ETV Bharat / international

Canada India Dispute : నాడు తండ్రి.. నేడు కుమారుడు.. ఖలిస్థానీలకు అనుకూలం.. భారత్​తో ఘర్షణ.. ఎందుకిలా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 10:15 AM IST

Canada India Dispute : ప్రస్తుత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు భారత్​-కెనడా మధ్య వైరాన్ని మరింత పెంచుతున్నాయి. అంతకుముందు జస్టిన్​ ట్రూడో తండ్రి పిరె ఇలియట్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో ఇలాంటి వైఖరినే ప్రదర్శించారు. మరి తండ్రీకొడుకులు భారత్ పట్ల ఏందుకు ఇలాంటి వైఖరిని అవలంభిస్తున్నారో? ఖలిస్థాన్ ఉగ్రవాదులకు ఎందుకు అండగా నిలుస్తున్నారో తెలుసుకుందామా?

Canada India Dispute
Canada India Dispute

Canada India Dispute : కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలు, తీసుకుంటున్న చర్యలతో భారత్‌, కెనడా మధ్య సంబంధాలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి. జస్టిన్ ట్రూడో తండ్రి పిరె ఇలియట్‌ ట్రూడో కూడా భారత్‌ పట్ల ఇలాంటి ఘర్షణ వైఖరినే ప్రదర్శించారు. ప్రధాని హోదాలో ఆయన కూడా ఖలిస్థాన్‌ ఉగ్రవాదులకు ఊతమిచ్చారు. 300 మందికిపైగా భారతీయ ప్రయాణికులతో కూడిన విమానాన్ని గాల్లోనే ఉగ్రవాదులు పేల్చడానికి పరోక్షంగా కారణమయ్యారు.

హెచ్చరికలను పట్టించుకోలేదు..
1985 జూన్‌ 23న కెనడాలోని టొరంటో నుంచి 329 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం 'కనిష్క'ను ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు సూట్‌కేసు బాంబులతో గాల్లోనే పేల్చేశారు. కెనడాలో తలదాచుకున్న ఖలిస్థాన్‌ ఉగ్రవాది, బబ్బర్‌ ఖల్సా సభ్యుడు తల్వీందర్‌ సింగ్‌ పర్మార్‌ దీనికి ప్రధాన సూత్రధారి. అతడిని అప్పగించాలన్న భారత్​ అభ్యర్థనను అప్పటి కెనడా ప్రధాని పిరె ట్రూడో తోసిపుచ్చారు. నిజానికి కనిష్క పేలుడుకు కారణమైన పర్మార్‌ సహా ఇతరులనూ కెనడా ప్రభుత్వం అరెస్టు చేసింది. ఒక్కరికి (ఇందర్‌జిత్‌ సింగ్‌) మాత్రమే 15 ఏళ్ల జైలుశిక్ష విధించి.. మిగతావారిని విడిచిపెట్టింది. ఉగ్రవాదులు విమాన దాడులకు పాల్పడే అవకాశం ఉందని 20 రోజుల ముందే భారత నిఘా వర్గాలు కెనడాకు సూచించాయి. సరైన భద్రత చర్యలు తీసుకోవాలని కోరాయి. పిరె ప్రభుత్వం వాటన్నింటినీ పెడచెవినపెట్టింది.

Canada India Dispute
కెనడా మాజీ ప్రధాని పిరె ఇలియట్‌ ట్రూడో

వాంకోవర్‌లో ఉగ్రవాదులు బాంబులు తయారు చేస్తున్నారనే సమాచారం ఉన్నా కూడా చూసీ చూడనట్లు వ్యవహరించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తర్వాత లభించిన కొన్ని కీలక ఆధారాలను సైతం కెనడా అధికారులు దాచేశారని అంటుంటారు. పిరె ట్రూడో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కనిష్క పేల్చివేత సంభవించిందని చెబుతారు. ఆ ఘటనపై విచారణ జరిపిన జస్టిస్‌ జాన్‌ మేజర్‌ కమిషన్‌ కూడా కెనడా నిఘా విభాగాన్ని, పోలీసులను, అధికారులను తీవ్రంగా తప్పుబట్టింది. అంతేగాకుండా విచారణకు అడ్డుతగిలినట్లు ఆరోపణలు చేసింది. ఈ ప్రమాదం గురించి కెనడా అధికారులకు ముందే తెలుసని వ్యాఖ్యానించింది.

భారత్​పై అగ్గిమీద గుగ్గిలం..
అమెరికా, కెనడాల సాయంతో భారత్‌ అణు ఇంధన కార్యక్రమాలు మొదలుపెట్టింది. శాంతియుత కార్యక్రమాలకే తమ ఒప్పందం పరిమితమని కెనడా, అమెరికా స్పష్టం చేశాయి. 1974లో పోఖ్రాన్‌లో భారత్‌ అణుపరీక్ష నిర్వహించడం వల్ల పిరె ట్రూడో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. భారత్‌కు అణు సాయం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. తమ దేశ శాస్త్రవేత్తలను వెనక్కి రప్పించారు. నిజానికి కెనడా, అమెరికాలతో భారత్‌ కుదుర్చుకున్న ఒప్పందంలో.. అణుపరీక్ష చేయకూడదనే విస్పష్ట నిబంధనేదీ లేదని తర్వాత తేలింది. అణుపరీక్ష శాంతియుతమైనదేనని, ఎవరినీ బెదిరించడానికి ఉద్దేశించింది కాదని భారత్‌ ఇచ్చిన వివరణనూ అప్పటి కెనడా ప్రధాని పిరె ట్రూడో పట్టించుకోలేదు.

Canada India Dispute
కెనడా మాజీ ప్రధాని పిరె ఇలియట్‌ ట్రూడో

స్వాతంత్ర్యానికి ముందు నుంచే పంజాబ్‌ నుంచి అనేక మంది సిక్కులు వెళ్లి కెనడాలో స్థిరపడ్డారు. 1970ల్లో కెనడా ఇమ్మిగ్రేషన్‌ చట్టాలు సులభతరం కావడం వల్ల భారత్‌ నుంచి భారీ స్థాయిలో వలసలు మొదలయ్యాయి. అదే సమయంలో పంజాబ్‌లో ఖలిస్థాన్‌వాదం పెరగటం.. వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం వల్ల ఈ ఉగ్రవాదులకు కెనడా సురక్షిత ప్రాంతమైంది. అప్పట్లో పంజాబ్‌లో ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిపి, కెనడాకు పారిపోయినవాడే తల్వీందర్‌సింగ్‌ పర్మార్‌! ఖలిస్థాన్‌ ఉగ్రవాదులకు కెనడా ఆశ్రయమివ్వటం, వారు అక్కడి నుంచి భారత్‌లో రాజకీయ నాయకులను బెదిరించటంపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అనేకసార్లు పిరె ట్రూడోతో ప్రస్తావించారని, ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదని.. ఖలిస్థాన్‌వాదంపై పుస్తకం రాసిన కెనడా సీనియర్‌ పాత్రికేయుడు టెరీ మిలెవ్‌స్కీ వెల్లడించారు.

పర్మార్‌ను తమకు అప్పగించాలని 1982లోనే కెనడా ప్రభుత్వానికి భారత్‌ విజ్ఞప్తి చేసింది. పిరె ట్రూడో ప్రభుత్వం అందుకు నిరాకరించింది. అందుకు కెనడా అధికారులు చూపిన సాకు.. ఎలిజబెత్‌ రాణి హోదా! భారత్‌ ఎలిజబెత్‌ రాణిని కామన్వెల్త్‌ అధినేతగానే గుర్తిస్తోంది తప్ప.. తమ దేశ అధినేతగా గుర్తించటం లేదు. కాబట్టి.. కామన్వెల్త్‌ దేశాలకు వర్తించే నేరగాళ్ల అప్పగింత ఒప్పందం భారత్‌, కెనడాల మధ్య వర్తించదని పిరె ట్రూడో ప్రభుత్వం భారత్‌కు తెలిపింది. ఆ తర్వాత పాకిస్థాన్‌ గుండా భారత్‌లోకి దొంగతనంగా అడుగుపెట్టిన పర్మార్‌.. 1992లో పంజాబ్‌ పోలీసుల చేతిలో హతమయ్యాడు. తన తండ్రి హయాంలో జరిగిన కనిష్క విమాన ప్రమాదం కేసులో శిక్ష పడ్డ ఏకైక నిందితుడు ఇందర్‌జీత్‌ సింగ్‌ను.. ప్రస్తుత ప్రధాని జస్టిన్‌ ట్రూడో అధికారంలోకి రాగానే 2016లో విడుదల చేశారు.

కెనడాలో మాత్రం..
భారత్‌లో వేర్పాటువాదాన్ని కోరుకునే ఖలిస్థాన్‌ ఉగ్రవాదులకు మద్దతిచ్చిన పిరె ట్రూడో.. తమ దేశంలో ఇలాంటి ప్రత్యేక క్యూబెక్‌ ఉద్యమాన్ని అణచివేశారు. ఫ్రెంచ్‌ మాట్లాడే ప్రజల రాష్ట్రమైన క్యూబెక్‌.. కెనడా నుంచి విడిపోవాలని భావించింది. సైన్యాన్ని రంగంలోకి దించి, పౌరహక్కులను రద్దు చేసి, అత్యంత దారుణంగా అణచివేశారు పిరె ట్రూడో.

Justin Trudeau On India : భారత్​పై అక్కసు.. అలా జరుగుతుందని ఊహించని ట్రూడో.. వెనక్కి తగ్గడమే శరణ్యం!

Justin Trudeaus Popularity : పడిపోయిన ట్రూడో పాపులారిటీ.. కెనడా నెక్స్ట్​​ ప్రధాని ఆయనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.