సూర్యాపేటలో విషాదం చోటుచేసుకుంది. ఖాళీ పెట్రోలు ట్యాంకర్‌ను వెల్డింగ్ చేస్తుండగా పేలిపోయి ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో సూర్యాపేట కోటమైసమ్మ బజారుకు చెందిన వెల్డింగ్ వర్కర్ మంత్రి అర్జున్(36), ట్యాంకర్ డ్రైవర్ గట్టు అర్జున్(52) అక్కడికక్కడే మృతి చెందారు. వెల్డింగ్ వర్కర్ ఏర్పుల మల్లయ్య, మరో లారీ డ్రైవర్ మేడె వెంకటరమణ గాయాలపాలయ్యారు. ఏర్పుల మల్లయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
ట్యాంకర్ వాల్ లీకవుతుండగా మరమ్మతు చేయించేందుకు సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల వెల్డింగ్ షాప్ వద్దకు తీసుకురాగా ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి ట్యాంకర్ తునాతునకలైంది. సమీపంలోని నాలుగు దుకాణాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆయిల్ ట్యాంక్ పేలడంతో అక్కడి పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో సూర్యాపేట వాసులంతా భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలంలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. వెల్డింగ్ కార్మికులు మృతి చెందడంతో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనాస్థలాన్ని ఎస్పీ రాజేంద్రప్రసాద్, డీఎస్పీ మోహన్‌కుమార్ పరిశీలించారు.
ఇదీ చూడండి: