ETV Bharat / city

వాతావరణ మార్పు... పాడిపరిశ్రమకు తెచ్చెను ముప్పు

author img

By

Published : Feb 21, 2020, 10:54 AM IST

తెలంగాణను పాల కొరత ఇబ్బంది పెడుతోంది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌ల నుంచి రోజూ హైదరాబాద్‌కు పాలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య(విజయ డెయిరీ)కు పాల విక్రయం దారుణంగా పడిపోవడం వల్ల ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ తక్కువ ధరకు పాలు దొరుకుతాయా అని రోజూ వెదుకుతోంది.

The dairy industry got down due to climate changes in telangana
వాతావరణ మార్పు... పాడిపరిశ్రమకు తెచ్చెను ముప్పు

రాష్ట్రాన్ని పాల కొరత వేధిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్యకు పాల విక్రయం పడిపోయింది. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ తక్కువ ధరకు పాలు దొరుకుతాయా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత జాతీయ సహకార డెయిరీ సమాఖ్య’(ఎన్సీడీఎఫ్‌ఐ) రోజూ ఈ వేలం ద్వారా ఆన్‌లైన్‌లో పాలను విక్రయాలకు పెడుతోంది. దేశవ్యాప్తంగా 27 ప్రధాన సహకార డెయిరీల్లో ఎక్కడ అధికంగా పాలు ఉన్నాయి, ఎంత ధరకు విక్రయిస్తారనేది ఈ వేలంలో ప్రకటిస్తారు. అవసరమున్న తెలంగాణ వంటి రాష్ట్ర డెయిరీలు తాము కొనదలచిన ధరలను ఇందులో కోట్‌ చేస్తాయి.

విజయ డెయిరీకి రోజూ 3.50 లక్షల లీటర్ల పాలు అవసరం. కానీ రాష్ట్రంలో రైతుల నుంచి రోజూ 2.20 లక్షల లీటర్లకు మించి రావడం లేదు. ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు నుంచి లీటరు పాలను రూ.41 దాకా చెల్లించి విజయ డెయిరీ రోజూ 1.30 లక్షల లీటర్ల వరకూ కొంటోంది.

వాతావరణ మార్పులే కారణమా?

వాతావరణ మార్పుల ప్రభావం పాడి పరిశ్రమపై తీవ్రంగా ఉంది. ఏటా మార్చి నుంచి జులై వరకూ పాడి పశువులు పాలు తక్కువగా ఇస్తాయి. ఈ ఏడాది జనవరి చివరి నుంచి దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తి తగ్గింది. దీనికితోడు ప్రజల నుంచి డిమాండు పెరగడంతో సరఫరాకు, విక్రయాల మధ్య అంతరం పెరుగుతోంది.

సంక్షోభం ఏర్పడే అవకాశం

సాధారణంగా పాల కొరత ఏర్పడినప్పుడు పాలపొడిని పాలుగా మార్చి ప్రజలకు డెయిరీలు విక్రయిస్తాయి. ఈ కారణంగా డెయిరీల్లో పాలపొడి నిల్వలు అడుగంటాయి. గతేడాది ఈ సమయంలో విజయ డెయిరీలో వెయ్యి టన్నుల పాలపొడి ఉండేది. ఇప్పుడు 200 టన్నులు కూడా లేదు. పాల దిగుబడి తగ్గడం, పాలపొడి నిల్వలు తగ్గిన నేపథ్యంలో వేసవిలో దేశంలో పాల కొరత మరింత పెరిగి సంక్షోభం ఏర్పడే అవకాశాలున్నాయని విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు తెలిపారు. దీనివల్లనే పాల ధరను 44 నుంచి 47కు పెంచాల్సివచ్చిందన్నారు.

పాడి పశువుల పోషణ భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రుణాలిచ్చి పంపిణీ చేసిన పశువులు కూడా పాలు సక్రమంగా ఇవ్వడంలేదని వాపోతున్నారు. రూ.లక్ష వెచ్చించి సంకరజాతి ఆవును కొన్నా... వాతావరణ మార్పుల వల్ల ఈతకు రావడం లేదని జనగామ జిల్లాకు చెందిన నర్సింహ తన గోడు వెల్లబోసుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.