ETV Bharat / city

'హైదరాబాద్‌ను యూటీగా మార్చే ప్రమాదం'

author img

By

Published : Feb 14, 2021, 9:47 AM IST

హైదరాబాద్​ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదముందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇదే భాజపా విధానమని, అందులో భాగంగానే కశ్మీర్​ను ఒక ఉదాహరణగా మార్చారని పేర్కొన్నారు.

making-hyderabad-a-union-territory
హైదరాబాద్‌ను యూటీగా మార్చే ప్రమాదం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. శనివారం లోక్‌సభలో జమ్మూకశ్మీర్‌ విభజన చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

‘‘చెన్నై, బెంగళూరు, ముంబయి, అహ్మదాబాద్‌, లఖ్‌నవూలనూ కేంద్రపాలిత ప్రాంతాలు(యూటీలు)గా మార్చేస్తారు. ఇదే భాజపా విధానం. అందులో భాగంగానే కశ్మీర్‌ను ఒక ఉదాహరణగా మార్చారు. ఇప్పుడు దీన్ని చూసి కరతాళ ధ్వనులు చేసే సెక్యులర్‌గా చెప్పుకొనే కొన్ని పార్టీల వారు భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలను యూటీలుగా మార్చినప్పుడు గగ్గోలు పెట్టడం ఖాయం. ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలు అప్పటి పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’’ అని ఒవైసీ హెచ్చరించారు.

జమ్మూకశ్మీర్‌ సమస్యను అంతర్జాతీయం చేయడం తప్పు

‘‘జమ్మూకశ్మీర్‌లో 4జీ ఏమీ ప్రజలపై దయతలచి ఇవ్వలేదు. అమెరికా ఒత్తిడితోనే ఉన్నట్టుండి ఆ సౌకర్యం పునరుద్ధరించారు. అమెరికా ప్రకటన చేసిన రెండురోజుల్లోనే 4జీ ఇవ్వడం దేనికి సంకేతం? జమ్మూకశ్మీర్‌ సమస్యను అంతర్జాతీయం చేయడం తప్పు. దీనివల్ల అక్కడి ప్రజల్లో మరింత అసంతృప్తి పెరుగుతుంది. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేటప్పుడు సాధ్యమైనంత త్వరలో రాష్ట్ర హోదా కల్పిస్తామన్న వాగ్దానం నుంచి కేంద్రం వెనక్కు తగ్గుతోంది. అక్కడ కేడర్‌ అఖిలభారత సర్వీసు అధికారులను ఏజీఎంయూటీ కేడర్‌లో విలీనం చేయాలని నిర్ణయించడమే అందుకు నిదర్శనం. ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న ఆ రాష్ట్రంలోని అధికారుల్లో ఆ వర్గం సంఖ్య చాలా తక్కువ ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 68.37% ముస్లింలు, 28% మంది హిందువులున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో రాజ్యసభలో ఒక్క కశ్మీరీ పార్లమెంటేరియన్‌ లేకుండా పోయారు’’ అని అసదుద్దీన్‌ ఓవైసీ మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

* కేంద్ర బడ్జెట్‌లో మైనారిటీ వ్యవహారాల శాఖకు రూ.5,209 కోట్లు కేటాయించి సవరించిన అంచనాల్లో రూ.1,024 కోట్లు కోత పెట్టి రూ.4,005 కోట్లకు పరిమితం చేశారని ఒవైసీ ట్వీటర్‌లో పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.