ETV Bharat / city

రికార్డు స్థాయిలో నీరు ఎత్తిపోసిన గాయత్రి పంపుహౌస్

author img

By

Published : Jan 30, 2021, 7:34 AM IST

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం అనంతరం.. శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గిపోయింది. ఫలితంగా చుట్టు పక్కల రైతులు సాగునీరు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీరు లేక బీడువారిన భూములను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. నిన్నటిదాకా నీరు లేక మోడుబారిన పంట పొలాలు.. కాళేశ్వరం జలాలతో పచ్చగా కళకళలాడుతున్నాయి.

Gayatri pump house lifts water at record level
రికార్డు స్థాయిలో నీరు ఎత్తిపోసిన గాయత్రి పంపుహౌస్

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు నీటి కటకట ఏర్పడిన తరుణంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నేనున్నానంటూ రైతులకు భరోసా కల్పిస్తోంది. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం అనంతరం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గిపోయింది. నీరు లేక మోడుబారిన పొలాలను తడిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ఎత్తిపోతలకు రూపకల్పన చేశారు. కాళేశ్వర జలాలతో బీడువారిన పొలాలు సస్యశ్యామలంగా మారుతున్నాయి. ఎత్తిపోతల పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 88 టీఎంసీల గోదావరి జలాల నీటిని ఎత్తిపోసి నీటిపారుదల శాఖ అధికారులు రికార్డును సృష్టించారు.

బాహుబలి పంపుసెట్లకు వేదికగా..

కాళేశ్వరం ప్రాజెక్టు రెండో దశలోని గాయత్రి పంప్ హౌస్.. బాహుబలి పంపుసెట్లకు వేదికగా నిలిచింది. ప్రంపంచంలోనే అతిపెద్ద మోటార్లుగా పేరొందిన గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి అవసరం ఉన్న ప్రతిసారి నీటిని ఎత్తిపోస్తున్నారు. మేడిగడ్డ నుంచి నీటికి ఎత్తిపోయక పోయినా ఎల్లంపల్లి నుంచి వచ్చే నీటిని తరలించాలన్నా నంది పంప్‌హౌస్​‌లతో పాటు గాయత్రి పంపులను మాత్రం వినియోగించాల్సి వస్తోంది.

111 మీటర్లు ఎత్తిపోస్తోంది..

11 ఆగష్టు 2019 నుంచి మొదలు పెట్టిన ఎత్తిపోతల ప్రక్రియలో.. విడతల వారీగా ఇక్కడి నుంచి జలాలు తరలిస్తున్నారు. 321 ఎఫ్.ఆర్.ఎల్ పై నిర్మించిన గాయత్రి పంప్ హౌస్ పాతాళ గంగను 111మీటర్ల పైకి ఎత్తిపోస్తోంది. ఇక్కడి నుంచే మధ్య మానేరు ప్రాజెక్టుకు గ్రావిటీ ప్రవాహం మొదలవుతుంది. 139మెగా వాట్ల సామర్థ్యం గల ఏడు బాహుబలి పంపుసెట్లకు భారీ విద్యుత్ వినియోగంతో భూగర్భంలోని ఎత్తిపోతలతో నీటిని కరవు నేలకు తరలిస్తున్నారు. భూగర్భంలో 8475 చదరపు అడుగుల వైశాల్యంలో పంప్ హౌస్ నిర్మించగా 0.1టీఎంసీల సర్జిపూల్ ఆసియా ఖండంలోనే పెద్దదిగా గుర్తింపు పొందింది. నీటి ఎత్తిపోతలలో రికార్డుల పరంపర కొనసాగిస్తూ గాయత్రి పంప్ హౌస్ మెట్ట ప్రాంతాల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

88 టీఎంసీలు.. 976.8 మిలియన్ యూనిట్ల విద్యుత్

వివిధ దశల్లో నీటిని ఎత్తిపోయడానికి విద్యుత్ వినియోగం కూడా బాగానే అవుతోంది. ఒక్కో టీఎంసీకి సుమారుగా 11.10 మిలియన్ యూనిట్ల కరెంట్ వినియోగిస్తున్నారు. మేడిగడ్డ లేదా ఎల్లంపల్లి నుంచి నీటిని మధ్యమానేరు లేదా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి మళ్లించాలంటే విధిగా నంది, గాయత్రి పంపు హౌసుల నుంచి నీటిని ఎత్తిపోయాల్సిందే. ఇప్పటి వరకు 88 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి 976.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించినట్లు సమాచారం. ఒక్కో టీఎంసీకి మోటార్లు 81 గంటలు పనిచేయగా మొత్తం 88 టీఎంసీలకుగాను 7180 గంటలు మోటార్లు పనిచేశాయి. ప్రస్తుతం యాసంగి పంటల కోసం దిగువ మానేరు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. అందుకుగాను ప్రాజెక్టులో నీటిని నింపేందుకు మధ్యమానేరు నుంచి 6300 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో గాయత్రి పంపు ద్వారా మధ్య మానేరుతో పాటు శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకానికి నీరు తరలివెళ్తున్నాయి.

పంటపొలాలు సస్యశ్యామలం

శ్రీరాంసాగర్‌లోని మిగులు జలాలను కరవు ప్రాంతాలైన వరంగల్‌, నల్గొండ జిల్లాలకు తరలించే ఉద్దేశంతో 2004లో వరద కాలువ తవ్వకం పూర్తి చేశారు. కాల్వ తవ్వకం పూర్తైనా నీరు వదిలిన దాఖలాలు మాత్రం లేకపోవడం వల్ల వరదకాలువ ఎండిపోయి జీవం లేకుండా తయారైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రవాహానికి ప్రత్యామ్నాయంగా సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మించడం.. అందులో భాగంగా వరద కాలువను కూడా వినియోగించుకోవడానికి ప్రణాళిక రూపొందించడం వల్ల బీడు పొలాలకు జీవం పోసినట్లైంది. ఎండిపోయి జీవం లేకుండా మారిన వరద కాలువ.. గాయత్రి ఎత్తిపోతలు మొదలవడం వల్ల నిండుకుండగా మారింది. ఈ పంప్ హౌస్ నుంచే మధ్యమానేరుతో పాటు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా గోదావరి నది జలాలు తరలిస్తుండటంతో ఈ ప్రాంతం గోదావరి జలాలతో కళకళలాడుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.