ETV Bharat / city

హద్దుమీరుతోన్న మైనింగ్.. లీజు ఒకచోట.. తవ్వకాలు మరోచోట

author img

By

Published : Feb 24, 2022, 7:18 AM IST

Illegal Mining in Telangana : తెలంగాణలో పలు ప్రాంతాల్లో మైనింగ్ హద్దు మీరుతోంది. లీజు ఒక చోట తీసుకుని.. మరోచోట తవ్వకాలు జరుపుతున్నారు. దీనివల్ల వన్యప్రాణులకు, చారిత్రక ప్రాంతాలకు, పచ్చదనానికి, ప్రకృతికి ముప్పు కలుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జరుగుతున్న మైనింగ్ దందాలో విస్మయకర విషయాలు బయటపడ్డాయి.

Illegal Mining in Telangana
Illegal Mining in Telangana

Illegal Mining in Telangana : రాష్ట్రంలో పలుచోట్ల అక్రమ మైనింగ్‌ సాగుతోంది. గుట్టలు గుల్లబారుతున్నాయి. పచ్చదనం నేలకొరుగుతోంది. కొన్నిచోట్ల అసలు అనుమతే లేకుండా తవ్వుకుపోతున్నారు. మరికొన్నిచోట్ల అనుమతి తీసుకున్నా పరిమితికి మించి, హద్దులు దాటి కొండల్ని కరిగిస్తున్నారు. రూ.కోట్ల విలువైన మట్టిని, రాళ్లను యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాదు.. జీవవైవిధ్యం అలరారే అందాల అడవులను, వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆది మానవుల ఆవాస ప్రాంతాలనూ ధ్వంసం చేస్తున్నారు. హనుమకొండ, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ప్రతినిధి క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. మైనింగ్‌ దందాలో విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి.

Illegal Mining in Hanamkonda : హనుమకొండ, వరంగల్‌ జిల్లాలకు మిగిలిన ఏకైక అటవీప్రాంతం దేవునూర్‌ ఇనుపరాతి గుట్టలే. నాలుగు మండలాలు, నాలుగు వేల ఎకరాల విస్తీర్ణం. హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం దేవునూర్‌ పరిధిలోనే 600 ఎకరాల వరకు అడవి ఉంది. ఇందులో ఎర్రమట్టితో పాటు నల్లరాయి, ఇనుపఖనిజం ఉండడంతో మైనింగ్‌ అక్రమార్కుల కన్నుపడింది. అడవిలో దారులు వేసి లారీల్లో పెద్దఎత్తున మట్టి, ఇనుపఖనిజం, రాళ్లను తరలించుకుపోయారు. తవ్వకాలకు గుర్తుగా పలుచోట్ల లోయలు మిగిలాయి. దేవునూర్‌.. ఫారెస్ట్‌ బ్లాక్‌ 7076లో ఉంది. జింకలు, కొండగొర్రెలు, నెమళ్లు, అడవిపందుల వంటి వన్యప్రాణులున్నాయి. వేల సంవత్సరాల నాటి ఆది మానవుల సమాధులు ఇక్కడున్నాయి.

ఇంత చారిత్రక, జీవవైవిధ్య ప్రాంతం మైనింగ్‌ వ్యాపారులు, రియల్టర్ల నుంచి ముప్పు ఎదుర్కొంటోంది. దేవునూర్‌లో కొందరికి భూమి పట్టాలున్నాయి. ఇటీవల భూముల ధరలు బాగా పెరగడంతో కొందరు గుట్టలన్నీ తమవేనంటూ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిసరాలను రక్షిత అటవీప్రాంతంగా గుర్తించే ప్రక్రియ చాలాకాలం కిందటేమొదలైనా మధ్యలో ఆగింది. నోటిఫికేషన్‌ ఇస్తే కొంత రక్షణ ఏర్పడుతుంది.

.

సరిహద్దు దాటి తవ్వకాలు..

Illegal Mining in Kothagudem : కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురంలో ఓ వ్యక్తి రోడ్డు కోసం ప్రభుత్వభూమిలో అయిదు వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వేందుకు అనుమతి తీసుకున్నాడు. కానీ హద్దులు దాటి పక్కన ఉన్న కొండపైనా తవ్వి మట్టి తరలించాడు. మైనింగ్‌ అధికారులు బుధవారం క్షేత్రస్థాయి తనిఖీలు జరిపి అక్రమాల్ని నిర్ధరించారు. రూ.40 లక్షల జరిమానా విధించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

Illegal Mining Amrabad : అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు పరిధిలోని నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము, చందంపేట మండలాల అటవీప్రాంతంలోని గుట్టల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారంలోనూ ఇదే పరిస్థితి. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం నందానందా పంచాయతీలో 20 ఎకరాల గుట్ట గతంలో పచ్చదనంతో కళకళలాడేది. అక్రమార్కులు దీన్ని గుల్ల చేయడంతో ఇప్పుడక్కడ ఆనవాళ్లు కూడా లేవు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగరం గుట్టపై 198 ఎకరాల ప్రభుత్వభూమి ఉంది. కొంత అనుమతి తీసుకుని.. పరిమితికి మించి గుట్ట చుట్టూ ఇష్టారీతిన తవ్వేస్తున్నారు.

కరిగిపోయిన గుట్ట

కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం వేల్పులగుట్ట మట్టి తవ్వకాల్లో భారీ అక్రమాలు జరిగాయి. ‘60 వేల క్యూబిక్‌ మీటర్లకు అనుమతిస్తే, అదనంగా మరో 28 వేల క్యూబిక్‌ మీటర్లు తవ్వేశారు. దీంతో రూ.52 లక్షల జరిమానా వేసినట్లు’ మైనింగ్‌ ఏడీ జైసింగ్‌ ‘ఈనాడు’కు తెలిపారు. మైనింగ్‌ అనుమతి తీసుకున్న వ్యక్తికి అయిదెకరాల పొలం ఒకచోట ఉంటే.. ప్రభుత్వభూమి, గుట్ట ఉన్నచోట మట్టి తవ్వకాలకు అనుమతిచ్చినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు వేల్పులగుట్ట మట్టి తవ్వకాలకు తన హయాంలో అనుమతివ్వలేదని పాల్వంచ ఎమ్మార్వో స్వామి చెప్పారు.

మైనింగ్‌ మాఫియా నుంచి కాపాడాలి

"దేవునూర్‌ ఇనుపరాతి గుట్టలు, అటవీశాఖ భూములను అధికారుల అండతో మైనింగ్‌ మాఫియా కొల్లగొడుతోంది. రాత్రివేళ గ్రానైట్ను, మట్టిని తరలించేస్తున్నారు. ఇటీవల మూడు సంస్థలు మైనింగ్‌ కోసం టెండర్‌ వేశాయి. లీజుకు ఇవ్వకుండా అటవీప్రాంతాన్ని కాపాడాలని గ్రామ పంచాయతీ తరఫున తీర్మానించి కలెక్టర్‌కు, ప్రభుత్వానికి పంపించాం. వీటితో స్థానికులకు ఉపాధి పనులు.. పశువులకుమేత దొరుకుతోంది. వ్యవసాయానికి జీవనాధారమైన గుట్టల్ని కాపాడాలి."

- చిర్ర కవిత, దేవునూర్‌ సర్పంచి

అటవీ భూములతో అందరికీ ఉపాధి

"15, 20 గ్రామాల ప్రజలకు, రైతులకు, జీవాలకు ఆధారంగా ఉన్న అటవీప్రాంతాన్ని కొందరు కొల్లగొడుతున్నారు. మా రెండెకరాల వ్యవసాయ భూమిలోకే మమ్మల్ని వెళ్లనీయట్లేదు. రియల్‌ఎస్టేట్ వ్యాపారులు అటవీశాఖ కందకం దాటి లోపల 50-100 మీటర్ల దూరంలో చెట్లను తొలగించి చదును చేసుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలి."

- యాకూబ్‌ పాషా, రైతు, దేవునూర్‌

సర్వే, సబ్‌డివిజన్‌ చేయించాలని కలెక్టర్‌ను కోరా

"పాండురంగాపురం సర్వేనెం.126/1లో వేల్పులగుట్ట భూమి ప్రభుత్వ భూమా? పట్టా భూమా? నిర్ధరించాలని కోరుతూ కలెక్టర్‌కు లేఖ రాశా. ఎంజాయిమెంట్‌ భూమిపై సమగ్ర సర్వే చేసి, సబ్‌డివిజన్‌ నిర్ణయిస్తేనే.. అసలక్కడ ఉన్న భూమెంత..అందులో వేల్పులగుట్ట ఎక్కడ, ఎంత విస్తీర్ణంలో ఉంది..? ఎసైన్డ్‌, మిగిలిన భూమి వివరాలు వస్తాయి."

- స్వర్ణలత, ఆర్డీవో, కొత్తగూడెం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.