ETV Bharat / city

Congress Deeksha: మూడు చింతలపల్లిలో కాంగ్రెస్​ 48 గంటల దీక్షకు సర్వం సిద్ధం

author img

By

Published : Aug 23, 2021, 4:53 AM IST

దళిత, గిరిజనుల పక్షాన పోరు బాట పట్టిన కాంగ్రెస్‌ 48 గంటల దీక్షకు సిద్దమైంది. ఇప్పటికే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబడుతున్న కాంగ్రెస్‌... రెండు రోజుల దీక్ష ద్వారా పోరు ఉద్ధృతం చేయనుంది. ఏకంగా ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న మూడు చింతలపల్లెనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దీక్షకు వేదికగా ఎంచుకున్నారు.

Congress 48 hours dalitha Deeksha in mudu chinthalapally
Congress 48 hours dalitha Deeksha in mudu chinthalapally

రాష్ట్రంలో దళిత బంధు పేరున ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితులను మోసం చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ... ఆయా వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పోరుబాట పట్టింది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్ధానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చని తెరాస ఇప్పుడు దళిత బంధు పేరున కపట నాటకానికి తెరతీసిందని విమర్శలు చేస్తోంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో లబ్దిపొందేందుకు దళిత బంధును తెచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ఆ పథకానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూనే.. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో అమలు చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా ఈ నెల 9న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు పోరాటాల గడ్డ ఇంద్రవెల్లి నుంచి శ్రీకారం చుట్టిన హస్తం పార్టీ... రావిర్యాలలో రెండో సభ నిర్వహించింది. ఈ రెండు సభలకు అంచనాలకు మించి జనం తరలివచ్చి విజయవంతం అయ్యారని భావిస్తున్న కాంగ్రెస్‌... మూడో సభకు సిద్దమవుతోంది. గజ్వేల్‌లో మూడో సభ ఏర్పాటు చేయాలని మొదట భావించినా... తక్కువ సమయం ఉండడం వల్ల కుదరదనుకున్న కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల ముఖ్య నాయకుల సమావేశం 48 గంటల దీక్షకు గ్రీన్‌ సిగ్నెల్‌ ఇచ్చింది. ఈ దీక్ష కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో జరగాలని నిర్ణయించింది.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తన నియోజకవర్గమైన మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోకి వచ్చే సీఎం దత్తత తీసుకున్న గ్రామంలో రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు దళిత గిరిజన దీక్షకు ఎంచుకున్నారు. రెండు రోజులపాటు అక్కడ దీక్షకు దిగడం వల్ల.... మూడు చింతలపల్లిలో ఏలాంటి అభివృద్ధి జరగలేదని ప్రపంచానికి చూపించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న గ్రామాల్లోనే అభివృద్ధి లేదంటే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్న కోణంలో విమర్శలకు పదును పెట్టాలని హస్తం పార్టీ భావిస్తోంది. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో దుస్థితిని ప్రజల దృష్టికి తెచ్చేందుకు కూడా ఈ మూడు చింతలపల్లిని వేదికగా చేసుకున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

రేవంత్‌ రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు దీక్షలో కూర్చొనే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే సీతక్క ఇప్పటికే మూడు చింతలపల్లిలోనే మకాం వేసి దీక్షకు జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సొంత పార్లమెంటు నియోజక వర్గంలో దీక్షకు దిగుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి... ఈ లోక్​సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో జనం హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రెండు సభలు విజయవంతం అయ్యినట్లు ఈ దీక్ష కూడా విజయవంతం అవుతుందని... కాంగ్రెస్‌ నాయకులు సైతం విశ్వాసంగా ఉన్నారు.

ఇదీ చూడండి:

Revanth Reddy: కేసీఆర్ దత్తత గ్రామం మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన దీక్ష'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.