ETV Bharat / entertainment

'మేం చేద్దాం అనుకునేలోపు తను మరో అడుగు ముందుకేస్తాడు'

author img

By

Published : Feb 1, 2023, 6:48 AM IST

మైఖేల్​ సినిమాతో సందీప్​ కిషన్​కు అదృష్టం కలగాలని కోరుకుంటున్నట్లు హీరో నాని అన్నారు. ఫిబ్రవరి 3న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేడుకను నిర్వహించింది. దీనికి ముఖ్యతిథిగా నాని వచ్చి సందడి చేశారు.

michael pre release event
michael pre release event

'సందీప్‌ కిషన్‌ కష్టపడే, ప్రతిభ ఉన్న నటుడు, 'మైఖేల్‌' సినిమాతో అతనికి అదృష్టం కలగాలని కోరుకుంటున్నా' అని నేచురల్​ స్టార్​ నాని అన్నారు. సందీప్‌ కిషన్‌ హీరోగా రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహించిన మైఖేల్​ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. విజయ్‌ సేతుపతి, వరుణ్‌ సందేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 3న సినిమాను విడుదల చేస్తున్న నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేడుకను నిర్వహించింది. దీనికి ముఖ్యతిథిగా నాని వచ్చి సందడి చేశారు.

"మైఖేల్‌ ప్రచార చిత్రాలను చూస్తే సౌండింగ్‌, కలర్‌టోన్‌.. ఇలా ప్రతి విభాగంలో కొత్తగా అనిపించింది. 'శివ' సినిమా విభిన్న అనుభూతిని ఎలా అయితే పంచిందో ఆ రకంగానే మైఖేల్‌ అలరించారని కోరుకుంటున్నా. కష్టపడేతత్వం, అదృష్టం, ప్రతిభ.. ఈ మూడు ఉన్నవారు చిత్ర పరిశ్రమలో ఓ స్థాయికి వెళ్తారు. సందీప్‌ విషయంలో ముందు నుంచీ కష్టం, ప్రతిభ స్థిరంగా ఉన్నాయి. అదృష్టం కనిపించలేదు. దాన్ని 'మైఖేల్‌' అందిస్తుందనుకుంటున్నా. నేనూ వరుణ్‌ సందేశ్‌ ఒకే సమయంలో నటులుగా కెరీర్‌ ప్రారంభించాం. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, నానా పటేకర్‌, రఘువరన్‌లాంటి నటులకున్న బాడీ లాంగ్వేజ్‌ వరుణ్‌కు ఉంది. అలాంటి నటుడితో లవర్‌బాయ్‌ పాత్రలు చేయించారు. మైఖేల్‌లో తనికి అసలైన క్యారెక్టర్‌ లభించిందనుకుంటున్నా" అని నాని అన్నారు.

'నాని నాకు ఇన్స్పిరేషన్'​..
"నేనూ నాని ఎప్పటి నుంచో స్నేహితులం. తను నా సినిమా వేడుకకురావడం ఇదే తొలిసారి. 'ఏదో కొత్తగా ప్రయత్నించాం' అని మేం అనుకునేలోపు తను మరో అడుగు ముందుకేస్తాడు. 'సందీప్‌ కెరీర్‌ అయిపోయింది. ఇంకా సినిమాలు ఉంటాయా?' అన్న పరిస్థితి వచ్చినప్పుడు నాని నాకు స్ఫూర్తిగా నిలిచాడు. నా ప్రతి సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో టెన్షన్‌ పడేవాణ్ని. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం నేను చేయాల్సిందంతా చేశా. 2019లో 'మైఖేల్‌' టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించా. ఆ సినిమాని ఎలా అయినా చేయాలని ఫిక్స్‌ అయ్యా. తర్వాత దర్శకుడి కోసం వెతికా. నేను ఏమేం చేయలేనని అన్నారో వాటన్నింటినీ ఇందులో చేశా" అని సందీప్‌ కిషన్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.