దర్శకనిర్మాతలు. ఓటీటీ వ్యాపారానికి కూడా ఆ తరహా ఎంపిక కలిసొస్తోంది.
ఇదీ చూడండి: యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో నాగచైతన్య!