ETV Bharat / crime

రెండు ప్రాణాల్ని బలి తీసుకున్న భూవివాదం.. సినీ ఫక్కీలో కాల్పులు

author img

By

Published : Mar 2, 2022, 7:19 AM IST

Realtors Murder in Rangareddy District: రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు స్థిరాస్తి వ్యాపారుల హత్య.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తుపాకీ కాల్పులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 5 బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతికత సాయంతోనే దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు 9 ఎం.ఎం పిస్తోలు ఉపయోగించడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Gun firings on Realtors, Realtors Murder in Rangareddy District
స్థిరాస్తి వ్యాపారుల హత్య

స్థిరాస్తి వ్యాపారులపై కాల్పుల కలకలం

Realtors Murder in Rangareddy District: హైదరాబాద్‌ శివారు తుపాకీ కాల్పులతో ఉలిక్కిపడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణగూడ సమీపంలో స్థిరాస్తి వ్యాపారులు నవారు శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిపై మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. శ్రీనివాసరెడ్డి అక్కడికక్కడే మరణించారు. రాఘవేంద్రరెడ్డి వాహనంలో పారిపోయేందుకు ప్రయత్నించగా దుండగులు వెంటాడి ఛాతీపై కాల్చారు. కుప్పకూలిన ఆయన్ను స్థానికులు వనస్థలిపురం బీఎన్​ రెడ్డి నగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం ఆయన మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఘటనాస్థలాన్ని రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణా రెడ్డి పరిశీలించారు. భూ వివాదాల నేపథ్యంలోనే హత్యలు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని వేర్వేరు తుపాకులతో కాల్చినట్టు నిర్ధరణకు వచ్చారు. గురి తప్పకుండా తుపాకీ పేల్చడాన్ని వృత్తిగా ఎంచుకున్నవారే ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆగంతకులు ఏ వాహనంలో వచ్చారు? ఎలా వెళ్లిపోయారనే విషయాలను ఆరా తీస్తున్నారు.

కాల్పులకు ముందు గొడవ

Gun firings on Realtors: శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డి... కొద్దికాలం క్రితం కర్ణగూడ సమీపంలో వివాదంలో ఉన్న 10 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. రోజు మాదిరిగానే శ్రీనివాసరెడ్డి ఉదయం 5.15 గంటలకు కారులో ఆ పొలం వద్దకు బయల్దేరారు. రాఘవేంద్రరెడ్డిని కూడా తీసుకెళ్లారు. పొలం సమీపంలో స్థిరాస్తి వ్యాపారి మట్టారెడ్డి ఉన్నాడు. కొద్దికాలంగా శ్రీనివాసరెడ్డి, మట్టారెడ్డి మధ్య వివాదం జరుగుతోంది. కాల్పులకు గంట ముందు ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. పరస్పరం బెదిరించుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డి పొలం నుంచి కారెక్కేందుకు బయటకు వస్తుండగా.. అక్కడే కాపుగాచిన ఆగంతకులు తొలుత శ్రీనివాసరెడ్డిపై కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే మరణించారు. ఉలిక్కిపడిన రాఘవేంద్రరెడ్డి తప్పించుకునేందుకు కారును వేగంగా పోనిస్తుండగా రోడ్డు పక్కనే ఉన్న మట్టిలో ఇరుక్కుపోయింది. దాదాపు అర కిలోమీటరు దూరం వెంటాడిన ఆగంతకులు.. ఆయనపైనా కాల్పులు జరిపారు. ఒక తూటా నుంచి తప్పించుకున్నా రెండో తూటా ఆయన గుండెల్లోకి దూసుకెళ్లింది. చికిత్స అందించినా ప్రాణం నిలవలేదు.

మూడో వ్యక్తి ఉన్నాడా.?

ఘటనాస్థలంలో పోలీసు జాగిలాలు.. అర కిలోమీటరు దూరం వెళ్లి వెనక్కి వచ్చాయి. శ్రీనివాసరెడ్డి కారులో మూడో వ్యక్తి కూడా ఉన్నాడా.. ఆ వ్యక్తి ఏమైనా కాల్పులు జరిపి ఉండొచ్చా అని కూడా అనుమానిస్తున్నట్టు ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుల ఆచూకీ గుర్తించేందుకు ఐదు బృందాలు ఏర్పాటుచేసినట్టు... సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

నాలుగు రోజులుగా కాపు కాసి

ఖరీదైన భూమి చేజారుతుందనే భయంతో శ్రీనివాసరెడ్డి ప్రత్యర్థుల్లోని వారే సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించి ఉండవచ్చనే అనుమానాలున్నాయి. ఆయన కదలికలను నలుగురు వ్యక్తులు 4 రోజులుగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం లేక్‌విల్లా సమీపంలో 22 ఎకరాల స్థలాన్ని శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డి కొన్నారు. ఇదేప్రాంతంలో మట్టారెడ్డి ప్లాట్లు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో లావాదేవీల్లో వివాదం చోటుచేసుకొని.. మట్టారెడ్డి వీరిని హత్య చేయించాడని మృతుల బంధువులు ఆరోపించారు.

మరో వివాదం

జంట హత్యలకు కారణంగా భావిస్తున్న భూవివాదంపై కొందరు పలుమార్లు పోలీసులు, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్‌గూడ సమీపంలో 80 ఎకరాల స్థలాన్ని నెల్లూరు వాసులు 1995-96 సమయంలో నలుగురు వ్యక్తుల నుంచి కొన్నారు. 400 ఫ్లాట్లుగా విభజించి సేల్‌ డీడ్‌ చేసుకున్నారు. లేక్‌ విల్లా ఆర్చిడ్స్‌ ఫ్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కింద.. రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. చుట్టూ ప్రహరీ నిర్మించుకుని ఫ్లాట్లలో టేకు, పండ్ల మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాసరెడ్డి, మరో నలుగురు కలసి 20 ఎకరాలు కొన్నారు. తమ పేరుతో అగ్రిమెంట్‌ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఇరువైపులా వివాదం మొదలైంది. గతంలో ఒకసారి.. తాజాగా ఈ ఏడాది జనవరి 17న మరోసారి శ్రీనివాసరెడ్డి, అతడి అనుచరులు తమ స్థలాన్ని ఆక్రమించుకుని చెట్లు, పండ్ల మొక్కలు తొలగించారంటూ సంఘం తరఫున పలువురు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నెలలుగా పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా.. పోలీసులు స్పందించలేదంటూ ఫ్లాట్ల యజమానుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ తుపాకీ అదే

జంట హత్యల కేసుకు సంబంధించి ఆగంతుకులు 9 ఎం.ఎం పిస్తోలు ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా ఆయుధం వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మవోయిస్టులు, పోలీసులు మాత్రమే ఉపయోగించే 9 ఎం.ఎం పిస్టల్‌ దుండగులు ఉపయోగించటం చర్చనీయాంశంగా మారింది. రాఘవేంద్ర రెడ్డి ఛాతీ ప్రాంతం నుంచి ఒకటి... చేతి వేలి నుంచి మరో బుల్లెట్‌ లభించాయి. స్కార్పియో వాహనంలో రెండు, ఘటనా స్థలంలో రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. వీరు సుఫారీ ముఠా సభ్యులా, రౌడీషీటర్లా, స్థిరాస్తి వ్యాపారులా.. అనేది తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: డార్క్‌ నెట్ డీల్స్​కు చెక్.. టెక్నాలజీ సాయంతో ముకుతాడు వేస్తున్న నార్కోటిక్ వింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.