ETV Bharat / opinion

జాడలేని రక్షిత జలం.. పట్టి పీడిస్తోన్న ఫ్లోరోసిస్‌

author img

By

Published : Nov 6, 2020, 8:50 AM IST

తాగునీటిలో ఫ్లోరైడ్​ ఎక్కువై దేశవ్యాప్తంగా అనేక మంది ఫ్లోరోసిస్​కు గురవుతున్నారని ఏళ్ల క్రితం నాడే తేలింది. అయితే.. ఆ మూలకం లేకుండా పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయడంలో ప్రభుత్వం ఇప్పటికీ విఫలమవుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 20కోట్ల మంది ఫ్లోరైడ్​తో అనారోగ్యానికి గురవుతుంటే.. మన దేశంలోనే 17కోట్ల మంది ఉన్నట్టు సర్వేలు వెల్లడించాయి. ఓ మనిషికి రోజుకు కనీసం 4లీటర్ల మంచి నీరు, పౌష్టికాహారం అందకనే.. నేటికీ ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.

PEOPLE SUFFERING WITH FLUOROSIS DUE TO UNPROTECTED WATER
జాడలేని రక్షిత జలం!

తాగునీటిలో పరిమితికి మించి ఉన్న ఫ్లోరైడ్‌ ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తోందని దేశంలో 83 ఏళ్ల కిందటే గుర్తించారు. ఇప్పటికీ ఆ మూలకం లేని నీటిని పూర్తి స్థాయిలో సరఫరా చేయడంలో ప్రభుత్వాలు విజయం సాధించలేకపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ఈ నీటిని తాగి ఫ్లోరోసిస్‌ బారిన పడుతుంటే... మన దేశంలో అటువంటి బాదితులు కోటీ 17 లక్షల మంది ఉన్నారని ఫ్లోరోసిస్‌ నివారణ, నియంత్రణకు ఉద్దేశించిన జాతీయ కార్యక్రమం (ఎన్‌పీపీసీఎఫ్‌) వెల్లడించింది. కొన్నేళ్లుగా ఈ విషయంలో పరిశోధనలు, సర్వేలు, అవగాహన, సహాయ కార్యక్రమాలు చేస్తున్న ఎన్జీఓలు మాత్రం భారతదేశంలో ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఆరు కోట్లమంది ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. ఒక మనిషికి రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచి నీరు, పోషకాహారం అందకపోవడం వల్లే 21వ శతాబ్దంలోనూ ఈ సమస్య ఉత్పన్నమవుతోంది.

డబ్ల్యూహెచ్​ఓ సూచన ప్రకారం..

మన దేశ పరిస్థితుల దృష్ట్యా లీటరు తాగునీటిలో ఒక మిల్లీ గ్రాము నుంచి 1.5 మి.గ్రా. ఫ్లోరైడ్‌ మాత్రమే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. తమిళనాడు, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌లలో కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ 29 మి.గ్రా. వరకు ఉందని అంతర్జాతీయ ఫ్లోరైడ్‌ పరిశోధన సంస్థ(ఐఎస్‌ఎఫ్‌ఆర్‌) నివేదిక వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇంకా ఎక్కువ ఉందని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) తేల్చింది. అక్కడి నీరు, ఆహారం ద్వారా ఒక మనిషిలో గరిష్ఠంగా మూడు మి.గ్రా. ఉండాల్సిన ఫ్లోరైడ్‌ అధికస్థాయికి చేరి- శరీరానికి పోషకాలు అందకుండా చేస్తోంది. దీంతో దేశంలో ఎనిమిదేళ్లలోపు పిల్లలు 60లక్షల మంది ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నారు. మహిళలు రక్తహీనత ఎదుర్కొంటున్నారు. 40 ఏళ్లు వచ్చేసరికి ఎముకలు గుల్లబారి నడవలేకపోతున్నారు. జాతీయ పరిశోధన మండలి-2006 నివేదిక ప్రకారం ఫ్లోరైడ్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా మెదడుతోపాటు అన్ని భాగాల సామర్థ్యం తగ్గిస్తోంది.

దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో..

దేశంలో 17 రాష్ట్రాల్లో, 22 జిల్లాల్లో 5,485 ఆవాసాల్లోనే ప్రస్తుతం ఫ్లోరైడ్‌ సమస్య ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇందులో 83శాతం గ్రామాలు రాజస్థాన్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, పంజాబ్‌లలోనే ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో ఫ్లోరిన్‌ ప్రభావిత ఆవాసాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ‘2015 ఏప్రిల్‌ నుంచి 2020 ఆగస్టు వరకు మా రాష్ట్రంలో ఒక్క ఫ్లోరోసిస్‌ కేసూ బయటపడలేదు’ అని గుజరాత్‌, తెలంగాణ, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు ఇటీవల చాటుకున్నాయి. 2015లో ఇలాగే చెప్పుకొన్న తమిళనాడు ఇప్పుడు 236 ప్రభావిత ఆవాసాలు ఉన్నాయంటోంది. ఝార్ఖండ్‌లోనూ 2015లో 10 ప్రభావిత గ్రామాలుంటే... ఇప్పుడు వాటి సంఖ్య 81కి పెరిగింది. జమ్మూకశ్మీర్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌లలోనూ 2015తో పోలిస్తే ప్రస్తుతం ప్రభావిత ఆవాసాలు పెరిగాయి.

అల్యూమినియం ఫ్లోరైడ్​ మిశ్రమధాతువులతో..

తెలంగాణలో ఎన్‌ఐఎన్‌, రాజస్థాన్‌లో యునిసెఫ్‌ చేసిన ప్రయోగాలు సురక్షిత నీరు, మంచి ఆహారం ఫ్లోరోసిస్‌కు విరుగుడని నిరూపించాయి. ఇప్పటికీ ప్రభుత్వాలు పౌష్టికాహారం అందరికీ అందించలేకపోతున్నాయని ఇటీవల వెలువడిన ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) గణాంకాలే చెబుతున్నాయి. పౌష్టికాహారం అందక పిల్లలు, మహిళలు అత్యంత బలహీనంగా ఉంటున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పోషకాహార కిట్లు అందజేస్తున్నా- వాటిలో నాణ్యత ఉండటం లేదు. క్షేత్రస్థాయిలో 16 విభాగాలు సమన్వయంతో చేయాల్సిన ఈ పని క్రమంగా ప్రైవేటు ఏజెన్సీల చేతుల్లోకి వెళ్తోంది. ఆ సంస్థలకు సమయానికి ప్రభుత్వాల నుంచి సకాలంలో బిల్లులు రాక పోషకాలు సమకూర్చడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో అల్యూమినియం పాత్రల్లో ఆహారం వండటం వల్ల అందులో అల్యూమినియం ఫ్లోరైడ్‌ మిశ్రమధాతువులు ఏర్పడి, అవి నరాల సంబంధిత సమస్యలకు దారితీస్తున్నాయని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ సైన్సెస్‌ వెల్లడించింది.

'మిషన్​ భగీరథ' పథకంతో..

తాగునీటిని నదుల నుంచి సరఫరా చేస్తే సమస్య 63శాతం మేర తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వాలు 80వ దశకం నుంచి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. దేశంలో 585 గ్రామాల్లో రూ.436 కోట్లతో నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసినా నిర్వహణ సరిగ్గా లేక, విద్యుత్తు బిల్లుల భారంతో చాలా వరకు మూతపడుతున్నాయి. 2024 నాటికి ప్రతి గ్రామంలో ఇంటింటికీ రక్షిత నీరివ్వాలనే జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ పిలుపును అందిపుచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం 'మిషన్‌ భగీరథ' పథకం తీసుకొచ్చింది. లక్షిత ప్రాంతాలకు గోదావరి, కృష్ణా నీరు ఇస్తోంది. సరఫరాకు తగినన్ని కొత్త పైపులైన్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు స్థానికంగా దొరికే శుద్ధజలానికే మొగ్గుచూపుతున్నారు. నదుల నీటిని వాడుకునేందుకు వీలుకాని చోట వర్షపు నీటిని వాడుకునే విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సి ఉంది. పటిక, సున్నంతో చౌకగా నీటిని శుద్ధి చేసే ‘నల్గొండ టెక్నిక్‌’ను ప్రజలకు నేర్పాలి. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కింద రక్తహీనతను దూరం చేసే ఆహారం ఇవ్వాలి. రేషన్‌ కింద పోషకాహారం, ఏఎన్‌ఎంలతో విటమిన్‌ మాత్రలు పంపిణీ చేయాలి. ఈ ప్రయత్నాలు చేస్తూనే శాశ్వత పరిష్కారంగా ఇంటింటికీ సురక్షిత నీరు ఇస్తే దేశం ఫ్లోరోసిస్‌ బారినుంచి బయటపడగలదు!

- బండపల్లి స్టాలిన్‌, రచయిత

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.