Youth suicide with mental depressions: పనికి వెళ్లకుండా తిరుగుతున్నావని తల్లి మందలించిందన్న బాధలో సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన యువకుడు పురుగు మందు తాగాడు. సీహెచ్‌సీలో చికిత్స పొందుతూ ఈ నెల 5న మృత్యువాతపడ్డాడు.
ఫిబ్రవరి 3: చిన్న వయసులో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతో ఖమ్మం నగర శివారు ప్రాంతానికి చెందిన పదిహేడేళ్ల బాలిక విషం తాగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.
ఫిబ్రవరి 5: బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన పాతికేళ్ల యువకుడు కేవలం అనారోగ్య సమస్యతో ఉరేసుకున్నాడు.
జనవరి 19: ప్రియుడు పెళ్లికి నిరాకరించాడన్న కారణంతో ఇల్లెందు పట్టణానికి చెందిన యువతి (21) ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది.
జనవరి 29: ఉపాధి వెతుక్కుంటూ ఏపీలోని తునికి వెళ్లిన వేంసూరు మండలం దుద్దెపూడికి చెందిన యువకుడు (24).. ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయనకు భార్య ఉన్నారు.
ఈ ఏడాది కేవలం 40 రోజుల వ్యవధిలో పదిహేను మందికి పైగా యువత పలు కారణాలతో బలవన్మరణాలకు పాల్పడటం గమనార్హం. గతేడాది భద్రాద్రి జిల్లాలో 430, ఖమ్మం జిల్లాలో 544 మంది బలవన్మరణాలకు పాల్పడగా.. వీరిలో అత్యధిక శాతం 20-35 ఏళ్ల వారే ఉండటం గమనార్హం. ఈ నెలలోనూ కేవలం మూడ్రోజుల వ్యవధిలో నలుగురు ఉరికి వేలాడారు.
చదువులో ఒత్తిళ్లు, నిరుద్యోగం, ప్రేమ, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాలు.. ఇలా ఏదో ఒక సమస్యతో ఉమ్మడి జిల్లాలో రెండు, మూడ్రోజులకొకరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తీవ్ర కుంగుబాటులో.. క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయాలు ఆయా కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.
భార్య, భర్తల్లో ఎవరో ఒకరు దూరమై పిల్లలు అనాథలవుతున్నారు. యువత అఘాయిత్యాలతో తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. ‘చనిపోయేందుకు ఎంతో ధైర్యం కావాలి. అందులో కాస్త కూడబలుక్కుని సమస్యలు ఎదుర్కొంటే ఆ తర్వాత జీవితం సానుకూల ధోరణితో సాగుతుందని’ మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
మానసిక నిపుణులు ఏమంటున్నారంటే..
* మానసిక ఒత్తిడి గుర్తించి, దాన్ని అధిగమించే విషయంలో అన్నివర్గాల వారిలో అవగాహన రావాలి. ఈ సమస్యకు మంచి చికిత్స ఉంది.
* కుంగుబాటు బాధితుల్లో ప్రభుత్వాస్పత్రుల వైద్యులు, కుటుంబీకులు, స్నేహితులు, పోలీసులు ధైర్యం నింపాలి. అందుకే వీరిని వైద్య పరిభాషలో ‘గేట్ కీపర్’గా పేర్కొంటారు.
* బాల్యం నుంచే ఆత్మవిశ్వాసం పెంపొందించాలి. భావోద్వేగాలు నియంత్రించుకునేలా పునాదులు వేయాలి.
* తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న కుటుంబాల్లో పిల్లలు అంతర్జాలానికి బానిస అవుతున్నారు. ఆత్మహత్యల గురించి వీరు ఎక్కువగా నెట్‌లో శోధిస్తున్నట్లు తెలుస్తోంది. టీనేజర్లతో కన్నవారు విలువైన సమయం గడపాలి.
* పెళ్లయిన కొత్తలో యువ దంపతుల మధ్య విభేదాలు తలెత్తడం సహజమైంది. ఇద్దరూ సంపాదిస్తున్నవారైతే పట్టింపులు ఇంకాస్త ఎక్కువవుతున్నాయి. చిన్న గొడవలు చినికి చినికి గాలి వానలా మారకుండా పెద్దలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేసేలా ఉండాలి.
‘ప్రతి సమస్యకూ పరిష్కారముంది. క్షణికావేశంలో బలవన్మరణ ఆలోచనలు రానివ్వొద్దు. సమాజంలో అనేకమంది ఎన్నో ఇబ్బందులతో బాధపడుతుంటారు. ఎవరైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ, ఒంటరిగా తిరుగుతుంటే కుటుంబీకులు గుర్తించి ఆసుపత్రిలో కౌన్సెలింగ్‌కు తీసుకురావాలి’ -బి.శంకర్ పాల్వంచ సీహెచ్‌సీ ఎండీ
గేట్ కీపర్స్ పాత్ర ముఖ్యం"ఇక బతకలేనని నిర్ణయించుకునే వారు తరచూ కుటుంబ సభ్యులతో, అప్పుడప్పుడూ స్నేహితుల వద్ద నైరాశ్యం వ్యక్తం చేస్తుంటారు. ఈ సంకేతాలను కాస్త పట్టించుకుని బాధితుల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తే ప్రాణాలు నిలపొచ్చు. యువత కొందరు అవతలి వారి ప్రమేయం లేకుండా తమకు తామే ప్రేమ ఊహించుకోవడం ఎక్కువైంది. తీరా ప్రేయసి, లేదా ప్రియుడు నిరాకరించే సరికి ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. జీవిత లక్ష్యాలు ఏర్పరుచుకుని తొలుత వాటిని సాధించడంపై దృష్టిపెట్టాలి." -ఎన్. వెంకటేశ్, డీఎస్పీ, పాల్వంచ
ఇవీ చదవండి: