ETV Bharat / lifestyle

సమ్మర్​ స్పెషల్​: ఈ మామిడి వంటకాలు తింటే వదలరు !

author img

By

Published : Apr 9, 2021, 5:48 PM IST

కాలాన్ని బట్టి మన జీవక్రియలో కొన్ని ప్రతికూల మార్పులొస్తుంటాయి. వాటిని నియంత్రించి.. మన శరీరాన్ని సమతూకంలో ఉంచేవే సీజనల్ పండ్లు. అందుకే దొరికినంత కాలం వరకు వీటిని అధికంగా తినాలంటారు ఆరోగ్య నిపుణులు. ఇక ఈ సీజనల్ పండ్లలో రారాజు మామిడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటు రుచిపరంగా.. ఇటు ఆరోగ్యపరంగా అందరూ కలిసి సూపర్ అనే పండు ఇదొక్కటే. మరి దీనిని అధికంగా తినాలంటే ఎన్ని రకాలుగా వండుకోవచ్చో చూద్దాం రండి..!

mango recipes in telugu
mango recipes in telugu

మ్యాంగో చుండా (లేక) ఆమ్ చుండా !

mangorecipesgh650-5.jpg
మ్యాంగో చుండా


గుజరాత్ రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఉండే 'సైడ్ డిష్' ఇది. కొంచెం తీపి, పులుపు, ఇంకా కారం కలగలిసిన ఈ వంటకం నోరూరించే రుచినిస్తుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం !
కావాల్సినవి :
పచ్చి మామిడి తరుగు : రెండు కప్పులు (అసలు పండకూడదు)
పసుపు : అర టీ స్పూన్
ఉప్పు : రెండు టీ స్పూన్లు
చక్కెర : రెండున్నర నుండి మూడు కప్పులు
కారం : రెండు టేబుల్ స్పూన్లు
వేయించిన జీలకర్ర పొడి : ఒక టీ స్పూన్
ముందుగా :
* మామిడి కాయని శుభ్రంగా కడిగి తొక్కు తీయాలి.
* తరుగు చిన్నగా కాకుండా పెద్దగా వచ్చేలా తురుముకోవాలి.
* తర్వాత అంచనా కోసం ఈ తరుగుని రెండు కప్పులకు వచ్చే విధంగా ఒత్తి పెట్టుకోవాలి.
తయారు చేసే విధానం !
* తురిమిన మామిడిని వండే గిన్నెలోకి తీసుకుని పసుపు, ఉప్పు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని పావుగంట నుండి ఇరవై నిమిషాల పాటు మూతపెట్టి ఉంచుకోవాలి.
* ఇరవై నిమిషాల తర్వాత తురుము మెత్తబడుతుంది. అప్పుడు రెండు టేబుల్ స్పూన్ల చక్కెర కలుపుకుని గరిటతో చక్కెర కరిగేలా బాగా తిప్పాలి. తర్వాత మళ్లీ రెండు స్పూన్ల చక్కెర కలిపి మొత్తం కరిగే వరకు కలుపుతూనే ఉండాలి.
* ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న మంట మీద గిన్నెని ఉంచి, మిగిలిన చక్కెర ఏమైనా ఉంటే కరిగే వరకు తిప్పాలి. ఈ సమయంలో నోరూరించే పాకం గిన్నెలో కనిపిస్తుంది.
* కొంత సమయానికి పాకం ముదిరి బుడగలు రావడం మొదలవుతుంది. అప్పుడు స్టవ్ కట్టేసి గిన్నె దించుకోవాలి.
* మిశ్రమం మొత్తం చల్లబడ్డాక కారం, జీలకర్ర పొడి చల్లుకుని బాగా కలపాలి. ఇప్పుడు మీకు కావల్సిన మ్యాంగో చుండా సిద్ధంగా ఉన్నట్లే. దీనిని పొడి గ్లాస్ జార్‌లో పెట్టుకుంటే పరోటా, కిచిడీ వంటి ఏ వంటకంలోనైనా చట్నీలా నంచుకుని తినొచ్చు.

మంగై రసం !

దక్షిణాది రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందిన వంటకం ఈ మంగై రసం. దీనినే 'రా మ్యాంగో రసం' అంటారు. మంచి రుచి, సువాసన కలిగిన ఈ రసాన్ని తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు.
తయారీ : ఇద్దరి కోసం
కావాల్సినవి :
టమాటాలు : 20 గ్రాములు
కందిపప్పు : 5 గ్రా
పచ్చి మామిడి : 50 గ్రా.
ఉప్పు : 2 గ్రా.
కరివేపాకు : 15 గ్రా.
ఎండుమిర్చి : 1
నల్ల మిరియాలు : 1 గ్రా.
ధనియాలు : 1 గ్రా.
జీలకర్ర : 1 గ్రా.
అల్లం : 2 గ్రా.
వెల్లుల్లి : 2 గ్రా.
ఆవాలు : 1 గ్రా.
పసుపు : 1 టేబుల్ స్పూన్.
నూనె : 1 టేబుల్ స్పూన్.
తయారీ విధానం :
* ముందుగా మిరియాలు, ధనియాలు, జీలకర్రని వేయించుకుని పొడి చేసుకోవాలి. ఇదే రసం పౌడర్.
* తర్వాత పచ్చిమామిడిని నీటిలో బాగా ఉడికించి గుజ్జుని పిండుకోవాలి.
* మరోవైపు కందిపప్పుని ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
* ఈలోపు టమాటా ముక్కలకి అల్లం, వెల్లుల్లి ఇంకా రసం పౌడర్ కలుపుకుని బాగా ఉడికించాలి. తర్వాత దాన్ని వడకట్టి మామిడి గుజ్జుని, ఉడికించిన కందిపప్పుని కలుపుకోవాలి.
* ఇప్పుడు మూకుట్లో నూనె పోసుకుని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి కలుపుకోవాలి. దీనిని టమాటా, మామిడి గుజ్జు రసంలో వేసి సరిపోయినంత ఉప్పు కలుపుకుంటే మంగై రసం సిద్ధం.

కార్న్ అండ్ రా మ్యాంగో సలాడ్ !

mangorecipesgh650-3.jpg
కార్న్ అండ్ రా మ్యాంగో సలాడ్ !

ఇప్పటి వరకు ఎన్నో సలాడ్స్ చూసుంటారు. అయితే వాటిలో దీని ప్రత్యేకతే వేరు. కొంచెం పుల్లగా, కొంచెం తీయగా ఉంటూ కరకరమనే ఈ సలాడ్ ఎలా ఉంటుందో చెప్పేకంటే తిని చూడాల్సిందే. మరింకెందుకు ఆలస్యం... ఎలా చేయాలో చూద్దాం రండి !
తయారీ : ఇద్దరికి
కావాల్సినవి :
మొక్కజొన్న గింజలు : 1 కప్పు
ఉల్లిపాయలు : 1 టేబుల్ స్పూన్
ఉల్లి ఆకుల తురుము : 3 టేబుల్ స్పూన్లు
ఎర్ర క్యాప్సికం : సగం
పచ్చి మామిడి (తరిగిన) : 1 టేబుల్ స్పూన్
ఆకు కూర కొమ్మ (ఏదైనా) : అర టేబుల్ స్పూన్
చెర్రీలు : ఆరు
పైనాపిల్ ముక్కలు : ఒక టేబుల్‌స్పూన్
కొత్తిమీర : 1 టేబుల్ స్పూన్
తులసి ఆకులు : 4
నల్లటి ఆలివ్ పండ్లు : 7-8
నిమ్మరసం : 2 టేబుల్ స్పూన్లు
ఆలివ్ ఆయిల్ : 1 టేబుల్ స్పూన్
తెల్ల మిరియాల పొడి : అర టేబుల్ స్పూన్
టాకో షెల్స్ (మెక్సికన్ చిప్స్) : 3-4
తయారీ విధానం :
* ముందుగా మొక్కజొన్న గింజలను ఉప్పు నీటిలో లేత రంగు వచ్చేలా ఉడకబెట్టాలి (మరీ ఎక్కువగా ఉడకబెట్టకూడదు)
* తర్వాత వాటిని వేరే గిన్నెలో వేసి చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
* ఇప్పుడు ఉల్లిపాయల్ని, ఉల్లి ఆకులని, ఎరుపు క్యాప్సికంని, పచ్చి మామిడిని, పైనాపిల్‌ని, ఆకుకూరని ఒకే సైజ్‌లో కట్ చేసి పెట్టుకోవాలి.
* తర్వాత చెర్రీ ఫ్రూట్స్‌ని సగానికి కట్ చేసుకుని కొత్తిమీర, తులసి ఆకులని జతచేసుకోవాలి.
* రుచి కోసం కొద్దిగా ఉప్పు, మిరియాల పొడిని చల్లుకోవాలి.
* చివరగా నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకుంటే కార్న్ అండ్ రా మ్యాంగో సలాడ్ తయారైనట్లే
* దీనిని టాకో షెల్స్‌తో జత కలుపుకుని సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది.

మ్యాంగో అండ్ మింట్ ఖీర్ !

mangorecipesgh650-4.jpg
మ్యాంగో అండ్ మింట్ ఖీర్ !

పండగలకి, ప్రత్యేక రోజులకి ఇంట్లో ఎక్కువగా చేసే పాయసం రెండే రకాలు. ఒకటి చక్కెర పొంగలైతే రెండోది సేమియా పాయసం. ఈ వేసవికి ఈ రెండూ మానేసి చక్కగా ఈ మ్యాంగో అండ్ మింట్ ఖీర్‌తో డిఫరెంట్ టేస్ట్‌ని పొందండి ! మరి దీనిని ఎలా చేయాలో చూద్దాం రండి !
ఎంతమందికి : 6
కావాల్సినవి :
పాలు : రెండున్నర కప్పులు
బాస్మతి రైస్ : 1 కప్పు
చక్కెర : 3 టేబుల్ స్పూన్లు
కుంకుమ పువ్వు : చిటికెడు
మామిడి గుజ్జు : 1 కప్పు
బాదం పప్పు : 7-8 (తరిగినవి)
ఎండు ద్రాక్ష : 10-15
పుదీనా ఆకులు : 6-7
యాలకులు : 3-4
లవంగాలు : 2-3
తయారు చేసే విధానం :
* మూకుట్లో పాలు, బాస్మతి రైస్, చక్కెర వేసుకుని కలుపుకోవాలి.
* కొన్ని నిమిషాలకి కుంకుమ పువ్వు పొడిని కలుపుకుని బాగా తిప్పాలి.
* మొత్తం ఉడికిన తర్వాత మామిడి గుజ్జుని కలుపుకుని బాదం తరుగు, ఎండు ద్రాక్ష, ఇంకా పుదీనా అకులను చల్లుకోవాలి.
* చివరిసారిగా మిశ్రమాన్ని బాగా కలిపి మూతపెట్టుకోవాలి.
* బాస్మతి రైస్ బాగా ఉడికి, ముదురు పాకం వచ్చే వరకు మంటని చిన్నగా పెట్టుకోవాలి.
* చివరగా యాలకులను కలిపి ఒక బౌల్‌లో వేసుకుని బాదం పప్పుని పైన చల్లుకోవాలి.
* ఇక దీనిని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే మ్యాంగో అండ్ మింట్ ఖీర్ రడీ!

మ్యాంగో రైస్ !

mangorecipesgh650-1.jpg
మ్యాంగో రైస్ !

ఎప్పుడూ చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర ఏం తింటారు చెప్పండి ! వేసవిలోని ప్రత్యేకమైన రోజులకి ఈ థాయ్‌ల్యాండ్ వంటకాన్ని ప్రయత్నించండి ! ఇంకెందుకు ఆలస్యం ! తయారు చేయడానికి సిద్ధమైపోండి !
ఎంతమందికి : 1
కావాల్సినవి :
ఉడికించిన అన్నం : 1 కప్పు
పచ్చి మామిడి తురుము : అర కప్పు
ఆవాలు : అర టేబుల్ స్పూను
మినపప్పు : అర టేబుల్ స్పూను
శనగపప్పు : అర టేబుల్ స్పూను
పల్లీలు : 1 టేబుల్ స్పూను
పచ్చిమిర్చి : 2
కరివేపాకు : ఒక రెబ్బ
పసుపు : పావు టేబుల్ స్పూను
నువ్వుల నూనె : 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం :
* ముందుగా పచ్చి మామిడికాయని తురిమి ఉంచుకోవాలి.
* అన్నాన్ని ఉడికించి చల్లబర్చుకోవాలి.
* ఇప్పుడు మూకుట్లో నువ్వుల నూనె వేసుకుని ఆవాలను వేయించుకోవాలి. తర్వాత మినపప్పు, శనగ పప్పు ఇంకా పచ్చిమిర్చిని వేసి కలుపుకోవాలి. చివరగా కరివేపాకు, ఇంగువ, ఇంకా పసుపు వేసి తాలింపుని వేగనివ్వాలి.
* తర్వాత తురిమిన మామిడిని, అన్నాన్ని మూకుట్లో వేసి తగినంత ఉప్పు చల్లుకొని బాగా తిప్పాలి. ఇప్పుడు మ్యాంగో రైస్ సిద్ధంగా ఉన్నట్లే. ఏవైనా చిప్స్‌తో పుష్టిగా ఆరగించడమే తరువాయి.

మ్యాంగో ఐస్‌క్రీమ్ !

mangorecipesgh650.jpg
మ్యాంగో ఐస్‌క్రీమ్ !

వేసవిలో అందరికీ ఇష్టమైనవి ఐస్‌క్రీమ్, మామిడి పండు. ఈ రెంటినీ కలిపి ఇంట్లోనే మ్యాంగో ఐస్‌క్రీమ్‌ని చేసుకుంటే ఆ తృప్తే వేరు. దీనికి ఐస్‌క్రీమ్ మేకర్‌తో పనిలేదు, ఎక్కువ సమయం అంతకన్నా అవసరం లేదు. ఎలా చేయాలో చూసేయండి !
ఎంతమందికి : 2
కావాల్సినవి :
పాలు : 1 కప్పు
క్రీమ్ : 3 కప్పులు
మామిడి గుజ్జు : 1 కప్పు
మామిడి తురుము : 1 కప్పు
కస్టర్డ్ పౌడర్ : 1 టేబుల్ స్పూన్
(కస్టర్డ్ పౌడర్ అంటే పాలు, గుడ్లు, పంచదార, ధాన్యం పిండితో చేసిన తీపి పదార్థం)
వెనీలా : 1 టేబుల్ స్పూను
చక్కెర : 360 గ్రా (ఒక కప్పు)
తయారు చేసే విధానం :
* పావు కప్పు పాలలో కస్టర్డ్ పౌడర్ కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
* మిగిలిన పాలకి చక్కెర కలిపి కరిగే వరకు మరగనివ్వాలి.
* ఈ సమయంలోనే ముందుగా కలుపుకున్న పాలు, కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని పాలలో వేసి చిన్న మంట మీద ఒక అర నిమిషం పాటు ఉంచి స్టౌ ఆఫ్ చేయాలి.
* ఇప్పుడు మామిడి గుజ్జు, మామిడి తురుము, క్రీమ్, వెనీలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మొత్తం మిశ్రమాన్ని గాలి పోని డబ్బాలో వేసుకుని మూతపెట్టుకోవాలి.
* దీనిని డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే మ్యాంగో ఐస్‌క్రీమ్ రెడీ.

ఇదీ చూడండి: సమ్మర్ స్పెషల్: మ్యాంగో చికెన్‌ కూర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.