ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా బాధితులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాల కల్పనకు అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో.... తొలి విడతలో కేవలం 100 పడకలు ఏర్పాటు చేశారు. రెండో దశలో ఆక్సిజన్ పడకలకు డిమాండ్ పెరగటంతో ఆ సంఖ్యను 180కి పెంచారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి బాధితులు ఎక్కువగా వస్తుండటంతో పడకల సంఖ్య మరింత పెంచాలని కలెక్టర్ శంశాక అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆక్సిజన్ పడకలను పెంచాలని నిర్ణయించారు. ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఆక్సిజన్ ట్యాంక్, కాన్సంన్‌ట్రేటర్ అందుబాటులో ఉండటంతో.... ప్రతి పడకకు ఆక్సిజన్ సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్తగా 239 పడకలకు ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించారు.
ప్రాణవాయువు అందేలా చర్యలు..
రెండో దశలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రెట్టింపు వేగంతో సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆక్సిజన్ పడకల స్థాయిని 419కి పెంచారు. అన్ని పడకలకు నేరుగా ప్రాణవాయువు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. త్వరతగిన పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
మూడో దశకు అప్రమత్తం..
కరోనా మూడో దశ ప్రభావం కొన్ని నెలల్లో మెుదలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపిల్లలపై ప్రభావం ఉంటుందనే ప్రచారంతో..... ఆస్పత్రిలో 50 పడకలు చిన్నారుల కోసం కేటాయించామని సూపరింటెండెంట్ రత్నమాల తెలిపారు. ఆ విభాగానికి నోడల్ అధికారి నియమించామని వెల్లడించారు. అవసరమైన వైద్యులు అందుబాటులో ఉండేలా జాగ్రత్త వహిస్తున్నామని రత్నమాల వివరించారు.
- ఇదీ చూడండి: ప్రమాదంలో పర్యావరణం.. కాగితాల్లోనే నిబంధనలు