ETV Bharat / international

అధికారం కోసం ట్రంప్‌ అంతకు తెగించారా?.. వెలుగులోకి ఆసక్తికర ఆధారం!

author img

By

Published : Jan 23, 2022, 5:32 AM IST

Trump News: అధ్యక్ష పదవిలో కొనసాగడం కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వప్రయత్నాలు చేశారట. తాజాగా ఇందుకు సంబంధించిన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ట్రంప్.. ఏకంగా ఓటింగ్‌ యంత్రాలను స్వాధీనం చేసుకోమని ఆదేశిస్తూ రక్షణశాఖ సెక్రటరీకి ఓ లేఖ రాయడానికి సిద్ధమయ్యారని తెలిసింది.

trump
ట్రంప్

Trump News: అధికారాన్ని అట్టిపెట్టుకోవడం కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏడాది క్రితం ఎంత హంగామా సృష్టించారో గుర్తుంది కదా! తాజాగా అధ్యక్ష పదవిలో కొనసాగడం కోసం ఆయన ఎంత దూరం వెళ్లారో నిరూపించే ఆసక్తికర ఆధారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఓటింగ్‌ యంత్రాలను స్వాధీనం చేసుకోమని ఆదేశిస్తూ రక్షణశాఖ సెక్రటరీకి ఓ లేఖ రాయడానికి ఆయన సిద్ధమయ్యారట. దానికి సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ, చివరకు దాన్ని అధికారికంగా జారీ చేయలేకపోయారని వెల్లడైంది.

ఎన్నికల ఫలితాల్లో ట్రంప్‌ ఓటమి ఖాయమైన తర్వాత ఆయన మద్దతుదారులు జనవరి 6న క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడికి దిగారు. దీనిపై విచారణ జరుపుతున్న హౌస్‌ కమిటీకి తాజాగా ఈ ముసాయిదా లేఖ లభ్యమైంది. అయితే, దాన్ని ఎవరు రూపొందించారన్నది మాత్రం ఇంత వరకు తెలియరాలేదు. ట్రంప్‌ విచారణ నుంచి తప్పించుకోలేరంటూ ఇటీవలే అక్కడి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తరుణంలో ఈ లేఖ బయటకు రావడం గమనార్హం.

Trump Attempted To Seize Voting Machine: అమెరికా ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా శ్వేతసౌధాన్ని అట్టిపెట్టుకోవడం కోసం ట్రంప్‌, ఆయన సన్నిహిత వర్గాలు ఎంత వరకు తెగించాయో ఈ లేఖ నిరూపిస్తోందని బైడెన్‌ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ముసాయిదా లేఖలో పేర్కొన్నట్లు రక్షణశాఖ సెక్రటరీ ఓటింగ్‌ యంత్రాలను స్వాధీనం చేసుకొని ఉంటే ఫలితాల నిర్ధారణ మరో 60 రోజులు ఆలస్యమయ్యేది. తద్వారా ఫిబ్రవరి వరకు ట్రంప్‌ అధికారంలో ఉండేందుకు అవకాశం దొరికేది. నిబంధనల ప్రకారం.. రిగ్గింగ్‌ జరిగినట్లు ఆధారాలు ఉంటే అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఫలితాలను విశ్లేషించి తుది నివేదికను సమర్పించడానికి రక్షణ శాఖకు 60 రోజుల సమయం ఉంటుంది. ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని.. ఓటింగ్‌ యంత్రాల్లో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ ట్రంప్‌ తన ఆదేశాల్ని జారీ చేయాలని విఫలయత్నం చేశారు.

ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఓటింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకోవాలన్న వాదనను అప్పటి ట్రంప్‌ బృందంలో ఉన్న న్యాయవాది సిడ్నీ పావెల్‌ బలంగా వినిపించారు. సరిగ్గా అదే సమయంలో ఈ లేఖ కూడా రాసినట్లు ఉండడంతో బహుశా ఆమే దాన్ని రూపొందించి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో అంతర్జాతీయ శక్తుల జోక్యం కూడా ఉన్నట్లు లేఖలో ఆరోపించడం గమనార్హం. ఓటింగ్‌ యంత్రాలను తయారు చేసిన 'డొమీనియన్‌ ఓటింగ్ సిస్టమ్స్‌' అనే కంపెనీని విదేశీ శక్తులు నియంత్రిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఫలితాలు బైడెన్‌కు అనుకూలంగా మార్చేందుకు ఓటింగ్‌ యంత్రాల్లో డొమీనియన్‌ మార్పులు చేసిందని ఆరోపించారు. ఏదేమైనప్పటికీ అధికారం కోసం ట్రంప్‌ వేసిన ఏ పాచికలూ పారలేదు. ప్రజల తీర్పు మేరకు చివరకు బైడెన్‌ అధికార పగ్గాలు స్వీకరించారు. సొంత పార్టీ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో చివరకు ట్రంప్‌ పరాభవంతో ఓటమిని అంగీకరించక తప్పలేదు.

ఇదీ చదవండి:

'అధికారమార్పిడి హింసాత్మకం చేసిన ఏకైక అధ్యక్షుడు ట్రంప్​'

అమెరికాకు 'కిమ్' షాక్.. అణు పరీక్షలపై ఇక 'తగ్గేదే లే'!

Trump Social Media App: ట్రంప్‌ సోషల్‌ మీడియా యాప్‌.. త్వరలోనే లాంచ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.