Godavari Projects in Telangana: గోదావరి ప్రాజెక్టుల వేగవంతంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సీతారామ ఎత్తిపోతల, సీతమ్మ సాగర్ ఆనకట్ట పనులు త్వరగా పూర్తయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
SITA RAMA LIFT IRRIGATION PROJECT : రెండు ప్రాజెక్టుల పురోగతిపై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజినీర్లు, గుత్తేదార్లతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా సీతారామ ఎత్తిపోతల, 2023 మార్చి నాటికి సీతమ్మ సాగర్ ఆనకట్ట పనులు పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో రోజువారీ లక్ష్యాలు పెట్టుకొని గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Seethamma Sagar Dam : సీతమ్మ సాగర్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ముఖ్యమంత్రి కార్యాలయం, జలసౌధకు అనుసంధానించాలని చెప్పారు. తద్వారా పనుల పురోగతిని హైదరాబాద్ నుంచే ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వెసులుబాటు కలగనుంది. ఈ నెల 22వ తేదీన ఉన్నతాధికారులు, ఈఎన్సీ సీతమ్మ సాగర్ ఆనకట్ట పనులను పరిశీలించనున్నారు.