యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి శుక్రవారం దర్శించుకుని స్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పునఃనిర్మాణ పనులను పరిశీలించారు. పునఃనిర్మాణ పనులను 45 రోజుల్లో పూర్తిచేయాలని వైటీడీఏ అధికారులను ఆదేశించారు. పనులపై అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
భూపాల్ రెడ్డి ఆలయ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ అధికారులకు, గుత్తేదారులకు పలు సూచనలు చేశారు. ప్రధానాలయం ముఖ మండపంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న క్యూలైన్ పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రాకారాలు నూతనంగా చేపడుతున్న రథశాల మాడవీధులు, భూగర్భ డ్రైనేజీ పనులు, క్యూకాంప్లెక్స్, ప్రధానాలయ పునఃనిర్మాణ పనులతోపాటు కొండపైన నిర్మితమవుతోన్న, శివాలయంలోని యాగశాల, నవగ్రహ మండపం పనులను పరిశీలించారు.
పనులపై సీఎంకు నివేదిక
వీవీఐపీల కోసం నిర్మిస్తోన్న ప్రెసిడెన్షియల్ సూట్లు, పెద్దగుట్టపై కాటేజీలు, ఆలయ నగరి పరిసరాలు, మొక్కల పెంపకం, గ్రీనరీ తదితర వాటిని భూపాల్‌రెడ్డి ప్రత్యేకంగా పరిశీలించారు. నాణ్యత పట్ల పూర్తి శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. యాదాద్రి పర్యటనపై పూర్తి నివేదికను ఆయన సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నారు.
ఇదీ చదవండి: 'ఫొటోలతో సహా యాదాద్రి పనుల నివేదిక కావాలి'