ETV Bharat / international

టీకా పంపిణీలో ఆ దేశం అగ్రస్థానం.. ఎలా సాధ్యం?

author img

By

Published : Aug 13, 2021, 4:21 AM IST

అనేక దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. అయితే ఒక దేశం మాత్రం మహమ్మారిని పక్కాప్రణాళికతో అడ్డుకుంటూ ముందుకెళ్తోంది. ప్రజారోగ్యంలో కీలక ప్రణాళికలు రూపొందిస్తూ.. ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇది ఎలా సాధ్యమైందో మీరూ తెలుసుకోండి మరి..

స్పెయిన్
స్పెయిన్

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. డెల్టా రకం వ్యాప్తి తీవ్రతతో ప్రపంచదేశాలు అల్లాడుతున్నాయి. అగ్రదేశం అమెరికాలో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. చైనాలోనూ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. కేసులు పెరగకుండా కొన్ని దేశాలు లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడంతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, చైనా, ఇజ్రాయెల్‌, బ్రిటన్‌, యూఏఈ, రష్యా, బెహ్రెయిన్‌ తదితర దేశాలతో పాటు జర్మనీ, ఇటలీ వంటి యూరోపియన్‌ దేశాల్లో కూడా ఈ ప్రక్రియ జోరందుకుంది.

ముందంజలో స్పెయిన్‌

అన్ని దేశాలతో పోలిస్తే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను పకడ్బందీగా చేస్తూ స్పెయిన్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సుమారు 47 కోట్ల స్పెయిన్‌ జనాభాలో ఇప్పటివరకు 61 శాతం మందికి వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసింది. అత్యధిక మందికి టీకాలు వేసిన మొదటి యూరోపియన్‌ యూనియన్‌ దేశంగానూ స్పెయిన్‌ నిలిచింది. ఇప్పటివరకూ ఇటలీలో 57.8 శాతం, ఫ్రాన్స్‌లో 56 శాతం, జర్మనీలో 55.2 శాతం, అమెరికాలో 50.3 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

ఎలా సాధ్యమయిందంటే..?

వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగవంతం కావాలంటే ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్న జనాభాకు తగ్గట్టు డోసులను కూడా అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. వీటన్నింటితోపాటు ముఖ్యంగా ప్రజల్లో నెలకొన్న అనవసరపు అనుమానాలను చెరిపేయాలి. వ్యాక్సిన్‌ విషయంలో వారికి విశ్వాసం కలిగించేలా అవగాహన కల్పించాలి. అదే తరహాలో స్పెయిన్‌ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థపై ప్రజల్లో మంచి విశ్వాసాన్ని నెలకొల్పింది. తద్వారా ప్రజలే స్వతహాగా వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ముందుకొచ్చారు. అందువల్లే స్పెయిన్‌లో వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారి శాతం మిగతా దేశాలకంటే ఎక్కువగా ఉంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్ తాజా అధ్యయనం ప్రకారం.. స్పెయిన్‌లో 79 శాతం మంది ప్రజలు కొవిడ్ -19 వ్యాక్సిన్‌ను విశ్వసించారని తన అధ్యయనంలో పేర్కొంది. అమెరికాలో 62 శాతం, ఫ్రాన్స్‌లో 56 శాతం, జపాన్‌లో 47 శాతం మంది మాత్రమే టీకాలను విశ్వసించారని తెలిపింది.

గతానుభవం నేర్పిన పాఠాల నుంచే..

1950 మధ్యలో తీవ్రంగా ప్రభావం చూపిన పోలియో వ్యాధికి అనేక దేశాలు వణికిపోయాయి. దీన్ని అరికట్టడానికి టీకాలు వేయడం ప్రారంభించాయి. కానీ, ఫ్రాంకో నేతృత్వంలోని అధికారులు దాదాపు ఒక దశాబ్దం పాటు టీకాలు వేయకుండా వేచి ఉన్నారు. దీంతో స్పెయిన్‌లో వేల మంది పిల్లలు పోలియో బారిన పడి వికలాంగులుగా మారారు. అనేక మరణాలు కూడా సంభవించాయి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి స్పెయిన్‌ ప్రభుత్వం గట్టి చర్యలే చేపట్టింది. వ్యాక్సిన్‌పట్ల ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.