IIIT Hyderabad Innovation : దేశంలో తొలిసారిగా సెల్‌ఫోను సాయంతో గొంతు క్యాన్సర్‌ను ప్రాథమికంగా నిర్ధారించే సరికొత్త సాంకేతికతను హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీ అభివృద్ధి చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రాథమిక ఫలితాలు సంతృప్తికరంగా రావడంతో పూర్తిస్థాయిలో మెరుగుపరిచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందుకోసం వర్సిటీ, గ్రేస్ క్యాన్సర్, బెంగళూరుకు చెందిన బయోకాన్ ఫౌండేషన్ జతకట్టాయి.
కృత్రిమ మేధ ఆధారం..
Throat Cancer Diagnosis with Mobile Phone : ప్రాజెక్టులో భాగంగా భాగస్వాముల సహకారంతో వర్సిటీలోని ఐహబ్ డాటా సెంటర్ ప్రొడక్టు ల్యాబ్ సాయంతో ప్రత్యేకంగా ‘ట్రిపుల్‌ఐటీహెచ్-హెచ్‌సీపీ’ యాప్ తయారు చేసింది. ఇందులో గతంలో నిర్ధరణ అయిన చిత్రాలను పొందుపరిచారు. వాటి సాయంతో కృత్రిమమేధ ఆధారంగా రోగి గొంతు చిత్రాలను విశ్లేషించి నివేదిక రూపొందించి క్యాన్సర్ ఉందో.. లేదో యాప్ తెలియజేస్తుంది. ఇందుకోసం తొలుత గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సేకరించిన నమూనాలు, ఎక్స్‌రే చిత్రాలను విశ్లేషించారు. అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తయారు చేసిన ప్రాథమిక మోడల్‌ను పరిశీలించారు.
బీజం పడింది ఇలా
Technology to diagnose throat cancer : గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గ్రామీణులకు ప్రత్యేక మొబైల్ వాహనం సాయంతో గ్రామాల్లో స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తుంటారు. గొంతు, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల పరీక్షలు చేస్తుంటారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామానికి అంకాలజిస్టులను పంపించి గొంతు చిత్రాలు, ఎక్స్ రే పరీక్ష ఫలితాలు పరిశీలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంకాలజిస్టుల కొరతతో నిర్ధరణకు వీలవడం లేదని సీఈవో, డైరెక్టర్ డాక్టర్ సుంకవల్లి చిన్నబాబు తెలిపారు. దీన్ని అధిగమించేందుకు కృత్రిమ మేధ ఆధారిత పరిష్కార మార్గాలు కనుగొనేందుకు ట్రిపుల్ ఐటీలోని ఐహబ్ డాటా సెంటర్‌తో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ గతంలో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం గతేడాది నవంబరు నుంచి ఐహబ్-డాటా సెంటర్ క్యాన్సర్ ప్రాజెక్టు పర్యవేక్షకులు డాక్టర్ వినోద్ పీకే ఆధ్వర్యంలో సరికొత్త సాంకేతికత అభివృద్ధిపై కసరత్తు ప్రారంభించి ముందడుగు వేశారు.
మరికొన్ని క్యాన్సర్లు కూడా..
IIIT Hyderabad Innovation on Cancer Diagnose : తాము తయారు చేసిన యాప్ మంచి ఫలితాలు ఇస్తోందని, మరింత సమర్థంగా పనిచేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న డాక్టర్ వినోద్ పీకే వివరించారు. ‘‘గొంతు చిత్రాలతోపాటు రోగి జీవనశైలి, కుటుంబ చరిత్ర, ఆరోగ్య చరిత్ర, రక్త పరీక్ష ఫలితాలు యాప్‌లో పొందుపరచనున్నాం. కేవలం గొంతు క్యాన్సరే కాకుండా మరికొన్ని రకాల క్యాన్సర్లను గుర్తించేలా తయారు చేయాలనుకుంటున్నాం’’ అని ఐహబ్ డాటా సెంటర్ హెల్త్‌కేర్ లీడ్ బాపిరాజు వివరించారు.