Genome Sequencing meaning: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఇంకా వెంటాడుతూనే ఉంది. కొత్త రూపాలతో మానవాళిని భయపెడుతోంది. తాజాగా ఒమిక్రాన్ రూపంలో ఉరుముతున్న ఈ మహమ్మారి కేసులు మన దేశంలోనూ గణనీయంగా పెరుగుతున్నాయి. రెండు డోసుల టీకా వేసుకున్నా వదలడంలేదు. జన్యు మార్పులకు గురవుతూ వ్యాప్తి చెందుతూనే ఉంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చేవారితో పాటు మిగతా వారికి కూడా కొవిడ్ -19 పాజిటివ్‌గా తేలితే వారి శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపిస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఒక వైరస్‌లో వివిధ వేరియంట్లను పరిశోధకులు ఎలా గుర్తిస్తారో అనే సందేహం చాలా మందిలో తలెత్తుతుంటుంది. ఒమిక్రాన్‌ని గుర్తించడంతో పాటు దాని వ్యాప్తిని కట్టడి చేసి కొత్త ఉత్పరివర్తనాలను గుర్తించడంలో జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియదే కీలక పాత్ర. గతంలో కొవిడ్ స్ట్రెయిన్లతో పాటు సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా రకాన్ని కూడా ఇదే పద్ధతిలో గుర్తించారు. అసలు జీనోమ్ సీక్వెన్సింగ్ ఎలా చేస్తారు? వేరియెంట్లను గుర్తించడంలో ఈ పద్ధతి ఎలా సహాయపడుతుందో గమనిస్తే..
Genome Sequencing uses
ఆర్ఎన్ఏ అణువు నుంచి జన్యుపరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగపడే సాంకేతిక ప్రక్రియే జీనోమ్ సీక్వెన్సింగ్. వైరస్ రకం, ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్లు), ఏ పద్ధతిలో మనుషులపై దాడి చేస్తుంది? ఎలా వ్యాప్తి చెందుతుంది? తదితర కీలక సమాచారాన్ని తెలుపుతుంది. ఈ సాంకేతికత అర్థం కావాలంటే శరీరంలో వైరస్ సంక్రమణ ఎలా జరుగుతుందో తొలుత తెలియాలి. డీఎన్‌ఏ అణువులతో మనిషి శరీరం నిర్మితమైనట్టే వైరస్ కూడా డీఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏ రూపంలో ఏర్పడుతుంది. కరోనా ఆర్‌ఎన్‌ఏతో ఏర్పడినదే ఈ వైరస్.
కొత్త వేరియంట్లను ఎలా గుర్తిస్తారు?
వైరస్‌లలో మ్యుటేషన్లను గుర్తించేందుకు పరిశోధకులు కరోనా సోకిన వారి నుంచి నమూనాలను సేకరిస్తారు. తర్వాత దాన్ని 'జీనోమ్ సీక్వెన్సింగ్' అనే పద్ధతి ద్వారా పరిశీలిస్తారు. ఆ నమూనాని బీఎస్‌ఎల్ 3 ల్యాబ్‌కు పరీక్ష కోసం తరలిస్తారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఆ శాంపిల్స్ నుంచి ఆర్‌ఎన్‌ఏని సంగ్రహించి అది డీగ్రేడ్ కాకుండా ఉండేలా మైనస్ 80డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద ఉంచుతారు. ల్యాబ్‌లో ఆర్‌ఎన్‌ఏని ప్రాసెస్ చేసి డీఎన్‌ఏగా మారుస్తారు. డీఎన్‌ఏతో పోలిస్తే ఆర్‌ఎన్‌ఏ అత్యంత అస్థిరతతో కూడినది గనక డీఎన్‌ఏగా మారిస్తే శాంపిల్ సమాచారాన్ని స్థిరంగా ఉంచగలుగుతుంది. డీఎన్‌ఏని ఫ్రాగ్మెంటేషన్‌కు పంపే ముందు పీసీఆర్ ఆంప్లిఫికేషన్లో ఉంచుతారు. డీఎన్‌ఏ చాలా పొడుగ్గా ఉన్నందున సీక్వెన్సింగ్ చేసేందుకు దాన్ని ముక్కలుగా విభజించి ట్యాగ్ చేస్తారు. ఈ శాంపిల్ పరిమాణం, నాణ్యతను పరీక్షించేందుకు ఓ యంత్రంలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత సిద్ధంగా ఉన్న శాంపిల్స్‌ని డీఎన్‌ఏ జన్యుక్రమాన్ని గుర్తించే యంత్రంలోకి పంపగా అది వివిధ రసాయనాలతో మిళితమవుతుంది. తద్వారా ఆ నమూనాల న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్స్ ఈ వైరస్ ఏ రకానికి చెందినదో నిర్ధరిస్తుంది.
ఇదీ చదవండి: మూడో డోసుగా ఏ టీకా ఇస్తారు? ఎన్ని రోజులకు?