ETV Bharat / opinion

'ఈ చిన్నారి నాకు నువ్విచ్చిన అపూర్వ బహుమతి'

author img

By

Published : Oct 11, 2020, 7:56 AM IST

వినాయక వ్రతకథలో పార్వతి తన ఒంటిమీది నలుగును పోగేసి నలుసుగా చేసి ప్రాణం పోసినట్లు- స్త్రీ తన భర్తమీద గల గాఢానురాగాన్ని ముద్ద చేసి తన కడుపులో శిశువుగా రూపాన్నిస్తుంది. భర్త గుణగణాలు, రూపురేఖలు సైతం తన బిడ్డలో అందగించాలనుకొంటుంది. బ్రహ్మ చేసే పనికి అమ్మ సాయపడుతోందని దాని అర్థం.

eenadu sunday editorial about the level of mother love
'ఈ చిన్నారి నాకు నువ్విచ్చిన అపూర్వమైన బహుమతి'

అమ్మంటే ఆడజన్మకు సఫలత, పరిపూర్ణత. మగువలకు మాతృత్వం మరుపురాని మధురానుభూతి. సంతానం అంటే సంసార వృక్షానికి కాసే పండు, దాంపత్య జీవితానికి అదే సాఫల్యం... 'పుడమి సంసార భూరుహంబునకు పండు, ప్రకట దాంపత్య ధర్మమునకు ఫలంబు' అన్నాడు నయనోల్లాస కావ్యకర్త. ఆ ఫలాన్నే 'తల్లిదండ్రుల తనూవల్లరీద్వయికి వన్నియబెట్టు తొమ్మిది నెలల పంట'గా అభివర్ణించారు జాషువా. గర్భం దాల్చగానే స్త్రీ శరీరం 'మహిమోపేతం' అవుతుందంది భాగవతం.

సముద్రమంత ఆనందం..

వామనుడు కడుపులో ఉండగా అదితి దేహంలో వచ్చిన మార్పులను మహత్తరంగా వర్ణించింది. కౌను అంటే నడుము. 'పెన్నిధి గాంచిన పేద చందంబున పొలతుక నీ కౌను పొదలు కొనియె(పెద్దదయింది)' అని చమత్కరించాడు- నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన. గర్భవతులకు నోటినుంచి నురుగులా వచ్చే ఉమ్మిని 'చిట్టుములు' అన్నాడు అల్లసాని పెద్దన. వరూధినికి తాను గర్భవతిని అయ్యానని సముద్రమంత ఆనందం కలిగిందట. కోరికలు కెరటాల్లా లేచాయట. వాటి నురుగులే చిట్టుములు... 'సముద్యత్‌ పాండు డిండీర పంక్తులు నాన్‌ చిరు ఉములు తరుచై ఉల్లసిల్లెన్‌' అని వివరించాడు.

గండుతుమ్మెదల మెరుపు అది..

చనుమొనలు నలుపుగా మారడం గర్భవతులకు సహజం. 'అది నలుపు కాదు, పూలగుత్తులపై వాలిన గండుతుమ్మెదల మెరుపు... కుచ స్తబక ద్వయంబునన్‌ వ్రాలిన గండు తేటులన వర్తిలు చూచుక మేచక ప్రభల్‌' అన్నాడు రామాభ్యుదయంలో అయ్యలరాజు రామభద్రుడు. ఆ పూలగుత్తులే- పసికూనల ఆకలి తీర్చే పాలదుత్తలు. పుట్టబోయే బిడ్డకోసం వాటిలో ఆహారాన్ని సిద్ధం చేసే చాతుర్యం అమ్మదనానికి సొంతం. పోతన చెప్పిన మహిమోపేతమనే మాటకు అదీ అర్థం!

అంతర్గత మహేంద్రజాలం మరొకటి..

కవుల వర్ణనలన్నీ ప్రకృతి పరంగా శరీరాకృతిలో వచ్చే మార్పుల అద్భుత చిత్రణలు. 'ప్రాణికిన్‌ ప్రాకృతమైన మార్పులు అలవాటయిపోవును అదెంత మేలొకో' అనిపించే బాహ్య పరిణామాలవి. ఆంతర్గత మహేంద్రజాలం మరొకటుంది. అమ్మతనంలోని గొప్పదనమంతా- 'ఆత్మావైపుత్ర నామాసి... నేనే బిడ్డగా జన్మిస్తున్నాను' అని వేదమంత్రాల్లో భర్త చేసే ప్రతిజ్ఞకు ఆధార భూమికను సిద్ధం చేయడంలో ఉంది.

అదీ అమ్మ స్థాయి..

వినాయక వ్రతకథలో పార్వతి తన ఒంటిమీది నలుగును పోగేసి నలుసుగా చేసి ప్రాణం పోసినట్లు- స్త్రీ తన భర్తమీద గల గాఢానురాగాన్ని ముద్ద చేసి తన కడుపులో శిశువుగా రూపాన్నిస్తుంది. భర్త గుణగణాలు, రూపురేఖలు సైతం తన బిడ్డలో అందగించాలనుకొంటుంది. బ్రహ్మ చేసే పనికి అమ్మ సాయపడుతోందని దాని అర్థం. అదీ అమ్మ స్థాయి... 'అమ్మతనం తనకుందని అవని పొంగిపోతుంది. అమ్మను కాలేనే అని ఆకాశం కుములుతుంది...' అన్నారందుకే సినారె.

'నువ్వు బయట లేకున్నా నాలో ఉన్నావు'

కన్నడ నటి మేఘనారాజ్‌ సీమంతం చిత్రం చూసి నెటిజనులు కంటతడి పెడుతున్నారంటే- అమ్మకు, ప్రాణి జన్మకు గల అపురూపమైన పేగుబంధాన్ని ఆ చిత్రం ఆవిష్కరించింది కాబట్టే! ఆమె భర్త, నటుడు చిరంజీవి సర్జా చిన్న వయసులో మొన్న జూన్‌7న గుండెపోటుతో కన్నుమూశాడు. మేఘన నిండు గర్భిణి. సీమంతం రోజున భర్త నిలువెత్తు కటౌటును ఆనుకొని, తన కడుపులోని బిడ్డను నిమురుతున్న ఛాయాచిత్రాన్ని ఆమె సామాజిక మాధ్యమంలో ఉంచింది. 'ఈ చిన్నారి నాకు నువ్విచ్చిన అపూర్వమైన బహుమతి' అని రాసింది. 'నువ్వు బయట లేకున్నా నాలో ఉన్నావు' అని ఆ మాటకు అర్థం. 'క్రొత్త గోదావరి'లో కవి బేతవోలు 'ఒకమారు ఈవు దురింత దుఃఖముగ, మరియొక్క వేళ ఘన యోగీంద్ర అంతరంగమ్ము వోలిక కన్పింతువు తల్లిరో!' అన్న మాటల్లోని ఆర్ద్రభావన ఆ చిత్రంలో కనిపించి జనం గుండె చెమరుస్తోంది!

ఇదీ చూడండి:ఆడబిడ్డల పట్ల దుర్విచక్షణ ఏనాటికైనా అంతమయ్యేనా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.