ETV Bharat / entertainment

Shaakuntalam review: సమంత 'శాకుంతలం'.. ఎలా ఉందంటే?

author img

By

Published : Apr 14, 2023, 6:25 AM IST

Updated : Apr 14, 2023, 7:26 AM IST

Shaakuntalam review: హీరోయిన్​ సమంత కీలక పాత్రలో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'శాకుంతలం' సినిమా ఎలా ఉందంటే?

Director Guna shekar Heroine Samantha  shaakuntalam movie review
Shaakuntalam review: సమంత 'శాకుంతలం' విజువల్ ట్రీటే కానీ..

Shaakuntalam review: గ‌తేడాది సస్పెన్స్​ అండ్ యాక్షన్​ థ్రిల్లర్​ 'య‌శోద‌' సినిమాతో బాక్సాఫీస్ ముందు విజయాన్ని అందుకున్న స‌మంత‌.. ఇప్పుడు 'శాకుంత‌లం'తో ఆడియెన్స్​ ముందుకు వచ్చింది. పౌరాణిక చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని... 'రుద్ర‌మ‌దేవి' ఫేమ్​ దర్శకుడు గుణ‌శేఖ‌ర్ తెరకెక్కించారు. భారీ గ్రాఫిక్స్ హంగుల‌తో త్రీడీలో నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌కుడిగా వ్యవహరించారు. మొదటి నుంచి ఈ సినిమాపై సామ్​ అభిమానుల్లో మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పాట‌లు, ప్ర‌చార చిత్రాలు కూడా ఆక‌ట్టుకున్నాయి. మ‌రి ఈ అద్భుత ప్రేమ కావ్యం తెర‌పై ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతినిచ్చింది? స‌మంత‌, గుణ‌శేఖ‌ర్‌ల‌కు విజ‌యాన్ని అందించిందా? తెలుసుకుందాం..

ఎలా ఉందంటే: కాళిదాసు ర‌చించిన సంస్కృత నాట‌కం అభిజ్ఞాన శాకుంత‌లంలోని శ‌కుంత‌ల - దుష్యంతుల ప్రేమ‌కావ్యానికి.. త‌న‌దైన శైలిలో కాస్త క‌ల్ప‌న జోడించి స్క్రీన్​పై ఓ అపురూప దృశ్య కావ్యంలా ఆవిష్క‌రింప‌జేసే ప్ర‌య‌త్నం చేశారు గుణ‌శేఖ‌ర్‌. కానీ అది ఫలించలేదనే చెప్పాలి! ఎందుకంటే ఇలాంటి కథను గుణ‌శేఖ‌ర్‌ లాంటి డైరెక్టర్​ రూపొందిస్తున్నారంటే.. కచ్చితంగా అందులో వైవిధ్యం ఆశిస్తాం. కానీ, ఇక్కడ ఈ ప్రేమకావ్యాన్ని చ‌దువుతున్న‌ప్పుడు క‌లిగే అనుభూతి.. తెర‌పై చూస్తున్న‌ప్పుడు కొంచెం కూడా క‌ల‌గ‌లేదు. విజువల్ ఎఫెక్ట్​ తేలిపోయాయి. ఇలా నాసిర‌కమైన త్రీడీ హంగులు, న‌త్త‌న‌డ‌క‌న సాగే క‌థ‌నం, సంఘ‌ర్ష‌ణ లేని ప్రేమ కథ.. ఈ సినిమా! దష్యంతుడు-శకుంతల(దేవ్​ మోహన్​-సమంత) మధ్య ఉన్న ప్రేమ‌ను, కెమిస్ట్రీని మ‌న‌సుల‌కు హ‌త్తుకునేలా చూపించ‌లేక‌పోయారు గుణశేఖర్​. దీంతో ప్రేక్ష‌కులు మొదటి నుంచే వారి ప్రేమ‌క‌థ‌కు అంతగా క‌నెక్ట్ కాలేక‌పోయారు. అయితే ఈ ప్రేమ క‌థ మ‌ధ్యలో కుదిరినప్పుడల్లా.. అసుర‌జాతి కాలానీముల క‌థ‌ను, దుర్వాస మ‌హ‌ర్షి క‌థ‌ను ప‌రిచ‌యం చేసే ప్రయత్నం ప్రేక్షకుల్ని మెప్పిస్తాయని చెప్పాలి. ఇంటర్వెల్​లో దుర్వాస మ‌హ‌ర్షి ఎంట్రీ బాగుంది. ఇక ద్వితీయార్ధం ఆరంభం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. కానీ, ఆ త‌ర్వాత క‌థ కాస్త గాడి త‌ప్పుతుంది. అయితే క్లైమాక్స్​ సీన్స్​లో భ‌ర‌తుడిగా అల్లు అర్హ ఎంట్రీ.. దుష్యంతుడితో ఆమె వాద‌న మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఎవ‌రెలా చేశారంటే: శ‌కుంత‌ల పాత్ర‌కు సమంత న్యాయం చేసింది. కానీ, ఆ పాత్ర ఆమెకెందుకో అంత‌గా సెట్ అవ‌లేద‌నిపించింది. సొంత‌ డ‌బ్బింగ్ కూడా అంత‌గా ఆకట్టుకోలేదు. అయితే ఎమోషనల్​ సీన్స్​ మాత్రం బాగానే చేసింది. దుష్యంతుడి పాత్ర‌కు త‌గ్గ రూపం దేవ్ మోహ‌న్‌కు ఉన్నప్పటికీ.. ఆయ‌న న‌ట‌న నేచురల్​గా లేదనిపించింది. నిజానికి ఆ పాత్ర‌కు కాస్త పేరున్న యాక్టర్​ను తీసుకుని ఉంటే మార్కెట్​ పరంగా కలిసొచ్చేది. దుర్వాస మ‌హ‌ర్షి పాత్ర‌కు మోహ‌న్‌బాబు సరిగ్గా సెట్ అయిపోయారు. ఆయ‌న క‌నిపించేది కొద్దిసేపే అయినా అంద‌రినీ కట్టిపడేశారు. స‌చిన్‌, అన‌న్య‌, మ‌ధుబాల‌, జిషు సేన్ గుప్తా.. ఇలా ఎన్నో పాత్రలు కనిపించినా.. అవన్నీ గుర్తుంచుకునే స్థాయిలో లేవు. క్లైమాక్స్​ సీన్స్​లోఅల్లు అర్హ యాక్టింగ్​.. ఆమె ప‌లికే డైలాగ్స్​ ముచ్చ‌ట‌గొలుపుతాయి. మొత్తంగా శాకుంత‌ల - దుష్యంతుల ప్రేమ క‌థ‌ను తెర‌పై ఓ అద్భుత దృశ్య కావ్యంలా ఆవిష్క‌రించడంలో గుణ‌శేఖ‌ర్ ఆకట్టుకోలేకపోయారనే చెప్పాలి. విజువ‌ల్ ఎఫెక్ట్స్ విష‌యంలో మ‌రింత‌ శ్ర‌ద్ధ వ‌హించాల్సింది. మ‌ణిశ‌ర్మ సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్​, సాంగ్స్​ సినిమాకు ప్లస్​. నిర్మాణ విలువ‌లు పర్వాలేదనిపిస్తాయి.

బ‌లాలు: స‌మంత న‌ట‌న, మ‌ణిశ‌ర్మ సంగీతం, ఇంటర్వెల్​, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు బలాన్ని ఇచ్చాయి. అవి ఆడియెన్స్​ను ఆకట్టుకుంటున్నాయి. విజువల్​ ట్రీట్​ కూడా బాగానే ఉందని అంటున్నారు.

బ‌ల‌హీన‌త‌లు: అయితే కథనం నెమ్మదిగా సాగింది. సంఘ‌ర్ష‌ణ లేని ప్రేమ‌క‌థ‌ ఇది.

చివ‌రిగా: ఒక మాటలో చెప్పాలంటే ఈ అభిజ్ఞాన 'శాకుంతలం'.. అంతగా ఆక‌ట్టుకోని 'సమంతలం'

గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి దృష్టి కోణంలో రాసినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Shakuntalam Movie : జయప్రద టు సమంత.. 'శకుంతల'గా మెరిసిన హీరోయిన్లు వీళ్లే!

Last Updated : Apr 14, 2023, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.