ఆసియాపై పట్టుసాధించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంతా కాదు! భారత్, హాంగ్‌కాంగ్, తైవాన్.. ఇలా లెక్కలేనన్ని దేశాలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అదే సమయంలో అభివృద్ధి పేరుతో పాక్, బంగ్లాదేశ్ వంటి దేశాలను కలుపుకుపోతోంది. ఇలాంటి సమయంలో శత్రుదేశం అమెరికా.. అఫ్గాన్‌ను వీడటం చైనాకు ఎంతగానో కలిసివచ్చే విషయం. అఫ్గాన్‌పై పట్టుసాధిస్తే మధ్య ఆసియాను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు జిన్‌పింగ్ ప్రభుత్వానికి మార్గం సుగమం అవుతుంది. ఈ క్రమంలోనే అఫ్గాన్‌పైనా కన్నేసింది. కానీ అసలు సవాళ్లు ఇప్పుడే మొదలయ్యాయి. వాటి గురించి ఆలోచిస్తేనే చైనా బిక్కుబిక్కుమంటోంది. అఫ్గాన్.. అందని ద్రాక్షగా మిగిలిపోతుందోమోనని ఆందోళన చెందుతోంది. ఆ స్థాయిలో చైనాకు సవాళ్లు ఎదురవుతోంది.. 'తాలిబన్ల' నుంచే!
తాలిబన్లతో కష్టమే..!
అఫ్గాన్ తాలిబన్ల వశమవ్వడం ఒకరకంగా చైనాకు కలిసివచ్చే విషయమే. దేశాభివృద్ధి పేరుతో అక్కడి ఖనిజాలపై చైనా పట్టుసాధించేందుకు అవకాశముంటుంది. అందుకే.. అఫ్గాన్ ప్రగతి కోసం తాలిబన్లతో కలిసి పనిచేస్తామని ఇప్పటికే ప్రకటించింది చైనా(china taliban alliance).
అయితే ఇక్కడ ఉన్న చిక్కంతా అఫ్గాన్‌లోని అస్థిరత్వంపైనే. అమెరికా హడావుడిగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడం.. తాలిబన్లు మెరుపు వేగంతో దేశాన్ని ఆక్రమించుకోవడం.. అంతా రోజుల వ్యవధిలోనే జరిగిపోయింది. ఈ తరుణంలో ప్రస్తుత పరిస్థితుల నుంచి లబ్ధిపొందాలంటే స్థిరత్వం చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:- Afghanistan news: చైనాకు.. అనుకోని వరం ఆ రహదారి..
"అమెరికాపై నిందలు వేస్తూ.. తాము అగ్రరాజ్యం కన్నా మెరుగ్గా వ్యవహరిస్తామని అఫ్గాన్లకు చైనా కథలు చెప్పొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో సవాళ్లు చైనాకు స్వాగతం పలికే అవకాశముంది," అని లండన్ రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్లోని రఫెల్లో పాంటుచి అభిప్రాయపడ్డారు.
చైనా ప్రవర్తనలో ఇప్పటికే ఇవి కనిపించాయి. "అమెరికా అహకారంపై తాలిబన్ల విజయం" అంటూ ఆ దేశ అధికారిక మీడియా వార్తలు ప్రచురించింది.
ఉగ్రవాదం మరో అతిపెద్ద సమస్య. అన్ని దేశాల్లాగే.. తాలిబన్ల నుంచి ఎదురయ్యే ఉగ్రముప్పుపై చైనా కలవరపాటుకు గురవుతోంది. 9/11 దాడుల కోసం అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్.. అఫ్గాన్‌ను కేంద్రంగా వాడుకున్నాడు. ఆ పరిస్థితులు మరోసారి ఉత్పన్నమవ్వకూడదని చైనా భావిస్తోంది. ముఖ్యంగా తమ దేశంలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న షిన్జియాంగ్(china taliban xinjiang) ప్రాంతంపైకి తాలిబన్లు ఎగబడకుండా ఉండేందుకు.. వారితో చర్చలు జరుపుతోంది. అఫ్గాన్.. మరోమారు ఎవరికీ పావుగా మారకూడదని హితవు పలుకుతోంది. కానీ మధ్య ఆసియా, పాకిస్థాన్‌లో.. తాలిబన్ల వల్ల ఉగ్రవాదం పెరిగితే.. చైనాకు ఇంకా కష్టమవుతుంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టింది జిన్‌పింగ్ ప్రభుత్వం. భవిష్యత్తులో వాటిని అఫ్గాన్‌కు విస్తరించాలని భావించింది. కానీ తాలిబన్లు అందుకు సిద్ధంగా ఉన్నట్టు కనపడటం లేదు. అందుకే.. తాలిబన్ల పాలనలో అఫ్గాన్.. ఉగ్రవాద దేశంగా మారకూడదని ప్రార్థిస్తోంది. అదే జరిగితే.. చైనా ఆశలు ఆవిరైనట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాలిబన్లు మతాన్ని విపరీతంగా విశ్వసిస్తారు. మతం తర్వాతే ఏదైనా అన్న రీతిలో ఉంటారు. చైనాలో మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ హయాంలో నాస్తికవాదం పెరిగింది. ప్రస్తుతానికి తాలిబన్లతో చెలిమికి చైనాకు ఇవేవీ అడ్డు రావడం లేదు(china taliban connection). కానీ భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ప్రశ్నార్థకమే.
అమెరికా కన్నెర్ర చేస్తే...!
అఫ్గాన్‌లో.. అమెరికా చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్న చైనా.. క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాలన్న ఆలోచనలనే మదిలోకి రానివ్వకుండా చూసుకుంటోంది. అందుకే దేశం బయట నుంచి పావులు కదుపుతోంది. తమకు లబ్ధి చేకూరే విధంగా.. తాలిబన్ల ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకు పాక్ సహాయం(china taliban pakistan) తీసుకుంటోంది. తాలిబన్లు ఆక్రమించుకున్న కొద్ది గంటలకే.. "అఫ్గాన్ ప్రజలు బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందారు," అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
అయితే పాకిస్థాన్, చైనాకు అమెరికా నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. తాలిబన్లకు మద్దతిస్తే అగ్రరాజ్యం ఆగ్రహించే అవకాశముంది. ఇది పాక్‌కు మంచిది కాదు. అటు తాలిబన్లతో యుద్ధాన్ని ముగించుకుని వెనుదిరిగిన అమెరికా.. చైనాపై ఎక్కువ దృష్టి సారించనున్నట్టు ఇప్పటికే సంకేతాలిచ్చింది.
అఫ్గాన్ ఖనిజాలు, భౌగోళిక రాజకీయాలు ఊరిస్తున్నప్పటికీ, ఇన్ని సవాళ్లు చైనాకు అడ్డంకిలా మారుతున్నాయి. అందువల్ల ఇతర దేశాల్లాగే.. తాము కూడా అఫ్గాన్ పరిస్థితులను ప్రస్తుతానికి నిశితంగా పరిశీలిచాలని భావిస్తున్నట్టు చైనా రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:- దక్షిణాసియాపై 'డ్రాగన్' వల- భారత్ లక్ష్యంగా కొత్త కూటమి