ETV Bharat / city

ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయట పడేందుకే గొడవలు రేపారు: పవన్​కల్యాణ్​

author img

By

Published : May 25, 2022, 4:54 PM IST

Pawan kalyan: ఏపీలో జిల్లాల పేర్లు పెట్టేటప్పుడే అంబేడ్కర్​ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని జనసేన అధినేత పవన్​కల్యాణ్​ అన్నారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారా? అని ప్రశ్నించారు. కులసమీకరణతో రాజకీయాలు చేస్తారా? అని ధ్వజమెత్తారు. భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారని ఆరోపించారు. ఈ ఘటనకు వైకాపా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారు: పవన్​కల్యాణ్​
భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారు: పవన్​కల్యాణ్​

భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారు: పవన్​కల్యాణ్​

Pawan kalyan: కోనసీమ ప్రాంతానికి అంబేడ్కర్‌ పేరు పెట్టారని.. అదేదో జిల్లాలకు కొత్త పేర్లు పెట్టినప్పుడే పెడితే అంబేడ్కర్‌ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పవన్‌ అన్నారు. మిగతా జిల్లాలతో పాటు అంబేడ్కర్‌ పెడితే సహజంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. అంబేడ్కర్‌ పేరు పెట్టడంలో జాప్యమెందుకో అర్థం కావట్లేదని... రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములును ఒక జిల్లాకే కుదించారని చెప్పారు. కృష్ణా నది తక్కువగా ఉన్నచోట కృష్ణా జిల్లా పెట్టారని.. ఎక్కువగా ఉన్నచోట ఎన్టీఆర్‌ అని పేరు పెట్టారని అన్నారు. జిల్లా పేర్లకు వ్యతిరేకమైనా.. వ్యక్తులకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. పేర్లు పెట్టేటప్పుడు ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. అభ్యంతరాలుంటే 30 రోజులు సమయమిచ్చి కలెక్టరేట్‌కు రమ్మని చెప్పిన ప్రభుత్వం... మిగతా జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమకే ఎందుకు సమయమిచ్చిందని ప్రశ్నించారు. సామూహికంగా కాదు.. వ్యక్తులుగా రావాలని చెప్పారని.. అది వ్యక్తులను టార్గెట్‌ చేయడమేనని జనసేన భావిస్తోందన్నారు. గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా? అని పవన్​ ప్రశ్నించారు.

దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు: ఏపీ మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారా? అని.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారంటే ఏమనుకోవాలని పవన్‌ నిలదీశారు. ఘోరాలను ఆపకుండా జరిగేలా చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపెచ్చు జనసేనపై ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డారు. కులసమీకరణపై రాజకీయాలు చేస్తారా? ధ్వజమెత్తారు. భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలతో ఎస్సీల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయట పడేందుకే గొడవలు రేపారని దుయ్యబట్టారు.

ప్రభుత్వానిదే బాధ్యత: కులాల మధ్య ఘర్షణ రావణకాష్ఠం లాంటిదని.. కులాల గొడవలు జరిగితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని పవన్​ స్పష్టం చేశారు. ఈ ఘటనకు వైకాపా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. ఇలాంటి వారి ఉచ్చులో పడవద్దని మనవి చేస్తున్నానన్నారు. వైకాపా నేతలు గొడవలు తగ్గించే ప్రయత్నం చేయాలని కోరారు. సజ్జల వంటి పెద్దల అనుభవం కులాల మధ్య గొడవలకు కారణం కాకూడదని హితవు పలికారు.

కోడి కత్తి కేసు ఎంతవరకొచ్చింది: కోడి కత్తి ఘటన విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. కోడి కత్తి కేసు సమయంలో ఏపీ పోలీసులను నమ్మేది లేదని చెప్పి హైదరాబాద్ వెళ్లారన్నారు. వైఎస్‌ వివేకా హత్య విషయంలో వాస్తవాలేంటని నిలదీశారు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ తమ చేతిలో ఉంటే ఎందుకు విచారించట్లేదని నిలదీశారు. తమపై హత్యాయత్నంతో సానుభూతి సంపాదించి ఎన్నికల్లో గెలిచారని అన్నారు. రాందాస్ అథవాలే ఏపీలో అత్యధికంగా 557 అట్రాసిటీ కేసులు ఉన్నాయని చెప్పారని పవన్‌ తెలిపారు.

ప్రజల దృష్టి మరల్చడానికే: మరోవైపు ఎమ్మెల్సీ డ్రైవర్​ హత్యపై పవన్​ స్పందించారు. 3 రోజుల క్రితం వైకాపా ఎమ్మెల్సీ డ్రైవర్‌ను చంపారని.. మృతదేహాన్ని ఇంటికి తెచ్చి పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వ్యక్తి కావడంతో వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కోనసీమలో గొడవలు రేపారని మండిపడ్డారు. కోనసీమకే పేరు పెట్టడం వెనుక ప్రభుత్వ ఆలోచనేంటని నిలదీశారు. కడప జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టవచ్చు కదా? అని పవన్‌ ప్రశ్నించారు.

"రాష్ట్రంలో వైకాపా కుల రాజకీయాలకు ఆజ్యం పోసింది. వైఎస్సార్ కడప జిల్లా పేరు పెట్టినప్పుడు ఎస్సీలు నా వద్దకు వచ్చారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టేలా చూడాలని కోరారు. మొదటి ఎస్సీ ముఖ్యమంత్రి పేరు పెట్టడం మంచిదని సూచించారు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు కర్నూలు జిల్లాకు పేరు పెడతామని చెప్పా. అంబేడ్కర్‌ స్ఫూర్తిని అమలు చేయటం మాని వేరే పనులు చేస్తున్నారు. అంబేడ్కర్‌పై ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సజావుగా అమలు చేయాలి. గత రెండేళ్లలో రూ.10 వేల కోట్లు దారిమళ్లించారు. దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. ఎస్సీలకు ఇవ్వాల్సిన వాహనాలు ఇవ్వడం లేదు. ఎస్సీలకు సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీపరీక్షలకు శిక్షణ ఇవ్వటం ఆపేశారు. అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెనకు నిధులు ఇవ్వటం లేదు." -పవన్‌ కల్యాణ్​, జనసేన అధినేత

నిండు గర్భిణిపై అత్యాచారం జరిగింది: కోనసీమ ఘటనపై హోంమంత్రి మాట్లాడారని... జనసేన మరికొందరి పాత్ర ఉందని హోంమంత్రి చెప్పారని పవన్​ అన్నారు. అత్యాచారాలకు పాల్పడేవారు తల్లి పెంపకం సరిగా లేకపోవడం వల్లేనని మాట్లాడారని చెప్పారు. రేపల్లె రైల్వే స్టేషన్‌లో నిండు గర్భిణిపై అత్యాచారం జరిగిందని గుర్తుచేశారు. అమరావతి ఎస్సీ రైతులపై ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో బాలికపై అత్యాచారం జరిగిందని... హైకోర్టు ఏదైనా తీర్పు ఇస్తే న్యాయమూర్తులను తిట్టేస్తారని మండిపడ్డారు. ఉద్యోగులు జీతాల కోసం రోడ్డుపైకి వస్తే వాళ్లను బెదిరిస్తారని పవన్‌ విమర్శించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.