ETV Bharat / international

అమెరికాకు 'కిమ్' షాక్.. అణు పరీక్షలపై ఇక 'తగ్గేదే లే'!

author img

By

Published : Jan 20, 2022, 9:37 AM IST

US North Korea conflict: ట్రంప్ హయాంలో నిలిపివేసిన అణు కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భావిస్తున్నారు. అగ్రరాజ్యంపై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

KIM JONG UN WARNING
KIM JONG UN WARNING

US North Korea conflict: అమెరికా తమ దేశాన్ని శత్రుస్వభావంతో చూస్తోందని ఉత్తర కొరియా ఆరోపించింది. ఈ నేపథ్యంలో.. అణు పరీక్షలు ముమ్మరం చేస్తామని ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో జరిగిన చర్చల తర్వాత తాత్కాలికంగా నిలిపివేసిన కార్యకలాపాలన్నింటినీ పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీర్ఘశ్రేణి క్షిపణులు, అణుబాంబులను తయారు చేస్తామని ఈ మేరకు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది.

North Korea missile tests

'శత్రు స్వభావంతో అమెరికా తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఉత్తర కొరియా సైనిక సామర్థ్యాలను తక్షణమే బలోపేతం చేయాలని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భావిస్తున్నట్లు' స్థానిక మీడియా తెలిపింది. విశ్వాసం పెంపొందించే చర్యల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ సమీక్షించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించింది. తాత్కాలికంగా నిలిపివేసిన కార్యకలాపాలను పునఃప్రారంభించడాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది.

North Korea Nuclear test

అయితే, ఆంక్షల విషయంలో అమెరికా నుంచి మినహాయింపులు పొందేందుకే కిమ్ తాజా ఆదేశాలు జారీ చేశారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆంక్షలతో పాటు కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిన నేపథ్యంలో.. ఉత్తర కొరియా గత పాలకులు అవలంబించిన విధానాన్నే కిమ్ మళ్లీ పాటిస్తున్నారని చెబుతున్నారు.

ఉత్తర కొరియా ఇటీవల ఆయుధ పరీక్షలను విస్తృతం చేసింది. జనవరిలోనే నాలుగు రౌండ్ల మిసైల్ పరీక్షలు నిర్వహించింది. రైలు నుంచీ క్షిపణులను ప్రయోగించింది. అమెరికాపై ఒత్తిడి పెంచేందుకే ఈ పరీక్షలు చేపట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: '2024 ఎన్నికల్లో నా ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిసే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.